జో బైడెన్, ఇమ్రాన్ ఖాన్: అమెరికాలో కొత్త ప్రభుత్వంతో పాకిస్తాన్‌కు లాభమా? నష్టమా?

ఫొటో సోర్స్, Samir Hussein/WireImage
- రచయిత, అమృతా శర్మ
- హోదా, బీబీసీ మానిటరింగ్
పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షిస్తున్నారు.
ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచీ పాకిస్తాన్‌తో బైడెన్‌కు మంచి సంబంధాలున్నాయి. 2008లో పాక్ రెండో అత్యున్నత పౌర పురస్కారం హిలాల్-ఇ-పాకిస్తాన్‌ను ఆయనకు ప్రదానం చేశారు.
ఇదివరకటి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో పోలిస్తే.. పాక్ విషయంలో బైడెన్ వైఖరి కొంత మెతకగా ఉంటుందని చాలా మంది పాక్ నిపుణులు భావిస్తున్నారు.
కొత్త విధానాలు, మార్గదర్శకాలతో బైడెన్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ సంసిద్ధత వ్యక్తంచేశారు.
పాక్-అమెరికా ద్వైపాక్షిక బంధాల్లో రెండు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అఫ్గానిస్తాన్‌లో పాక్ పాత్ర మొదటిది; భారత్, చైనాలతో పాక్ సంబంధాలు రెండోది.

ఫొటో సోర్స్, Doug Mills-Pool/Getty Images
అఫ్గాన్ శాంతి స్థాపనలో...
అఫ్గాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం, అక్కడ పాక్ పాత్ర మరింత పెరగబోతోంది.
అఫ్గాన్ శాంతి స్థాపనలో పాక్ కీలక పాత్ర పోషించాలని బైడెన్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. దోహాలో జరుగుతున్న అఫ్గాన్ శాంతి చర్చల అనంతరం, ఈ విషయంపైన అమెరికా, పాక్ చర్చించనున్నాయి.
పాక్ పాత్రను ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ కూడా ప్రస్తావించారు. అఫ్గాన్ శాంతి స్థాపన విషయంలో అమెరికా-పాకిస్తాన్ సహకారం గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
పాక్, అమెరికాల మధ్య ''అఫ్గాన్‌లో శాంతి స్థాపన'' కీలకంగా మారబోతోందని ఖురేషీ కూడా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
బైడెన్ వ్యూహాలు కాస్త భిన్నమైనవే..
ట్రంప్ హయాంలో కుదిరిన కొన్ని ఒప్పందాలను కొత్త అమెరికా ప్రభుత్వం పున:సమీక్షించాలని చూస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో బాధ్యతాయుతంగా, నిబద్ధతతో ముందుకు వెళ్లాలని పాక్ విదేశాంగ శాఖ అభ్యర్థించింది.
అయితే, ఈ పరిణామాలు పాక్‌కు అంత అనుకూలమైనవి కావని జనవరి 24న ఉర్దూ టీవీ ఛానెల్ దునియా న్యూస్ రాజకీయ విశ్లేషకుడు సల్మాన్ ఘనీ వ్యాఖ్యానించారు.
''అఫ్గాన్‌లో శాంతి స్థాపన రెండు దేశాలకూ చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ శాంతి నెలకొనాలని రెండు దేశాలూ కోరుకుంటున్నాయి''అని జనవరి 26న పాక్ పత్రిక డాన్ వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Mark Wilson/Getty Images
ఉగ్రవాదులపై చర్యలు
పాక్‌కు ఇవ్వాలని ప్రతిపాదించిన 33 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని 2018లో అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాక్ అబద్ధాలు చెబుతోందని, మోసాలకు పాల్పడుతోందని ట్రంప్ ఆరోపించారు.
మరోవైపు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి మిలిటెంట్ సంస్థలపై పాక్ తీసుకున్న చర్యలకు గాను జనవరి 19న అమెరికా కొత్త రక్షణ మంత్రి జనరల్ లాయిడ్ జే ఆస్టిన్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో అతివాదులకు పాక్ ఆశ్రయం ఇవ్వకుండా చూసేందుకు తాము ఒత్తిడి చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టంచేశారు.
మరోవైపు అమెరికా జర్నలిస్టు డేనియేల్ పర్ల్ హత్య కేసు-2002లో ప్రధాన నిందితుడు ఒమర్ సయీద్‌కు విధించిన శిక్షను సుప్రీం కోర్టు జనవరి 28న నిలుపుదల విధించడంపై అమెరికా అసంతృప్తి వ్యక్తంచేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో మళ్లీ విభేదాలు తలెత్తాయి.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సమావేశాల్లో పాకిస్తాన్‌పై చర్యల అంశాన్నీ తాజా పరిణామం ప్రభావం చూపే అవకాశముంది. ఉగ్రవాద సంస్థలపై పాక్ తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశాల్లో సమీక్షిస్తారు.

