కోవిడ్: కొత్త వేరియంట్లను పట్టించుకోకపోవడం వల్లే సెకండ్ వేవ్ వచ్చిందా.. మూడో వేవ్ ఎలా ఉండబోతోంది

ఫొటో సోర్స్, GETTY IMAGES
దేశంలో ఈ ఏడాది మార్చిలో గుర్తించిన కరోనావైరస్ కొత్త వేరియంటే ప్రస్తుత ఈ సెకండ్ వేవ్‌కి కారణం కావచ్చని భారత్ చెబుతోంది. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బి.1.617 వేరియంట్, డబుల్ మ్యూటెంట్ ఉన్న శాంపిళ్లు లభించాయి.
అయితే, ఈ మ్యూటెంట్‌కి.. పెరుగుతున్న కేసులకు సంబంధం ఉందా అనేది నిర్ధరించాల్సి ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారి ఒకరు చెప్పారు.
ఒకే వైరస్‌లో రెండు మ్యూటెంట్లు ఉంటే దానిని డబుల్ మ్యూటెంట్ అంటారు.
భారతదేశంలో బుధవారం కొత్తగా 4,12,000 కేసులు నమోదు కాగా.. 3,980 మంది ప్రాణాలు కోల్పోయారు.
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండగా.. దేశంలో మూడో వేవ్ కూడా రావడం ఖాయమని ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కె.విజయ్ రాఘవన్ హెచ్చరించారు.
కేసులు ఇంత భీభత్సంగా పెరుగుతాయని నిపుణులు ఊహించలేదని కె.విజయ్ రాఘవన్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన పత్రికా సమావేశంలో చెప్పీరు.
వైరస్ వ్యాపిస్తున్న తీరు చూస్తుంటే మూడో వేవ్ రావడం తప్పదని అన్నారు. " కానీ, ఈ మూడో వేవ్ ఎప్పుడు వస్తుందనేది స్పష్టంగా చెప్పలేం. కొత్త వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి" అని అన్నారు.
ప్రస్తుతం పెరుగుతున్న కేసుల వల్ల ఇప్పటికే హాస్పిటల్ బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత, ఆఖరికి దహన వాటికల్లో స్థలం కొరత కూడా ఏర్పడింది.
చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్లు, కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి.
కానీ, ప్రభుత్వం మాత్రం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందేమోననే భయంతో దేశ వ్యాప్త లాక్ డౌన్‌కు సుముఖంగా లేదు.

డబుల్ మ్యూటెంట్ వేరియంట్ ఎక్కడ కనిపించింది?
మొత్తం 8 రాష్ట్రాల్లో 13,000 శాంపిళ్లను సీక్వెన్సింగ్ చేయగా అందులో బి.1.617 వేరియంట్ సహా 3,500కు పైగా ఆందోళనకరమైన వైరస్ వేరియంట్లు కనిపించాయి.
కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ బి.1.617వేరియంట్ కనిపించింది.
"భారతదేశం ఈ మ్యుటేషన్లను పరిశీలించడం చాలా ఆలస్యంగా ప్రారంభించింది. సీక్వెన్సింగ్ ప్రయత్నాలు ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలోనే మొదలుపెట్టింది" అని వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ చెప్పారు.
"మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో యూకే 5-6 శాతం శాంపిళ్లను సీక్వెన్సింగ్ చేస్తే భారతదేశం మాత్రం ప్రస్తుతం 1 శాతం కంటే కాస్త ఎక్కువ శాంపిళ్లను మాత్రమే సీక్వెన్సింగ్ చేస్తోంది. కానీ, ఈ సామర్ధ్యాన్ని రాత్రికి రాత్రి పెంచలేం" అని అన్నారు.
అయితే, ఈ వేరియంట్‌కు, కేసుల పెరుగుదలకు సంబంధం ఉండొచ్చని ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నప్పటికీ ఇంకా ఇది రుజువు కాలేదనీ చెబుతోంది.
"కేసుల పెరుగుదలకు ఎపిడెమియాలాజికల్, క్లినికల్ కారణాలను ఇంకా పూర్తిగా నిర్ధరించలేదు. దీంతో ఇప్పట్లో ఈ వేరియంట్ వల్లే కేసులు పెరుగుతున్నాయని నేరుగా చెప్పలేం. కానీ, పరీక్షల సంఖ్యను పెంచి, త్వరగా ఐసొలేషన్‌లో పెట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు పరచమని రాష్ట్రాలకు సూచించాం" అని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణుడు సుజీత్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కేసుల సంఖ్య ఎలా ఉంది?
దేశంలో బుధవారం అత్యధిక స్థాయిలో కోవిడ్ మరణాలు చోటు చేసుకున్నట్లు చాలా రాష్ట్రాలు చెప్పాయి. ఇందులో ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి.
ఒక్క మహారాష్ట్రలోనే 920 మంది మరణించారు. అయితే, నిజానికి నమోదవుతున్న కేసుల సంఖ్య కంటే కేసులు, మరణాలు ఎక్కువగానే ఉండి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గత వారంలో ప్రపంచంలో మొత్తం నమోదైన కేసుల్లో సగం కేసులు, పావు వంతు మరణాలు ఒక్క భారతదేశంలోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వీక్లీ రిపోర్ట్ పేర్కొంది.
ఈ వారంలో లండన్‌లో జరిగే జి-7 సమావేశానికి హాజరు కావడానికి వెళ్లిన భారతీయ బృందంలో ఇద్దరికి పాజిటివ్ రావడంతో మిగిలిన సభ్యులంతా ఐసొలేట్ కావల్సి వచ్చింది.
వీరితో పాటు విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్ కూడా వెళ్లారు. ఆయన ఈ సమావేశాలకు ఆన్ లైన్ లో హాజరవుతానని చెప్పారు.

వ్యాక్సీన్ల సంగతేమిటి?
భారతదేశం భారీగా రచించిన వ్యాక్సినేషన్ లక్ష్యాలను చేరుకోలేకపోయింది. మొదట్లో జులై నెలకల్లా 30 కోట్ల మందికి వ్యాక్సీన్ ఇవ్వాలని భావించింది. కానీ, తగినన్ని వ్యాక్సీన్ డోసులు లేకపోవడంతో వ్యాక్సీన్ అందరికీ అందలేదు.
140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 20.69 కోట్ల మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నారు.
దేశంలో వ్యాక్సీన్ నిల్వలు బాగా తగ్గిపోయాయి. దానికి తోడు ఇప్పుడు దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సీన్ వేసుకునేందుకు అవకాశం లభించింది.
లాక్ డౌన్లు, వ్యాక్సినేషన్లు మాత్రమే ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మార్గమని నిపుణులు చెబుతున్నారు. కానీ, దీనిని అరికట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంది.
ఇవి కూడా చదవండి:
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








