అది పాత పెంకుటిల్లు కాదు.. పెంపుడు జంతువులకు ఆధునిక వైద్యశాల

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 7 నిమిషాలు
విశాఖ నగరం మధ్యలో కనిపించే ఒక సాధారణ పెంకుటిల్లు ఇది. బయటికి చూస్తే పాతభవనంలా కనిపిస్తుంది. కానీ, లోపల అడుగుపెడితే అదొక ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ పశువైద్య ఆసుపత్రి అని అర్థమవుతుంది.
1910లో నిర్మించిన ఈ ఆసుపత్రి, ఒకప్పుడు పశువుల చికిత్సకు కేంద్రంగా పనిచేసింది. ఆ కాలంలో గుర్రాలు, ఆవులు, గేదెలు తిరిగిన ఈ ప్రాంగణం, ఇప్పుడు కుక్కలు, పిల్లులు, పక్షులు తదితర పెంపుడు జీవులతో కనిపిస్తుంది.
ఆసుపత్రి ప్రాంగణంలోకి అడుగుపెడితే ముందుగా కనిపించేది అదే పాత పెంకుటిల్లు. ఒకప్పుడు ప్రధాన భవనంగా పనిచేసిన ఆ నిర్మాణాన్ని అలాగే ఉంచి, దాని చుట్టూ ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని విస్తరించారు.
నగరీకరణతో పాటు మారిన ప్రజల జీవనశైలి ఈ ఆసుపత్రి స్వరూపాన్నీ మార్చింది.
మరి ఒక సాధారణ పశువుల ఆసుపత్రి ఇప్పుడు ఒక సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా ఎలా మారింది? జంతువులకు ఇక్కడ ఎలాంటి వైద్యసదుపాయాలు అందుతున్నాయి?


ఎవరు నిర్మించారు?
ఈ ఆసుపత్రి ఎవరు నిర్మించారన్న దానిపై పూర్తి ఆధారాలు లేనప్పటికీ బ్రిటిష్ కాలంలో, స్థానిక జమీందార్ల సహకారంతో దీని నిర్మాణం జరిగిందనే అభిప్రాయం చరిత్రకారుల్లో ఉంది.
ఈ ఆసుపత్రికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జంతువులను తీసుకువచ్చేవారు.
"ఇప్పుడున్న ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలన్నీ అప్పట్లో కలిసి ఉండేవి. పశువులు, జంతువులకు వైద్యం అందించేందుకు అందరికీ అందుబాటులో ఇక్కడ ఆసుపత్రి ఉండాలని 1910లో దీన్ని నిర్మించారు" అని ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తు శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు
"బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన రికార్డులు లేవు. అయితే స్థానిక జమీందార్ల ఆర్థిక సహాయంతోనే నిర్మించారని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పట్లో విశాఖపట్నంలో ఉన్న అనేకమంది జమీందార్లు ఆసుపత్రుల నిర్మాణం కోసం భూములు, విరాళాలు, ఆర్థిక సహాయం చేశారు" అని ప్రొఫెసర్ సూర్యనారాయణ చెప్పారు.
"పంటలు, పాడి పశువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వెటర్నరీ ఆసుపత్రులు ఏర్పాటు చేయడం అప్పట్లో సాధారణం. విశాఖపట్నంలో కూడా పాడిపరిశ్రమ, వ్యవసాయం విస్తృతంగా ఉండేది. అదే సమయంలో సింహాచలం ఆలయానికి పశువులను దానంగా ఇవ్వడం, జమీందార్లు గుర్రాలను విరివిగా వినియోగించడం వంటి కారణాలతో ఇక్కడ ఆసుపత్రి అవసరమై ఉండవచ్చు" అని సూర్యనారాయణ చెప్పారు.

