మోదీ, షాహీన్‌బాగ్ బిల్కిస్ బానో, ఆయుష్మాన్ ఖురానా... టైమ్-100 ప్రబావశీలుర జాబితాలో అయిదుగురు భారతీయులు

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, AFP/Getty Images

నరేంద్ర మోదీ సహా ఐదుగురు భారతీయులతో కూడిన 2020 సంవత్సరపు అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ విడుదల చేసింది.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, నటుడు ఆయుష్మాన్ ఖురానా, హెచ్ఐవీ పరిశోధకులు ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా, షహీన్ భాగ్ నిరసనల్లో పాల్గొన్న 82 ఏళ్ల బిల్కిస్ బానో కూడా ఈ జాబితాలో ఉన్నారు.

అయితే, ప్రధాని మోదీని ఈ జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటిస్తూ టైమ్‌లో రాసిన సంక్షిప్త కథనంలో ఆయన గురించి కటువుగానే రాసారు.

మోదీ

ఫొటో సోర్స్, TIME

టైమ్‌లో ఏం రాసారంటే...

"ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల ద్వారా పాలకులను ఎన్నుకోవడం మాత్రమే కాదు. ఎన్నికల ద్వారా ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. కానీ ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో విజేతకు ఓటు వెయ్యనివారి హక్కులను కూడా పరిరక్షించడం. గత 70 యేళ్లల్లో భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంగా గుర్తింపు పొందింది. 136 కోట్ల దేశ జనాభాలో క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, భౌద్ధులు, జైనులుతో పాటు అనేక ఇతర మత సంప్రదాయాలవారు కూడా ఉన్నారు. వీరంతా భారతదేశంలో కలిసిమెలిసి నివసిస్తున్నారు. దలైలామా మాటల్లో ఇది సామరస్యానికి, స్థిరత్వానికి ప్రతీక. అయితే నరేంద్ర మోదీ వీటన్నిటినీ సందిగ్ధంలో పడేసారు. భారతదేశంలో 80% ప్రధానమంత్రులందరూ హిందువులే. కానీ వారందిరికీ భిన్నంగా మోదీ ప్రభుత్వం మాత్రమే హిందువుల గురించి తప్ప వేరెవ్వరి గురించీ పట్టించుకోవట్లేదు. హిందూ జాతీయవాద బీజేపీ దేశంలోని భిన్నత్వాన్ని పట్టించుకోలేదు సరికదా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటోంది. మోదీ ప్రభుత్వానికి కరోనావైరస్ మహమ్మారి దేశంలోని అసంతృప్తిని తొక్కిపెట్టడానికి సాధనంగా ఉపయోగపడింది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మెలమెల్లగా అంధకారంలోకి నెట్టబడుతోంది."

మోదీ ప్రధాని అయినప్పటినుంచీ విదేశీ పత్రికలు అనేకసార్లు ఆయనకు మొదటి పేజీలో చోటు కల్పించాయి. మోదీ పాలనా విధానాన్ని విశ్లేషిస్తూ విమర్శనాత్మక కథనాలు రాసాయి.

గత ఏడాది ఎన్నికలముందు టైమ్ కూడా మోదీ గురించి "ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్" శీర్షికన కవర్ పేజీలో ఒక కథనాన్ని ప్రచురించింది. అది కొంత వివాదాస్పదమయ్యింది కూడా.

ఆ కథనంలో "ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం మరో ఐదేళ్లు మోదీ పాలనను భరించగలదా?" అంటూ విమర్శలు గుప్పించారు.

ఇది మోదీపై బురద జల్లే ప్రయత్నమని అప్పట్లో బీజేపీ ఆరోపించింది. 2014లో కూడా విదేశీ పత్రికల్లో మోదీపై ఇలాంటి కథనాలే వచ్చాయని బీజేపీ ప్రతినిధి సంబిత పాత్రా అన్నారు.

2015లో కూడా టైమ్ మ్యాగజీన్ "వై మోదీ మేటర్స్" అనే శీర్షికతో మోదీపై ఒక కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది.

