టీ20 వరల్డ్ కప్ IndvsNZ: భారత్ న్యూజీలాండ్ చేతిలో ఓడిపోతే ఏమవుతుంది?

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, MATTHEW LEWIS-ICC/ICC VIA GETTY IMAGES

టీ20 వరల్డ్ కప్‌లో ఈరోజు భారత్-న్యూజీలాండ్ జట్లు తలపడబోతున్నాయి. రెండు జట్లకూ ఈ మ్యాచ్ చాలా కీలకం.

భారత్ ఇటీవల పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఇక ప్రపంచకప్‌లో జరగాల్సిన మ్యాచుల్లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గత మ్యాచుల్లో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటామని అన్నారు.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎక్కడ పొరపాట్లు జరిగాయో, టీమ్‌కు తెలుసని ఆయన రాయిటర్స్‌తో అన్నారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాకిస్తాన్ చారిత్రక విజయం సాధించింది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్‌కు ఇది తొలి ఓటమి.

భారత జట్టు పాకిస్తాన్ టీమ్‌ను లైట్‌గా తీసుకుందనే ఆరోపణలు కూడా విరాట్ కోహ్లీ తోసిపుచ్చాడు.

"అక్కడ మనం ఏదీ లైట్‌గా తీసుకుని వెళ్లలేం. ముఖ్యంగా రోజు తనదైనప్పుడు ఏ జట్టునైనా ఓడించగలిగిన పాకిస్తాన్ లాంటి టీమ్ ఎదురుగా ఉన్నప్పుడు.. మేం ఆటను గౌరవిస్తాం. ప్రత్యర్థి జట్టును మేం ఎప్పుడూ తేలిగ్గా తీసుకోం" అన్నాడు.

టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇక జరగబోయే మ్యాచ్‌లు చాలా కీలకం కాబోతున్నాయి. ఈరోజు(అక్టోబర్ 31) మ్యాచ్ న్యూజీలాండ్‌తో జరగబోతోంది. సెమీఫైనల్ చేరుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌ను గెలవడం తప్పనిసరి.

ప్రస్తుత పరిస్థితులను చూస్తే భారత్-న్యూజీలాండ్ రెండూ ఈ మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఢీకొంటున్నాయి.

న్యూజీలాండ్ ఇండియా

ఫొటో సోర్స్, FIONA GOODALL/GETTY IMAGES

సెమీఫైనల్‌‌కు దారులు వేస్తారా

గ్రూప్ 2లోని ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాయి. ఇప్పుడు అవి ఒకదాన్ని ఒకటి ఓడించనిదే సెమీ ఫైనల్ చేరడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

గ్రూప్ 2లో పాకిస్తాన్, న్యూజీలాండ్, భారత్, నమీబియా, స్కాట్లాండ్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. పాకిస్తాన్ ఈ గ్రూప్‌లో భారత్, న్యూజీలాండ్, అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు ఆడి, మూడూ గెలిచింది. పాకిస్తాన్ గ్రూప్ 2లో టాప్‌కు చేరుకుని సెమీ ఫైనల్లో స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది.

గ్రూప్ 2 నుంచి రెండు జట్లే ఫైనల్ చేరుకుంటాయి. ఇప్పుడు ఇక ఒక జట్టుకే సెమీ ఫైనల్ స్థానం ఖాళీగా ఉంది. భారత్, న్యూజీలాండ్ జట్లు ఆ చోటు దక్కించుకోవాలంటే ఈరోజు అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది.

భారత్, న్యూజీలాండ్ ఇంకా అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ ఈరోజు జరిగే మ్యాచ్ ఎంత కీలకం అనేది ఇప్పుడు చూద్దాం.

న్యూజీలాండ్ ఇండియా

ఫొటో సోర్స్, MARK FLETCHER/MI NEWS/NURPHOTO VIA GETTY IMAGES

పాయింట్ల ఆట

భారత్, న్యూజీలాండ్ రెండూ బలమైన జట్లు. పెద్ద టోర్నీల్లో మంచి ప్రదర్శన కనపరుస్తూ వచ్చాయి. ఈ రెండు జట్లూ అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై గెలుస్తాయని అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది?

అదే జరిగితే రెండు జట్లకూ 6-6 పాయింట్లు ఉంటాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్ న్యూజీలాండ్‌ను ఓడిస్తే జట్టుకు మొత్తం 8 పాయింట్లు వస్తాయి. న్యూజీలాండ్‌కు 6 పాయింట్లే ఉంటాయి. అప్పుడు పాకిస్తాన్, భారత్ పక్కాగా సెమీఫైనల్‌కు చేరుతాయి.

ఒకవేళ న్యూజీలాండ్ ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తే న్యూజీలాండ్‌కు కూడా 8 పాయింట్లు వస్తాయి. భారత్‌కు 6 పాయింట్లే ఉంటాయి. పాకిస్తాన్‌, న్యూజీలాండ్ సెమీఫైనల్‌కు చేరుతాయి.

అయితే అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాను ఓడించినప్పుడే భారత్, న్యూజీలాండ్‌కు ఈ సమీకరణాలు ఉపయోగపడతాయి. కానీ, ఆటలో ఏదీ కచ్చితంగా చెప్పలేం. విజయం అటూఇటూ అయ్యే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ దానికి గట్టి పోటీ ఇచ్చింది. మ్యాచ్‌ ఫలితాన్ని చివరి వరకూ తీసుకెళ్లగలిగేంత బలమైన జట్టుగా ఎదిగింది. అందుకే అఫ్గానిస్తాన్ ఇప్పుడు న్యూజీలాండ్, భారత్‌కు కూడా సవాలుగా మారవచ్చు.

