అమెరికాలో చమురు సరఫరా వ్యవస్థపై సైబర్ దాడికి ‘వర్క్ ఫ్రం హోం’ కారణమా

COLONIAL PIPELINE

ఫొటో సోర్స్, COLONIAL PIPELINE

అమెరికాలోనే అతి పెద్ద ఇంధన పైప్‌లైన్ వ్యవస్థపై సైబర్ దాడి జరగడంతో ప్రభుత్వం అత్యవసర స్థితి విధించింది.

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్లే దీనిపై దాడికి అవకాశం ఏర్పడిందని.. పైప్‌లైన్‌కు సంబంధించిన ఎక్కువమంది ఇంజనీర్లు వర్క్ ఫ్రం హోమ్ చేస్తుండడం వల్లే ఇలా జరిగిందని నిపుణులు భావిస్తున్నారు.

కొలోనియల్ పైప్‌లైన్ ప్రతిరోజూ 25 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా చేస్తుంది. అమెరికా తూర్పు తీర రాష్ట్రాల్లో డీజిల్, గ్యాస్, జెట్ ఇంధనం అవసరాల్లో 45 శాతం ఈ పైప్‌ లైన్ ద్వారానే జరుగుతాయి.

పైప్ లైన్ వ్యవస్థపై శుక్రవారం ఒక సైబర్ ముఠా దాడి చేసింది. ఆ తర్వాత నుంచి దానిని పునరుద్ధరించే పనులు ప్రారంభమయ్యాయి. అవి ఇంకా కొనసాగుతున్నాయి.

ఎమర్జెన్సీ ప్రకటించడంతో ఇప్పుడు పైప్ లైన్‌కి బదులు అక్కడ నుంచి ఇంధనాన్ని రోడ్డు మార్గం ద్వారా సరఫరా చేసే అవకాశం ఉంది.

దీంతో, సోమవారం నుంచి ఇంధనం ధరలు 2 నుంచి 3 శాతం పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కానీ, సమస్యను త్వరగా పరిష్కరించకపోతే దీని ప్రభావం మరింత విస్తృతంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

COLONIAL PIPELINE

ఫొటో సోర్స్, COLONIAL PIPELINE

దాడి ఎవరు చేశారు

వివిధ వర్గాల నుంచి అంధిన సమాచారం ప్రకారం డార్క్ సైడ్ అనే సైబర్ ముఠా ఈ దాడికి పాల్పడిందని అమెరికా ధ్రువీకరించింది.

గురువారం కొలోనియల్ నెట్‌వర్క్‌లోకి చొరబడ్డ సైబర్ ముఠా దాదాపు 100 జీబీ డేటాను తమ అధీనంలోకి తెచ్చుకుంది.

హ్యాకర్లు ఆ తర్వాత కొన్ని కంప్యూటర్లు, సర్వర్లలో ఉన్న డేటాను లాక్ చేశారు. ఆ సమాచారం విడిపించాలంటే డబ్బు చెల్లించాలని శుక్రవారం డిమాండ్ చేశారు.

తాము అడిగినంత డబ్బు చెల్లించకపోతే, ఆ డేటాను ఇంటర్నెట్‌లో లీక్ చేస్తామని హ్యాకర్లు బెదిరిస్తున్నారు.

కంపెనీలో సేవలను పునరుద్ధరించేందుకు పోలీసులు, సైబర్ భద్రతా నిపుణులు, ఇంధన విభాగాన్ని సంప్రదిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.

ఆదివారం రాత్రి ఇంధనం తీసుకెళ్లే నాలుగు ప్రధాన లైన్లు స్తంభించాయని, టెర్మినల్ నుంచి డెలివరీ పాయింట్ వరకూ వెళ్లే కొన్ని చిన్న లైన్లు మాత్రం పనిచేస్తున్నాయని కంపెనీ ఆదివారం చెప్పింది.

"దాడి గురించి తెలియగానే, మేం మా సిస్టమ్‌లోని కొన్ని లైన్లు కట్ చేసి, వాటిపై సైబర్ దాడి జరగకుండా చేశాం. దాంతో, కాసేపు మా పైప్ లైన్స్ , కొన్ని ఐటీ సిస్టమ్స్ పని నిలిచిపోయింది. ఇప్పుడు వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాం" అని కంపెనీ చెప్పింది.

చమురు మార్కెట్‌ విశ్లేషకులు గౌరవ్ శర్మ బీబీసీతో మాట్లాడుతూ.. టెక్సాస్ రీపైనరీలో ప్రస్తుతం చాలా ఇంధనం చిక్కుకుపోయిందని చెప్పారు. మంగళవారం నాటికి సమస్యను సరిచేయకపోతే అది చాలా పెద్ద కష్టంలో పడుతుందన్నారు.

డార్క్ సైడ్

దాడి ఎలా జరిగింది

కొలోనియన్ పైప్ లైన్ మీద దాడికి ఒక పెద్ద కారణం కరోనా మహమ్మారే కావచ్చని లండన్‌లోని సైబర్ సెక్యూరిటీ కంపెనీ డిజిటల్ షాడోస్ చెప్పింది. ఆ కంపెనీకి సంబంధించిన చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం ఇళ్ల నుంచే పనిచేస్తున్నారని తెలిపింది.