ఫొటో సోర్స్, AFP/Getty
భారత్, చైనాలతో సంబంధాలు..
భారత్, చైనాలతో పాక్ సంబంధాలు కూడా.. అమెరికా-పాక్ సంబంధాలపై ప్రభావం చూపిస్తాయి.
కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను విమర్శిస్తూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వ్యాఖ్యలు చేయడం పాక్‌కు మంచిదేనని రాజకీయ విశ్లేషణలు వచ్చాయి.
అయితే, పాక్ మీడియా ఈ విషయంలో అనుమానాలు వ్యక్తంచేస్తోంది.
''పాక్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అమెరికాలోని కొత్త ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవచ్చు. కశ్మీర్‌లో భారత్ అరాచకాలకు పాల్పడినా సరే చర్యలు తీసుకోకపోవచ్చు''అని జనవరి 26న డాన్ పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది.
మరోవైపు చైనాతో దృఢమైన సంబంధాల వల్ల అమెరికాతో పాక్ బంధాల బలోపేతానికి అవాంతరాలు ఎదురుకావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
''అమెరికా, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడితే, పాక్‌కు చాలా మంచిది''అని జనవరి 23న వరల్డ్ న్యూస్ టీవీలో మాజీ దౌత్యవేత్త మలీహా లోధి వ్యాఖ్యానించారు.
అయితే, ఈ విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
''అమెరికా లేదా చైనా.. వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల విషయంలో పాక్ ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది''అని డాన్‌లో ఒక ప్రముఖ ఆర్థికవేత్త వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, EuropaNewswire/Gado/Getty Images
ఆర్థిక అంశాల్లో మార్పులు..
అమెరికాలోని కొత్త ప్రభుత్వంతో బంధాలను బలోపేతం చేసుకునేందుకు పాక్ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే స్పష్టంచేసింది.
వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో మెరుగైన భాగస్వామ్యం కోసం అమెరికాతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు బైడెన్‌కు శుభాకాంక్షలు చెప్పే సమయంలో పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
భౌగోళిక రాజకీయ అంశాల నుంచి భౌగోళిక ఆర్థిక అంశాల దిశగా భాగస్వామ్యాన్ని మళ్లించాలని పాక్ విదేశాంగ మంత్రి కూడా చెప్పారు. అయితే, పాక్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
''రెండు దేశాల మధ్య సంబంధాలు ఎటు, ఎలా పయనిస్తాయనేది.. అమెరికాకు పాక్ ఎంత అవసరం? అనే అంశంపై ఆధారపడి ఉంటుంది''అని డాన్ పత్రికలో రాజకీయ విశ్లేషకుడు ఐజాజ్ హైదర్ విశ్లేషించారు.
''అమెరికా, పాక్‌ల మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరే సంకేతాలేవీ కనిపించడం లేదు''అని పాక్ బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధి ఇషాన్ మాలిక్.. డాన్ పత్రికలో ఒక వ్యాసం రాశారు.
ఒక దేశంతో మరొక దేశానికి ఎంత ఉపయోగం ఉంటుందనే అంశంపైనే రెండు దేశాల ద్వైపాక్షిక బంధాల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంపై పాక్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
''రెండు దేశాలు కలిసి ముందుకు వెళ్లే అవకాశమున్న రంగాలను మొదట పాక్ గుర్తించాలి. ఆ తర్వాత దానికి అనుగుణంగా కార్యచరణ సిద్ధం చేయాలి''అని హైదర్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:
- 'భారతదేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరికి కోవిడ్' - ICMR సెరో సర్వే
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









