సుశాంత్ సింగ్ విలాసంగా జీవించాలని కోరుకునేవారు.... డబ్బు కోసం నేను ఆయన మీద ఆధారపడలేదు - రియా చక్రవర్తి

ఫొటో సోర్స్, rhea chakraborty insta
మలుపులు తిరుగుతున్న నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ఆయన తండ్రి కె.కె. సింగ్ రియా చక్రవర్తి హంతకురాలంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే డబ్బు కోసం సుశాంత్ మీద తాను ఎప్పుడూ ఆధారపడలేదని రియా చక్రవర్తి ఓ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
సుశాంత్‌ను రియా చక్రవర్తే హత్య చేశారని, ఆమెను అరెస్టు చేయాలని కె.కె. సింగ్ డిమాండ్ చేశారు. “సుశాంత్‌కు చాలా రోజులుగా రియా విషమిస్తూ వచ్చారు. ఆమే సుశాంత్‌ను చంపింది. విచారణాధికారులు ఆమెను, ఆమెకు సహకరించిన వారిని అరెస్టు చేయాలి” అని సింగ్ డిమాండ్ చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
తన డిమాండ్‌తో కె.కె.సింగ్ ఒక వీడియో విడుదల చేశారు.

ఫొటో సోర్స్, INSTAGRAM
సుశాంత్ మరణంపై వివిధ కోణాలలో విచారణ
ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ చట్టంలో సెక్షన్ 27 నార్కొటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ డ్రగ్స్ వాడకం శిక్షార్హమైన నేరంగా పేర్కొంటుండగా, సెక్షన్ 29 ప్రకారం ఆ మందుల వాడకాన్ని ప్రోత్సహించడం కూడా నేరమే.
కేసు విచారణ కోసం ఢిల్లీ, ముంబైల నుంచి ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని, డిప్యూటీ డైరక్టర్ కె.పి.ఎస్. మల్హోత్రా ఆధ్వర్యంలో ఈ బృందం పని చేస్తుందని నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ డైరక్టర్ జనరల్ రాకేశ్ ఆస్థానా వెల్లడించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
మరోవైపు రియా చక్రవర్తి ఆసుపత్రి మార్చురిలోకి ప్రవేశించడానికి, వివరాలు కనుక్కోడానికి ఎలా అనుమతించారంటూ ముంబై పోలీసులకు, కూపర్ ఆసుపత్రి యాజమాన్యానికి మహారాష్ట్ర మానవ హక్కుల కమీషన్ నోటీసులు పంపింది.
ఇటు శాంతాక్రజ్‌లోని DRDO గెస్ట్‌హౌస్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చార్టర్డ్ ఎకౌంటెంట్ సందీప్ శ్రీధర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. ఆగస్టు 3న ఈడీ బృందం ఇప్పటికే ఒకసారి శ్రీధర్‌ను ప్రశ్నించింది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకుని, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని గతంలోనే చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఫొటో సోర్స్, ANI
జూలై 28న రాజ్‌పుత్ తండ్రి కె.కె. సింగ్ బిహార్‌లో చేసిన ఫిర్యాదు తర్వాత, ఆ కేసు FIR ఆధారంగా జులై 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) న ఈడీ రిజిస్టర్ చేసింది.
మరోవైపు 2013 నుంచే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుంగుబాటు (Depression) తో బాధ పడుతున్నాడని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియాచక్రవర్తి వెల్లడించారు. ఆజ్‌తక్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్ల్యూలో ఆమె సుశాంత్ ఆరోగ్యం, ఆర్ధిక వ్యవహారాల గురించి చెప్పారు.
తన సోదరుడు, తాను, సుశాంత్ భాగస్వాములుగా ఒక కంపెనీని ప్రారంభించామని రియా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఒకసారి యూరప్ పర్యటనలో ఉన్న సమయంలో సుశాంత్ మానసిక స్థితిని గురించి తనకు తెలిసిందని, అప్పటికే అతను దీనికోసం ‘మోడాఫినిల్’ అనే మెడిసిన్‌ను వాడుతున్నారని రియా వెల్లడించారు. విమానం ఎక్కిన తర్వాత అతను చాలా ఇబ్బంది పడ్డారని ఆమె వెల్లడించారు.
తాము హోటల్‌లో ఉన్నామని, అక్కడ గోథిక్ శైలి కళాకృతులు చూసి సుశాంత్ మానసికంగా ఇబ్బంది పడ్డారని, హోటల్ రూమ్ నుంచి బైటికి రావడానికి ఇష్టపడేవారు కాదని వెల్లడించారు. హోటల్‌లో నిద్ర కూడా పోయేవారు కాదని ఆమె చెప్పారు.
2013లో సుశాంత్ ఒక మానసిక వైద్యుడిని సంప్రదించడం తనకు తెలుసని, ఆ తర్వాత అతను కొంచెం కోలుకున్నారని చెప్పారు రియా.

ఫొటో సోర్స్, RHEA CHAKRABORTY INSTA
మీ కుటుంబంతోనే సుశాంత్ కలిసి ఉండేవారని, మీ ఖర్చులన్నీ అతనే భరించేవారన్న వాదనలో నిజమెంత అని ప్రశ్నించినప్పుడు రియా అది నిజం కాదని సమాధానమిచ్చారు. యూరప్ పర్యటనలో తన ప్రయాణ ఖర్చులన్నీ తాను నటిస్తున్న ఓ అడ్వర్టయిజ్‌మెంట్‌కు సంబంధించిన కంపెనీయే భరించిందని, యూరప్ ట్రిప్ కోసం సుశాంత్ వాటిని క్యాన్సిల్ చేసి, తిరిగి తానే బుక్ చేశారని ఆమె వెల్లడించారు.
హోటల్ ఖర్చులు సుశాంతే భరించేవారని, అది తన ఇష్టప్రకారమే చేసేవారని, చాలా ఖర్చవుతోందని తాను భయపడేదాన్నని రియా వెల్లడించారు. సుశాంత్ విలాసంగా జీవించాలని కోరుకునేవారని, ఆయన డబ్బును ఆయనిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకునే హక్కు ఆయనకుందని, అతని లైఫ్ స్టైల్‌ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని రియా అన్నారు.
ఏడుగురు అమ్మాయిలను తీసుకుని సుశాంత్ ప్రైవేటు విమానంలో థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్లారని, అది అతని ఇష్టమని, ప్రశ్నించడానికి మనమెవరమని రియా అన్నారు. మేం ఒక కపుల్‌లా జీవించడం నిజమే అయినా అతని డబ్బు మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం తనకు లేదని ఆమె న్యూస్ ఛానల్ ముఖాముఖిలో అన్నారు.
ఇవి కూడా చదవండి
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- ఏపీజే అబ్దుల్ కలామ్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకు అంటారు ?
- ‘నాన్న పుర్రెను, ఎముకలను సూట్‌కేసుల్లో పెట్టుకుని వచ్చా’: ఉత్తర కొరియాలో యుద్ధ ఖైదీ కుమార్తె
- ఉత్తర కొరియా: సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన వ్యక్తే కరోనాను వెంట తెచ్చాడా?
- చైనా విద్యార్థులు తమను తామే కిడ్నాప్ చేసుకుంటున్నారు.. పోలీసులు అసలు కథ బయటపెట్టారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








