నేపాల్‌లో రాజకీయ సంక్షోభం...పార్లమెంట్ రద్దు.. ఏప్రిల్-మేలో మధ్యంతర ఎన్నికలు

రాష్ట్రపతి బిద్యా దేవీ భండారీ

ఫొటో సోర్స్, Narayan Maharjan/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, రాష్ట్రపతి బిద్యా దేవీ భండారీ

నేపాల్‌లో పార్లమెంట్ రద్దు చెయ్యాలని కేబినెట్ సిఫార్సు చేసింది. ఆదివారం ఉదయం జరిగిన అత్యవసర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏడుగురు మంత్రులు రాజీనామా చేశారు.

కేబినెట్ సిఫారసును అనుసరించి రాష్ట్రపతి బిద్యా దేవీ భండారీ పార్లమెంటు రద్దు చేసారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మేలలో మధ్యంతర ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.

"పార్లమెంటరీ పార్టీ, సెంట్రల్ కమిటీ, పార్టీ సచివాలయంలో ప్రధానమంత్రి తన మెజారిటీ కోల్పోయారు. పార్టీలో ప్రస్తుతం తలెత్తిన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించకుండా పార్లమెంట్‌ను రద్దు చెయ్యాలని పీఎం నిర్ణయం తీసుకున్నారు" అని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సీపీ) సెంట్రల్ కమిటీ సభ్యులు బిష్ణు రిజాల్ తెలిపినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది.

నేపాల్ ప్రధాని కేపీ ఓలీ, తన సొంత పార్టీ సభ్యులనుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని సమాచారం. పార్టీని, ప్రభుత్వాన్ని ఏకపక్షంగా నడుపుతున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

2018లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) విలీనమైన తరువాత కేపీ ఓలీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. సీపీఎన్ (మావీయిస్ట్ సెంటర్) నాయకుడు పుష్ఫ్ కమల్ దహల్ ప్రచండ్ సంఘటిత సీపీఎన్ పార్టీ కో-చైర్మన్‌ అయ్యారు.

ప్రధాని కేపీ ఓలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని కేపీ ఓలీ

అయితే, తరువాత పార్టీలో చీలికలు రావడం ప్రారంభించాయి. భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై కూడా పుష్ప్ కమల్ దహల్, ఝాలానాథ్ ఖనల్‌లాంటి పార్టీ సీనియర్ నాయకలు ఓలీ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

హౌస్ స్పీకర్లు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడి అంగీకారం అవసరం లేకుండా వివిధ రాజ్యాంగ సంస్థల అధిపతులను, సభ్యులను నియమించే అవకాశం ఉండేలా ప్రధానమంత్రి ఓలీ ఒక ఆర్డినెస్ తీసుకు వచ్చారు. రాష్ట్రపతి ఈ ఆర్డినెన్స్ జారీ చెయ్యడంతో పార్టీలో వివాదాలు చెలరేగాయి.

ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలాని పార్టీ సీనియర్ సభ్యులు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చెయాలని కోరారు. కేపీ ఓలీ పీఎం పదవినుంచీ లేదా పార్టీ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలని డిమాండ్ చేసారు.

దీనితో ప్రధాని ఓలీపై ఒత్తిడి పెరిగింది. పార్టీ సభ్యులు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చెయ్యాలన్న అభ్యర్థనను వెనక్కు తీసుకునేట్లు, ఓలీ ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకునేట్లు ఒప్పందం కుదిరింది. కానీ అలా జరగలేదు. ప్రధాని ఓలీ పార్లమెంట్ రద్దు చెయ్యాలని సిఫారసు చేసారు.

నేపాల్ రాజ్యాంగంలో పార్లమెంట్ రద్దు చెయ్యడానికి సంబంధించిన స్పష్టమైన నిబంధనలేమీ లేవని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, కోర్టులో సవాలు చెయ్యొచ్చని అంటున్నారు.

గతంలో తరచుగా నేపాల్‌లో రాజకీయ అస్థిరత నెలకొంటూ ఉండేది. ఈ నేపథ్యంలో, రాజకీయ స్థిరత్వాన్ని తీసుకు రావడం కోసం పార్లమెంట్ రద్దుకు సంబంధించి ఎటువంటి నిబంధనలూ విధించలేదు.

ఓలీ సిఫారసు రద్దు చేసుకోకపోతే పార్టీ ఆయనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని దహల్ బీబీసీకి తెలిపారు.

అయితే, అధికార పార్టీ అత్యవసర సమావేశం జరగకముందే పార్లమెంట్ రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ 30, మే 10 తేదీలలో మధ్యంతర ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.

పార్లమెంట్ రద్దు చేసిన సందర్భంలో దేశ రాజధాని ఖాట్మండులో భద్రత కట్టుదిట్టం చేసారు. ప్రధాన కూడళ్లల్లో అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు.

మరోవైపు, పార్లమెంట్ రద్దు చేసిన విషయం తెలుసుకున్న సీపీఎన్ (మావోయిస్ట్) యాక్టింగ్ ప్రెసిడెంట్ పుష్ప్ కమల్ దహల్ ప్రచండ్ ఆగ్రహంతో ప్రధానమంత్రి నివాసం చేరుకుని ప్రధాని ఒలీతో సంభాషణ జరిపినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)