"టీమ్ వ్యూయర్, మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్‌టాప్ లాంటి సాఫ్ట్ వేర్స్‌కు సంబంధించిన లాగిన్ వివరాలను డార్క్ సైడ్ కొనుగోలు చేసి ఉంటుంది" అని డిజిటల్ షాడోస్ సహ-వ్యవస్థాపకులు, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ జేమ్స్ చాపెల్ భావిస్తున్నారు.

"ఇంటర్నెట్‌కు అనుసంధానమైన కంప్యూటర్ల లాగిన్ పోర్టల్స్ సమాచారాన్ని షోడాన్ లాంటి సెర్చ్ ఇంజన్‌ ద్వారా ఎవరైనా చేజిక్కించుకోవచ్చు. తర్వాత హ్యాకర్లు ఆ యూజర్ నేమ్, పాస్‌వర్డుతో ఆయా ఖాతాల్లో లాగిన్ అవడానికి ప్రయత్నించవచ్చు" అని చెప్పారు.

చిన్న పరిశ్రమలు ఇలాంటి దాడులకు గురవుతున్నాయి. దానివల్ల ప్రపంచ స్థాయిలో ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద సమస్య వస్తోంది.

డార్క్ సైడ్

కంపెనీలా పనిచేస్తున్న ముఠా

డార్క్ సైడ్ ముఠా రష్యన్ మాట్లాడే ఒక దేశంలో ఉన్నట్టు డిజిటల్ షాడోస్ గుర్తించింది.

అయితే, డార్క్ సైడ్ సైబర్ నేర ప్రపంచంలో అంత పేరున్నది కాదు. కానీ, ఈ ఘటనతో రాన్సమ్‌వేర్ ఒక వృత్తికి, కార్యాలయానికే కాకుండా ఒక పెద్ద దేశంలోని కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు కూడా ముప్పు తీసుకొస్తాయనేది బయటపడింది.

తాజా దాడితో సైబర్ నేర ప్రపంచం వేల కోట్ల రూపాయల మార్కెట్ ఉన్నదనే విషయం కూడా తెలిసొచ్చింది. ఇప్పటివరకూ సైబర్ భద్రతా నిపుణులు దానిని గుర్తించలేదు.

దాడికి గురైన చమురు సరఫరా కంపెనీ కంప్యూటర్ల స్క్రీన్ మీద ఒక నోటీసుతోపాటూ ఒక ఇన్ఫర్మేషన్ ప్యాక్ కూడా పంపించారు. అందులో మీ కంప్యూటర్లు, సర్వర్లు మా స్వాధీనంలో ఉన్నాయని హ్యాకర్లు చెప్పారు.

ఈ సైబర్ ముఠా తాము చోరీ చేసిన మొత్తం డేటాతో ఒక జాబితా తయారు చేసింది. వాటితో ఒక పేజ్ తయారు చేసి దాని యూఆర్ఎల్(లింక్) పంపించారు. ఆ పేజిలో డేటాను ముందే అప్‌లోడ్ చేసుంచారు. గడువు లోపు డబ్బు చెల్లించకపోతే, ఆ పేజీని పబ్లిష్ చేస్తామని బెదిరించారు.

డార్క్ సైడ్ ఒక బిజినెస్ కంపెనీలా పనిచేస్తోందని లండన్‌లోని సైబర్ సెక్యూరిటీ కంపెనీ డిజిటల్ షాడోస్

చెప్పింది. డేటా చౌర్యం, హ్యాకింగ్ కోసం ఒక సాఫ్ట్ వేర్ తయారు చేసి, నేరాలు చేసేవారికి అందులో ట్రైనింగ్ ఇస్తుందని, వాళ్లకు ఒక టూల్ కిట్ కూడా పంపిస్తుందని తెలిపింది.

"ఆ టూల్‌ కిట్‌లో హ్యాకింగ్ సాఫ్ట్ వేర్ ఉంటుంది. దానితోపాటూ వాళ్లు రాన్సమ్ అడగడానికి ఒక ఈ-మెయిల్ టెంప్లేట్ కూడా పంపిస్తారు. సైబర్ దాడి ఎలా చేయాలో నేర్పిస్తారు. తర్వాత విజయవంతంగా సైబర్ దాడి చేసినవారు, తమ లాభాల్లో డార్క్ సైడ్‌కు ఒక వాటా ఇవ్వాల్సుంటుంది" అని చెప్పింది.

డార్క్ వెబ్‌లో ఈ సైబర్ ముఠాకు ఒక వెబ్ సైట్ కూడా ఉంది. అక్కడ వాళ్లు తమ పని గురించి వివరంగా చెప్పారు. ఇప్పటివరకూ ఏయే కంపెనీలను హ్యాక్ చేశామో కూడా ఇచ్చారు. దానితోపాటూ అందులో వారికి ఒక 'ఎథిక్స్' పేజ్ కూడా ఉంది. అందులో తాము ఏయే కంపెనీలను టార్గెట్ చేయమో డార్క్ సైడ్ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)