పాత బిల్డింగ్… లోపల ఆధునిక చికిత్సలు
బయటికి పాత భవనంలా కనిపించినా… లోపల మాత్రం పూర్తిగా ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
"ఇది 116 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగు. దీనిని చూడగానే పాత ఆసుపత్రి అనుకుంటారు. కానీ ఇది చాలా రిసెర్చ్ ఓరియెంటెడ్ హాస్పిటల్. అడ్వాన్డ్ రిసెర్చ్ అంతా జరుగుతుంది" అని అంటున్నారు ఈ ఆసుపత్రిలో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బసవారెడ్డి.
రోజుకు 150 నుంచి 160 జంతువులు చికిత్స కోసం ఇక్కడికి వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
"కుక్కలను ఎక్కువగా తీసుకొస్తారు. 70 శాతం అవే ఉంటాయి. మిగతావాటిలో 20 శాతం పిల్లులు , 10 శాతం పక్షులు, తాబేళ్లు ఉంటాయి. ఏనిమల్స్కు అడ్వాన్స్‌గా ఈసీజీ, ఎక్స్ రే, స్కానింగ్ చేస్తున్నప్పుడు జంతువులకు కూడా ఈ స్థాయిలో ట్రీట్మెంట్ చేస్తారా అని పెంపుడు జంతువుల యజమానులు ఆశ్చర్యపోతుంటారు" అని డాక్టర్ బసవారెడ్డి అన్నారు.

పెంపుడు జంతువులకు పెద్ద ఆసరా...
ఒకప్పుడు గుర్రాలు, ఆవులు, గేదెలే ఎక్కువగా వచ్చే ఈ ఆసుపత్రి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
"ఇంతకు ముందు పాత కాలంలో ఆవులు, గేదెలకు ఎక్కువగా వైద్య సేవలందించేవారు. ఇప్పుడు విశాఖపట్నం నగరంగా మారిపోవడంతో పెంపుడు జంతువులు అంటే కుక్కలు, పిల్లులు, రకరకాలైన పక్షులు ఎక్కువయ్యాయి" అని బసవారెడ్డి చెప్పారు.
నగరీకరణతో జీవనశైలి మారడం, పెంపుడు జంతువుల హాబీ పెరగడం ఈ మార్పుకు కారణంగా భావించవచ్చని బసవారెడ్డి అన్నారు.

సూపర్ స్పెషాలిటీ సేవలు...
ఇక్కడ కుక్కలు, పక్షుల, పిల్లులు, బాతులు, కోళ్లు, తాబేళ్లు వంటి వాటికి వైద్యం అందిస్తుంటారు. అవసరమైనప్పుడు వాటికి శస్త్రచికిత్సలు కూడా చేస్తారు. ఈ ఆసుపత్రిలో ప్రతి రోజు కనీసం రెండు, మూడు శస్త్ర చికిత్సలు జరుగుతాయని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావడంతో ఇక్కడ అనేక రకాలైన పశువైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.
"రోజుకు 150కి పైగా కేసులు వస్తున్నాయి. ఎక్స్ రేలు, స్కానింగ్‌లు, ఆపరేషన్లు చేస్తున్నాం" అని ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న డాక్టర్ మహేశ్ చెప్పారు.
వెటర్నరీ విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇస్తున్నాం. పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్, అత్యవసర కేసులు, ఉత్తరాంధ్రలో ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చే కేసులకు రిఫరల్ ఆసుపత్రి కావడంతో సీరియస్, క్రిటికల్ కేసులు ఇక్కడికి వస్తుంటాయని వైద్యులు చెప్పారు.
డాక్టర్ ఆర్. మహేశ్ చెప్పిన వివరాల ప్రకారం ఇక్కడ ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయంటే...
- మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ
- ఆపరేషన్ థియేటర్లు
- ఎక్స్-రే, అల్ట్రాసౌండ్
- క్రిటికల్ కేర్ యూనిట్, ఐసీయూ
- ఆధునిక ల్యాబ్‌లు

‘‘జంతువులకూ భావోద్వేగాలుంటాయి...’’
ఈ ఆసుపత్రిలో ఎన్నో అధునిక వైద్య సదుపాయాలున్నా కూడా, మూగ జీవుల బాధను అర్థం చేసుకోవడం వైద్యులకు సవాలేనంటారు డాక్టర్ మహేశ్.
"మనకి ఎలా భావోద్వేగాలు ఉంటాయో జంతువులకు కూడా అలాగే ఉంటాయి. పెంపుడు జంతువులు ఇప్పుడు దాదాపుగా కుటుంబసభ్యులైపోయాయి" అని అన్నారు.
"వైద్యం అందించే సిబ్బందిని కూడా జంతువులు గుర్తు పెట్టుకుంటాయి. వాటికి వైద్య సేవలు చేస్తున్నప్పుడు అవి సైగలు, చూపు ద్వారా తన బాధని వ్యక్తంచేస్తాయి. వైద్యులుగా మేం అది గమనించి తగిన చికిత్స అందిస్తుంటాం. జంతువులు కూడా తమకి వైద్యం అందుతుందని తెలిసినప్పుడు సహకరిస్తాయి" అని డాక్టర్ బసవారెడ్డి చెప్పారు.

