ఆ తెల్లని చిన్నచిన్న ప్యాకెట్లు మీ కొత్త వాటర్ బాటిళ్లు, బూట్లలో ఎందుకు కనిపిస్తాయి? ఎందుకు వేస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
మీరు కొనే వాటర్ బాటిళ్లలో.. కొత్త బూట్లలో.. ఎలక్ట్రానిక్ వస్తువుల బాక్సుల్లో.. లేదా వివిధ రకాల వస్తువుల ప్యాకెట్లలో చిన్న చిన్న తెల్లటి ప్యాకెట్లు ఎప్పుడైనా గమనించారా!
కొత్త వాటర్ బాటిల్‌నే తీసుకుందాం. అందులో నీళ్లు నింపే ముందు శుభ్రంగా కడుగుతాం. అంతకంటే ముందు అందులోని చిన్న తెల్లటి ప్యాకెట్ తీసి పారేస్తాం. అయితే, ఆ ప్యాకెట్లు కొత్త వస్తువుల్లో ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా?
వాటిని సిలికా జెల్ ప్యాకెట్లు అని పిలుస్తారు.
ఈ ప్యాకెట్ల వల్ల తేమ చేరదని, తద్వారా వస్తువు పాడయ్యే అవకాశం ఉండదని ఉస్మానియా యూనివర్సిటీ రసాయనశాస్త్ర విభాగం ఆచార్యులు మురళీధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు. ఈ సిలికా జెల్‌తో మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయని వివరించారు.
అలాగే, సిలికా జెల్ ప్యాకెట్లతో ఆరోగ్య పరంగానూ ఎలాంటి నష్టం కలగదని వైద్యులు చెబుతున్నారు.

అసలు ఏమిటీ సిలికా జెల్?
సిలికా జెల్ – పేరులో 'జెల్' అని ఉన్నప్పటికీ ఇది ఒక గట్టి పదార్థం. మనకు కనిపించే ప్యాకెట్లలో చిన్నటి గుండ్రటి బాల్స్‌లా ఈ పదార్థం ఉంటుంది.
సిలికాన్ డయాక్సైడ్ మరో రూపం లేదా పోరస్ రూపంగా సిలికా జెల్‌ను పిలుస్తారు.
సోడియం సిలికేట్‌కు సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి ద్రావణాలను కలిపి తక్కువ ఖర్చుతోనే సిలికా జెల్‌ను తయారు చేయవచ్చని 2020 అక్టోబరులో 'ఎల్స్‌వియర్ జర్నల్'లో ప్రచురితమైన పరిశోధన పత్రం ద్వారా తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
తేమ, ఫంగస్ చేరితే గ్రహించేలా..
సాధారణంగా, కొత్త వస్తువులు తయారీ నుంచి కస్టమర్లకు విక్రయించే మధ్య చాలా సమయం ఉంటుంది.
కొన్నిసార్లు నెలల తరబడి సమయం పట్టవచ్చు. దీనివల్ల తేమ లేదా ఫంగస్ చేరి వస్తువులు పాడయ్యే ప్రమాదం ఉంది. అలాంటి వాటిని కస్టమర్లు కనుగోలు చేసేందుకు ఇష్టపడరు.
మెటల్‌తో తయారు చేసిన వస్తువులు తేమ తగిలితే తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. లెదర్ వస్తువులైతే ఫంగస్ చేరి పాడవుతాయి లేదా చెడువాసన వచ్చే అవకాశం ఉంటుంది.
అలాంటి వస్తువుల్లో తేమ లేదా ఫంగస్ వంటివి రాకుండా సిలికా జెల్ నియంత్రిస్తుందని ప్రొఫెసర్ మురళీధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
"సిలికా జెల్ అనేది పోరస్ రూపంలో... అంటే చిన్నచిన్న రంధ్రాలతో ఉంటుంది. ఇది చుట్టుపక్కల ఉండే ప్రదేశాల నుంచి తేమను గ్రహిస్తుంది" అని ఆయన వివరించారు.
సిలికా జెల్ తేమను గ్రహించడంలో ఎంతో సమర్థంగా పనిచేస్తుందని 2024 ఆగస్టులో 'ఎల్స్‌వియర్ జర్నల్'లో ప్రచురితమైన పరిశోధనా పత్రం స్పష్టం చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒకే ప్యాకెట్ మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చా?
వస్తువుల ఉపరితలంపై ఉన్న తేమను సిలికా జెల్ గ్రహిస్తుందని పరిశోధనల్లో తేలింది.
సిలికా జెల్ ఇసుక వంటి పదార్థం అని మురళీధర్ రెడ్డి వివరించారు. దీనికి మండే స్వభావం ఉండదని, రంగు, వాసన కూడా ఉండవని తెలిపారు.
సిలికా జెల్ ప్యాకెట్లను కొందరు మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. వాటిని ఇంట్లోని బట్టలు ఉంచే కబోర్డులలో, బియ్యం డబ్బాల్లో వేస్తుంటారు.
అలా చేయడం ప్రమాదకరమేమీ కాదని, అందులోని తేమ ఆరిపోయిన తర్వాత తిరిగి ఉపయోగించుకోవచ్చని మురళీధర్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అనుకోకుండా తింటే ఏమవుతుంది?
సిలికా జెల్ ప్యాకెట్లపై 'డూ నాట్ ఈట్(తినకూడదు)' అని ఉంటుంది.
తేమ గ్రహించడం కోసం వినియోగిస్తే మాత్రం ఎలాంటి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉండదని హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ హరికిషన్ బీబీసీతో చెప్పారు.
"సిలికా జెల్ వల్ల ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు ఉంటాయని ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఇసుక వంటి పదార్థం కావడం వల్ల ప్యాకెట్లు లేదా అవి ఉంచిన వస్తువుల వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం లేదు" అని డాక్టర్ హరికిషన్ వివరించారు.

ఫొటో సోర్స్, UGC
అయితే, పిల్లలు పొరపాటున వీటిని తింటే గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుందని ప్రొఫెసర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. పెద్దగా ప్రమాదం కాకపోయినప్పటికీ, వాంతులు వంటి ఇబ్బందులు ఎదురుకావచ్చని చెబుతున్నారు.
"తేమను గ్రహించడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో కొన్నిసార్లు సిలికా జెల్ ప్యాకెట్లలో కోబాల్ట్ క్లోరైడ్‌ను కూడా కలుపుతుంటారు. దాన్ని పొరపాటున తిన్నా గానీ భయపడకూడదు. ఎక్కువగా నీరు తాగాలి. బలవంతంగా వాంతులు చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి" అని వివరించారాయన.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































