ఆన్‌లైన్ క్లాసులో పిల్లి - టీచర్ తొలగింపు.. న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రూ. 5 లక్షల పరిహారం

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్ క్లాసులోకి పిల్లి వచ్చిందని చెప్పి టీచర్‌ను ఉద్యోగం నుంచి తీసేసింది చైనాలోని ఒక యాజమాన్యం
ఇది అన్యాయమంటూ కోర్టుకు వెళ్లిన ఆ టీచర్, కంపెనీ మీద న్యాయపోరాటంలో నెగ్గారు. ఆమెకు 40 వేల యువాన్లు అంటే సుమారు రూ.5 లక్షలు పరిహారం పొందారు.
చైనాకు చెందిన ల్యూ.. గ్వాంగ్జూలో ఆర్ట్ టీచర్‌గా పని చేసేవారు. గత ఏడాది జూన్‌లో ఆన్‌లైన్‌లో క్లాస్ చెబుతున్నప్పుడు ఆమె పెంపుడు పిల్లి మధ్యలో వచ్చింది. ఇలా అయిదు సార్లు పిల్లి కెమెరా ముందు కనిపించింది.
దాంతో ఆ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే కంపెనీ ఆమెను ఉద్యోగం నుంచి తీసేసింది. అందుకు కారణం ఆన్‌లైన్ క్లాసులో పిల్లి కనిపించడం అని కూడా చెప్పింది.
విద్యార్థులకు క్లాసులు చెప్పాల్సిన సమయంలో ల్యూ 'నాన్-టీచింగ్' కార్యకలాపాలకు పాల్పడ్డారని కంపెనీ ఆరోపించింది. అలాగే అంతకు ముందు రోజు క్లాస్‌కు 10 నిమిషాలు ఆమె ఆలస్యంగా వచ్చారని కూడా కారణం చూపింది.
కంపెనీ తనను ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమంటూ ఆర్బిట్రేషన్‌కు వెళ్లారు ల్యూ. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని చెబుతూ పరిహారం చెల్లించాల్సిందిగా కంపెనీకి ఆదేశాలు వచ్చాయి.
కానీ కంపెనీ ల్యూకు పరిహారం చెల్లించేందుకు ఇష్టపడలేదు. ఆర్టిట్రేషన్‌లో వచ్చిన ఆదేశాలను కోర్టులో సవాలు చేసింది ఆ కంపెనీ.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసును విచారించిన గ్వాంగ్జూలోని గ్వాంగ్జూ తియాన్హే పీపుల్స్ కోర్టు న్యాయమూర్తి లియావో యాజింగ్.. ల్యూను ఉద్యోగం నుంచి తీసివేయడాన్ని తప్పు పట్టారు.
ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి, ఆఫీసు నుంచి పని చేయడానికి తేడా ఉంటుందని జడ్జి వ్యాఖ్యానించారు.
'ఉద్యోగులు ఆఫీసులో పని చేసినట్లుగా ఇంటి నుంచి చేయాలని కంపెనీలు ఆశించకూడదు' అని జడ్జి అన్నట్లు ది సెంట్రల్ రేడియో నెట్‌వర్క్ రిపోర్ట్ చేసింది.
'సంస్థల యాజమాన్యాలు రూపొందించే నిబంధనలు ప్రభుత్వ చట్టాలకు లోబడి ఉండటమే కాదు, పారదర్శకంగా హేతుబద్ధంగా ఉండాలి' అని జడ్జి అన్నారు.
చివరకు ల్యూకు 40 వేల యువాన్లు చెల్లించాల్సిందిగా ఆదేశించారు.
కరోనావైరస్ వల్ల తలెత్తిన సంక్షోభంతో గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో లాక్‌డౌన్ విధించారు. దీంతో కంపెనీల నుంచి పాఠశాలల వరకు ఆన్‌లైన్ ద్వారానే నడిచాయి.
కోర్ సబ్జెక్టులను బోధించడం ద్వారా లాభాలు ఆర్జించకుండా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కంపెనీలను పోయిన ఏడాది చైనా నిషేధించింది. ఈ రంగంలోని కంపెనీల్లో విదేశీ పెట్టుబడుల మీద కఠిన ఆంక్షలు విధించింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మొత్తం అప్పులు తీర్చడానికి ఆ కంపెనీ 6 నెలల లాభాలు చాలు
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రానుందా? సోషల్ మీడియాలో చర్చ ఎందుకు మొదలైంది
- ముస్లింలు తలాక్- ఏ- హసన్ పద్ధతిలో భార్యకు విడాకులు ఇవ్వడం నేరం కాదా?
- ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