భయం…ఆనందం…కృతజ్ఞత
ఇతర ప్రాంతాల్లో చికిత్స ఫలించకపోతే, చివరకు ఇక్కడికి తీసుకువస్తామని యజమానులు చెబుతున్నారు.
"మధురవాడ దగ్గర నాలుగు రోజులు తిప్పాం. చివరికి ఇక్కడికి తీసుకువెళ్లమన్నారు" అని పెట్ ఓనర్ ప్రవీణ్ చెప్పారు.
జంతువుకు ఆపరేషన్ అంటే యజమాని భయపడతారు. కానీ అది కోలుకున్న తర్వాత ఆనందంతో పొంగిపోతుంటారని డాక్టర్ మహేశ్ అన్నారు.
పెంపుడు కుక్కకు చికిత్స విజయవంతం కావడంతో శారద చాలా ఆనందంగా ఉన్నారు.
"చెవికి బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఆపరేషన్ చేశారు. చాలా భయపడ్డాం. కానీ ఇప్పుడు బాగుంది" అని బీబీసీతో అన్నారు శారద.
"చాలా సివియర్ కేసు. ఇక్కడికి తీసుకొచ్చాను. వీళ్లే కాపాడారు" అని తన పెంపుడు కుక్కను ఆసుపత్రికి తెచ్చిన మాలతి అన్నారు.
జంతువులు కోలుకున్న తర్వాత యజమానులు స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేస్తుంటారని డాక్టర్ బసవారెడ్డి చెప్పారు.

‘‘మెర్సీ కిల్లింగ్... కఠిన నిర్ణయమే’’
ప్రతి కేసు సంతోషంగా ముగియదు. కొన్ని సందర్భాల్లో జంతువుల బాధను తగ్గించేందుకు వైద్యులు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని డాక్టర్ మహేశ్ చెప్పారు.
"కొన్ని లక్షణాల ద్వారా జంతువుల బాధను గుర్తిస్తాం. యూథనైజేషన్ లేదా మెర్సీ కిల్లింగ్ గురించి పెట్ యజమానికి చెప్తాం. ఇలా బాధపడటంకంటే మెర్సీ కిల్లింగ్ ద్వారా వాటికి మరణాన్ని ప్రసాదించడం మంచిదని చెప్పి, వాళ్లు ఒప్పుకుంటేనే ప్రొసీడ్ అవుతాం" అని డాక్టర్ మహేశ్ వెల్లడించారు.
‘‘ఇలా చెప్పడం చాలా కష్టమైన పని’’ అని ఆయన అన్నారు.

‘‘యూనివర్సిటీకి అప్పగించాక కొత్త దశ’’
ఈ ఆసుపత్రి మొదట పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నడిచింది. 2009లో దీనిని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అప్పగించారు.
యూనివర్సిటీ పరిధిలోకి వెళ్లకముందే కొన్ని ఆధునిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఎస్వీవీయూ పరిధిలోకి వచ్చిన తర్వాతే క్లిష్టమైన, సీరియస్ కేసులకు ప్రత్యేక నిపుణులతో అధునాతన వైద్యం అందించే పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చెందిందని డాక్టర్ బసవారెడ్డి తెలిపారు.
"వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వెటర్నరీ విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ, పరిశోధన కార్యకలాపాలు బలోపేతం చేయడం, అలాగే అధునాతన వైద్యసేవలను విస్తరించేందుకు 2009లో ఈ ఆసుపత్రిని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అప్పగించారు" అని డాక్టర్ మహేశ్ తెలిపారు.

‘‘జంతువుల ఆరోగ్యంతో మన ఆరోగ్యం’’
జంతువులను పెంచడం మాత్రమే కాదు, వాటి ఆరోగ్యం గురించి అవగాహన కూడా అవసరమని వైద్యులు చెప్పారు.
"జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులను జూనోటిక్ డిసీజెస్ అంటాం. అందుకే పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి. అలాగే అవసరమైన వైద్య పరీక్షలను పెంపుడు జంతువుల యజమానులు కూడా అప్పడప్పుడు చేయించుకోవాలి" అని డాక్టర్ బసవారెడ్డి సూచిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