మరో విషయం కూడా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్‌తో న్యూజీలాండ్ ఓడిపోవడం కూడా భారత్‌కు అనుకూలంగా మారింది. ఒకవేళ న్యూజీలాండ్ పాకిస్తాన్‌ను ఓడించుంటే దానికి కూడా రెండు పాయింట్లు రావడం వల్ల భారత్ జీరోలోనే ఉండేది.

పాకిస్తాన్‌తో ఓడిన తర్వాత భారత్ ఇప్పుడు తన ప్రదర్శనపైనే ఆధారపడలేదు. ఏ జట్టు ఎవరితో ఓడిపోతుంది అనేదానిపై కూడా జట్టు భవిష్యత్తు ఆధారపడింది. సూపర్ 12‌లో రెండు జట్ల పాయింట్లు టై అయితే సెమీ ఫైనల్లో చోటు కోసం మరో పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. అందుకే, నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు సవాళ్లు

భారత్‌కు ఈ మ్యాచ్ గెలవడం ఎంత ముఖ్యమో, జట్టు ముందు అన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. భారత్ తన మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. దాంతో, జట్టు మనోబలంపై ఆ ప్రభావం పడింది.

పాకిస్తాన్ భారత్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించినా, న్యూజీలాండ్ పాకిస్తాన్ కొన్ని వికెట్లు పడగొట్టడంలో సఫలమైంది. అయితే న్యూజీలాండ్‌తో పోలిస్తే భారత్ స్కోర్ మెరుగ్గా ఉంది.

ఒకసారి చరిత్రను గమనిస్తే ప్రపంచకప్‌లో న్యూజీలాండ్‌తో ఆడిన మ్యాచుల్లో భారత్‌కు అంత మంచి రికార్డేం లేదు.

భారత్ న్యూజీలాండ్‌పై చివరగా 2003లో ఓడీఐ ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో గెలిచింది. ఆ తర్వాత 2007, 2016 టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో న్యూజీలాండ్ భారత్‌ను ఓడించింది.

2019 ఓడీఐ ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్లో కూడా భారత్ న్యూజీలాండ్ చేతిలో మూటగట్టుకుంది.

న్యూజీలాండ్‌ను ఓడించడానికి భారత్ ఈ ఒత్తిడులన్నీ అధిగమించాల్సి ఉంటుంది. మనోబలం పెంచుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ 12 ఓటమిల తర్వాత భారత్‌పై విజయం నమోదు చేసినట్లే, భారత జట్టు కూడా సక్సెస్ స్టోరీ రాయాల్సి ఉంటుంది.

షాహీన్ అఫ్రిది

ఫొటో సోర్స్, Getty Images

ప్రారంభంలో వికెట్లు కాపాడుకోవాలి

ఈ మ్యాచ్‌లో భారత జట్టు సరైన వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుందని, పవర్‌ ప్లేలో వికెట్లు ఎక్కువ పడకుండా ఎక్కువ పరుగులు రాబట్టాల్సి ఉంటుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

భారత్ మొదట్లో తన వికెట్లు కాపాడుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అవుట్ అవడం భారత్‌కు కోలుకోలేని దెబ్బతీసిందని నిరూపితమైంది.

గాయపడినప్పటికీ హార్దిక్ పాండ్యను గత మ్యాచ్‌లో జట్టులోకి తీసుకోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. మరోవైపు శార్దూల్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శన కనపరిచినా, ప్లేయింగ్ 11లో అతడికి చోటు దక్కకపోవడంపై కూడా చర్చ జరిగింది. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ స్థానంలో జట్టులో ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్‌కు చోటిచ్చే అవకాశం ఉంది.

న్యూజీలాండ్ ఇండియా

ఫొటో సోర్స్, Reuters

న్యూజీలాండ్ ముందున్న సవాళ్లు

మరోవైపు న్యూజీలాండ్ విషయానికి వస్తే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అది 134 పరుగులే చేయగలిగింది. జట్టులో ఏ ఆటగాడూ 30కి మించి స్కోర్ చేయలేకపోయాడు. ఈరోజు మ్యాచ్‌లో కూడా భారత బౌలర్లు వారిని ముప్పుతిప్పలు పెట్టవచ్చు.

న్యూజీలాండ్ ఫోకస్ అంతా తన బ్యాటింగ్ ఆర్డర్ పై పెట్టాలి. గత మ్యాచ్‌లో డరిల్ మిచెల్, మార్టిన్ గప్తిల్ ఓపెనర్లుగా, జేమ్స్ నీషమ్ నాలుగో స్థానంలో వచ్చినా ఎలాంటి అద్భుతాలూ చేయలేకపోయారు.

మరోవైపు ఒత్తిడి ఉండే చివరి ఓవర్లలో మ్యాచ్ ఫినిషర్లుగా బలమైన ఆటగాళ్ల లోటు కూడా న్యూజీలాండ్ జట్టులో కనిపిస్తోంది. అది దీని గురించి ఆలోచించవచ్చు.

ఒక పెద్ద ఓటమి తర్వాత విజయం సాధించడానికి భారత జట్టు మొత్తం తన సత్తాను ఉపయోగించవచ్చు. దానికి న్యూజీలాండ్ సిద్ధంగా ఉండాల్సుంటుంది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ చాలా కీలకం కాబోతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఎక్కువ మ్యాచ్‌ల్లో తర్వాత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. అలాంటప్పుడు మ్యాచ్ గెలిచే ముందు టాస్ గెలవడం చాలా ముఖ్యం కానుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)