ఆయుష్మాన్ ఖురానా

ఫొటో సోర్స్, Hindustan Times

ఆయుష్మాన్ ఖురానా

టైమ్ జాబితాలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా కూడా ఉన్నారు.

"టైమ్ 100 మంది ప్రభావశీలుర జాబితాలో చేరడం గర్వకారణమని" ఆయుష్మాన్ సోషల్ మీడియాలో తెలిపారు.

నటి దీపికా పదుకునే టైమ్ మ్యాగజీన్‌లో ఆయుష్మాన్ ఖురానా గురించి ఒక చిన్న వ్యాసం రాసారు.

"ఆయుష్మాన్ మొదటి చిత్రం విక్కీ డోనర్‌నుంచీ నాకు పరిచయం. ఆయన నటుడిగా కెరీర్ ప్రారంభించకముందుంచీ బాలీవుడ్‌లో వివిధ రకాల పనులు చేసేవారు. కానీ ఇవాళ మనందరం ఆయుష్మాన్ గురించి మాట్లాడుకుంటున్నామంటే, అందుకు ఆయన చేసిన మంచి చిత్రాలు, మరపురాని పాత్రలే కారణం. చాలామంది హీరోలు హీరోయిజం, మగతనం చూపించే పాత్రలే చేస్తుంటే ఆయుష్మాన్ వాటన్నిటికీ భిన్నంగా బలమైన పాత్రలను ఎంచుకోవడమే కాకుండా వాటిని సమర్థవంతంగా పోషించారు కూడా" అని దీపికా రాశారు.

బిల్కిస్ బానో

ఫొటో సోర్స్, TIME/Anil Sharma/Alamy

ఫొటో క్యాప్షన్, బిల్కిస్ బానో

బిల్కిస్ బానో

దిల్లీలోని షాహీన్ బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న బిల్కిస్ బానో కూడా 'టైమ్ 100 జాబితా'లో చోటు సంపాదించుకున్నారు.

82 ఏళ్ల బిల్కిస్ బానోను "షాహీన్ బాగ్ దాదీ"(అవ్వ) అని పిలుస్తారు.

సీఏఏను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ షాహీన్ బాగ్‌లో దాదాపు 100 రోజులపాటు సాగిన నిరసనల్లో బిల్కిస్ బానో చురుకుగా పాల్గొన్నారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం బిల్కిస్ బానో ఉత్తర ప్రదేశ్ లోని బులంద్షహర్ జిల్లాకు చెందినవారు. ఆవిడ భర్త పదేళ్ల క్రితమే కన్నుమూసారు. ప్రస్తుతం దిల్లీలో తన కొడుకులు, కోడళ్లతో ఉంటున్నారు.

టైమ్ మ్యాగజీన్‌లో ఆవిడ గురించి రాస్తూ..."భారతదేశంలో బిల్కిస్ బానో బలహీనవర్గాల గొంతుగా మారారు. ఉదయం 8 గంటలనుంచీ రాత్రి 12.00 వరకూ ఆవిడ నిరసనలో కూర్చునేవారు. ఆవిడతో పాటుగా అనేకమంది మహిళలు ఆ నిరసనల్లో పాల్గొన్నారు. ఇలా మహిళలందరూ సీఏఏకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొనడం 'ప్రతిఘటనకు చిహ్నం'గా చెబుతారు. సామాజిక కార్యకర్తలకు, జైల్లో నిర్భందించిన విద్యార్థి నాయకులకూ బిల్కిస్ బానో ఒక ఆశాజ్యోతిగా నిలిచారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ఎంత ముఖ్యమో తెలియజేసారు."

షాహీన్ బాగ్ నిరసనల సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ "సీఏఏ విషయంలో మేము (మోదీ ప్రభుత్వం) ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదు" అని అన్నారు.

దానికి ప్రతిస్పందనగా " హోం మంత్రి ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గమని చెబితే, మేము ఒక్క వెంట్రుకవాసి కూడా పక్కకి జరిగేది లేదు" అని బిల్కిస్ బానో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)