పోర్చుగల్‌లో భారత గర్భిణి ఎలా చనిపోయారు, ఆ దేశ ఆరోగ్య మంత్రి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?

ఫొటో సోర్స్, Getty Images
భారత్ నుంచి పర్యటకురాలిగా వచ్చిన ఓ గర్భిణి ప్రసూతి వార్డులో చోటు లేక మృతి చెందడంతో పోర్చుగల్ ఆరోగ్య మంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
లిస్బన్ నగరంలో ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి మార్చినప్పుడు గుండె పోటుతో బాధిత గర్భిణి (34) మరణించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆరోగ్య మంత్రి పదవికి మార్టా రాజీనామాకు ఇది ఒక్కటే కారణం కాదు. గత కొన్ని నెలలుగా పోర్చుగల్‌లోని ప్రసూతి ఆసుపత్రులలో సిబ్బంది కొరత ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2018 నుంచి పోర్చుగల్ ఆరోగ్య మంత్రిగా మార్టా పనిచేస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి సమయంలో దేశంలోని ఆరోగ్య సేవలు కుప్పకూలకుండా చూడటంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు.
అయితే, ‘‘ఇకపై ఈ పదవిలో తాను కొనసాగకూడదని డాక్టర్ మార్టా నిర్ణయించుకున్నారు’’అని ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
అది రాజీనామాకు చివరి కారణం
భారత గర్భిణి మృతి అనేది డాక్టర్ మార్టా రాజీనామాకు చివరి కారణమని పోర్చుగల్ ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా వ్యాఖ్యానించినట్లు లుసా వార్తా సంస్థ తెలిపింది.
మరోవైపు మార్టా రాజీనామాకు తాను ఆమోదం తెలిపినట్లు కోస్టా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇప్పటివరకు సేవలు అందించినందుకు ధన్యవాదాలని చెప్పారు.
లిస్బన్‌లోని అతిపెద్ద శాంటా మారియా హాస్పిటల్‌లోని నియోనటాలజీ యూనిట్‌లో చేర్చుకునేందుకు అనుమతించకపోవడంతో వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా బాధిత మహిళ మరణించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
‘‘బాధితురాలికి అత్యవసరంగా సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు. నెలలు నిండకుండానే జన్మించిన ఆ 722 గ్రాముల నవజాత శిశువును ఐసీయూలో పెట్టారు’’అని లిస్బన్‌లోని ఫ్రాన్సిస్కో జేవియర్ హాస్పిటల్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం నవజాత శిశువు వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నట్లు ఆ ఆసుపత్రి వెల్లడించింది. బాధిత మహిళ మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
నెలలుగా..
పోర్చుగల్‌లో కొన్న నెలలుగా ఇలాంటి కేసులు చాలా వెలుగుచూస్తున్నాయి. కొన్ని కేసుల్లో ఇలా ఆసుపత్రుల చుట్టూ తిప్పడం వల్ల నవజాత శిశువులు కూడా మరణించారు.
పోర్చుగల్‌లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. దీంతో విదేశాల నుంచి నిపుణులను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
దేశంలో ఇప్పటికే చాలా ప్రసూతి వార్డులు మూతపడ్డాయి. దీంతో మిగతా ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు గర్భిణులు చికిత్స కోసం వేచిచూడాల్సిన సమయం కూడా పెరుగుతోంది.
ఆరోగ్య సిబ్బంది కొరత వల్ల చాలా ఆసుపత్రులను మూసేస్తున్నట్లు డాక్టర్ మార్టా వెల్లడించారు. మరోవైపు వారాంతాల్లో కొన్ని ఆసుపత్రులు అసలు పనిచేయడం లేదు.
ఈ పరిస్థితికి డాక్టర్ మార్టానే కారణమని విపక్షాలు, మున్సిపల్ సంస్థలు, వైద్యుల సంఘాలు, నర్సులు విమర్శలు చేస్తున్నారు.
ప్రసూతి సేవలను నిలిపివేయడం వల్ల గర్భిణులు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోందని, ఇది చాలా ముప్పులతో కూడుకున్న ప్రయాణమని వారు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆమె దగ్గర పరిష్కారం లేదు’’
ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మార్టా దగ్గర ఎలాంటి పరిష్కారమూ లేదని, అందుకే ఆమె రాజీనామా చేయాల్సి వచ్చిందని పోర్చుగల్ వైద్యుల సంఘం ప్రెసిడెంట్ మీగల్ గ్యూమరేస్ వ్యాఖ్యానించారు.
ఇలాంటి సంక్షోభం నడుమ మార్టా రాజీనామా చేయడంతో షాక్‌కు గురయ్యానని పోర్చుగల్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుస్తావో టాటో బోర్జెస్ అన్నారు.
కరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రవేశపెట్టిన ఆరోగ్య సేవలు, కార్యక్రమాలకు మార్టాపై మీడియాలో ప్రశంసలు కురిశాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ను కూడా ఆమె మెరుగ్గా ముందుకు తీసుకెళ్లారని విమర్శకులు ప్రశంసించారు.
గత ఏడాది నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆంటోనియో కోస్టా క్యాబినెట్‌లో మార్టాకే ఎక్కువగా ప్రజల మద్దతు లభించింది.
ఇవి కూడా చదవండి:
- ప్రిజన్ క్యాంప్-120: ఈ జైలులో అసలేం జరిగింది... 50 మంది ఖైదీలు ఎలా కాలి బూడిదయ్యారు?
- కాంగ్రెస్, బీజేపీల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఎలా జరుగుతుంది?
- పీరియడ్స్ నొప్పులు మగవాళ్ళకు ఎందుకు వస్తున్నాయి?
- ప్రేమించలేదని నిద్రిస్తున్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు, కాలిన గాయాలతో విద్యార్థిని మృతి
- కోబ్రా రివ్యూ: ఏడు గెటప్‌లు... విక్రమ్‌లోని ‘అపరిచితుడు’ ఇంకా బయటపడడం లేదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













