ట్యునీషియా: హింసాత్మక కోవిడ్ నిరసనల నడుమ ప్రధానిపై వేటు.. పార్లమెంటు రద్దు..

ట్యునీషియా

ఫొటో సోర్స్, FETHI BELAID/AFP via Getty Images

ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియా రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతోంది. అక్కడి పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైతే ఇది ‘‘తిరుగుబాటు’’ అంటూ వ్యాఖ్యానించింది.

ప్రధానమంత్రిపై దేశాధ్యక్షుడు ఆదివారం వేటువేశారు. పార్లమెంటును కూడా రద్దుచేశారు.

కరోనావైరస్ వ్యాప్తికి కళ్లెం వేయడంలో ప్రభుత్వం విఫలం కావడమే ఈ సంక్షోభానికి కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. కొన్ని ఆందోళనలు హింసాత్మకంగానూ మారాయి.

ట్యునీషియా వ్యాప్తంగా ఆదివారం ఈ నిరసనలు పెల్లుబికాయి. కొన్నిచోట్ల నిరసనకారులు పోలీసులతో ఘర్షణలకు దిగారు.

ఈ ఘటనల నడుమ ప్రధానమంత్రి హిచమ్ మెకిచీను పదవి నుంచి తప్పిస్తున్నట్లు దేశాధ్యక్షుడు కైస్ సయ్యద్ ప్రకటించారు. కాసేపటి తర్వాత పార్లమెంటును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది.

ట్యునీషియా

ఫొటో సోర్స్, Reuters

దేశాన్ని కాపాడేందుకే..

దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని దేశాధ్యక్షుడు కైస్ సయ్యద్ చెప్పారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు కొత్త ప్రధానమంత్రితో కలిసి పనిచేస్తానని ఆయన అన్నారు.

పరిస్థితులను సమీక్షించేందుకు అత్యవసర భద్రతా సమావేశాన్ని కైస్ నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు.

‘‘దేశాన్ని కాపాడుకునేందుకు, శాంతి స్థాపనకు ఈ నిర్ణయం తప్పనిసరి’’ అని కైస్ చెప్పారు.

ఏదైనా ‘‘అనివార్య పరిస్థితుల్లో’’ పార్లమెంటును రద్దుచేసే అధికారాన్ని అధ్యక్షుడికి ట్యునీషియా రాజ్యాంగం కల్పిస్తోంది.

అయితే, అధ్యక్షుడి చర్యలను ‘‘తిరుగుబాటు’’గా ప్రధాన ప్రతిపక్షం అభివర్ణించింది.

ట్యునీషియా

ఫొటో సోర్స్, Getty Images

నిరసనకారులతో కలిసి అధ్యక్షుడి వేడుకలు

ప్రధానమంత్రిపై వేటు వేశారనే వార్తలు టీవీలో వచ్చిన అనంతరం, నిరసనకారులు వేడుకలు చేసుకోవడం మొదలుపెట్టారు. దేశ రాజధాని ట్యూనిస్‌లో జరిగిన వేడుకల్లో కైస్ కూడా పాల్గొన్నారు.

ఈ నిర్ణయానికి ముందు, అధికార పార్టీకి వ్యతిరేకంగా వేల మంది నిరసనకారులు ప్రదర్శనలు చేపట్టారు. దేశ రాజధాని ట్యూనిస్‌లోనూ ఈ నిరసనలు జరిగాయి.

పార్లమెంటును రద్దు చేయాలని ప్రజలు నినాదాలు చేశారు. పరిస్థితులు నానాటికీ దిగజారడంతో ట్యూనిస్‌లో ప్రధానమైన ‘‘సెంట్రల్ ఎవెన్యూ’’ ప్రాంతంతో అనుసంధానించే రహదారులను భద్రతా బలగాలు మూసివేశాయి. 2011లో ఇక్కడ మొదలైన ‘‘అరబ్ విప్లవం’’లో ఈ ప్రాంతం ప్రధాన పాత్ర పోషించింది.

నిరసనలు చేపడుతున్న వారిపై పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. చాలా నగరాల్లో భద్రతా సిబ్బందితో నిరసనకారులు ఘర్షణలకు దిగారు.

ట్యునీషియా అధికార పార్టీ ఎన్హాదా కార్యాలయాలపైనా నిరసనకారులు దాడులు చేపట్టారు. కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర సామగ్రికి నిప్పు పెట్టారు.

ఈ దాడులను పార్టీ తీవ్రంగా ఖండించింది. కావాలనే కొన్ని నేరస్థుల ముఠాలు ఇలాంటి విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నాయని వ్యాఖ్యానించింది.

ట్యునీషియా అధ్యక్షుడ్ కైస్ సయ్యద్

ఫొటో సోర్స్, FETHI BELAID/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ట్యునీషియా అధ్యక్షుడ్ కైస్ సయ్యద్

‘‘హింసకు పాల్పడితే, సైన్యం చూసుకుంటుంది’’

ఇలాంటి హింస మళ్లీ చెలరేగితే, సైన్యం రంగంలోకి దిగుతుందని నిరసనకారులకు దేశాధ్యక్షుడు కైస్ హెచ్చరించారు.

‘‘ఆయుధాలు చేతుల్లోకి తీసుకుంటున్న వారిని హెచ్చరిస్తున్నాం. మీరు కాల్చే తూటాలకు సైన్యం కూడా తూటాలతోనే సమాధానం చెబుతుంది’’ అని ఆయన హెచ్చరించారు.

ఈ కల్లోలిత వాతావరణం నడుమ, దేశాధ్యక్షుడు తిరుగుబాటు చేశారని ట్యునీషియా స్పీకర్ రైచ్ గనాచీ వ్యాఖ్యానించారు.

‘‘మేం ఇప్పటికీ పార్లమెంటుకే కట్టుబడి ఉన్నాం. ఈ తిరుగుబాటు నుంచి దేశాన్ని ఎన్హాదా పార్టీ మద్దతుదారులు, ట్యునీషియా ప్రజలు కాపాడతారు’’ అని రాయిటర్స్ వార్తా సంస్థతో ఆయన చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ప్రజాస్వామ్యం వచ్చింది కానీ..

సరిగ్గా పదేళ్ల క్రితం ట్యునీషియాలో అరబ్ విప్లవం పుట్టింది. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుకు ఇది బాటలు పరిచింది.

ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వ ఏర్పాటుతో తమ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఇక్కడి ప్రజలు భావించారు. అయితే, వారికి నిరాశే ఎదురైంది.

2011లో వచ్చిన అరబ్ విప్లవానికి దశాబ్దం పూర్తైంది. పది సంవత్సరాల్లో తొమ్మిది ప్రభుత్వాలు మారాయి.

కానీ ఇప్పటికీ దేశాన్ని ఆర్థిక సంక్షోభం పీడిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి ఈ పరిస్థితులను మరింత తీవ్రం చేసింది.

ఇటీవల కాలంలో మళ్లీ పెరుగుతున్న కరోనావైరస్ కేసులు దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి తీసుకొచ్చాయి.

ఆందోళనకర పరిస్థితుల నడుమ గతవారం దేశ ఆరోగ్య మంత్రిపై ప్రధాన మంత్రి మెకిచీ వేటు వేశారు. అయినప్పటికీ, ప్రజల్లో ఆగ్రహావేశాలు చల్లారలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)