టిక్‌టాక్: ‘డోనల్డ్ ట్రంప్ నిషేధం మీద న్యాయ పోరాటం మినహా మాకు దారి లేదు’

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తమపై విధించిన నిషేధాన్ని సవాలు చేయడానికి చైనీస్ వీడియో యాప్ టిక్‌టాక్ చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.

ట్రంప్ సెప్టంబర్ మధ్య నుంచి టిక్‌టాక్ యాజమాన్యం బైట్‌డాన్స్ తో లావాదేవీలను నిషేధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇచ్చారు.

ఆ సంస్థ అమెరికా డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేయవచ్చని వైట్‌ హౌస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, తాము అలా చేయడం లేదని బైట్ డాన్స్ చెబుతోంది.

షార్ట్ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌కు అమెరికాలో 8 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు.

దాదాపు ఏడాది నుంచి ట్రంప్‌ అధికారులను కలవడానికి తాము ప్రయత్నించామని, కానీ దానికోసం తగిన ప్రక్రియ ఏదీ లేకుండాపోయిందని, ‘వాస్తవాలపై దృష్టి పెట్టని’ ఒక పరిపాలనను ఎదుర్కోవాల్సి వచ్చిందని బైట్‌డాన్స్ ఆరోపించింది.

“చట్ట నియమాలను విస్మరించకుండా, మా కంపెనీ, వినియోగదారుల పట్ల న్యాయంగా వ్యవహరించేలా చూడడానికి న్యాయ వ్యవస్థ ద్వారా ఆ ఆదేశాలను సవాలు చేయడం తప్ప, మాకు వేరే దారి లేదు” అని కంపెనీ ప్రతినిధి చెప్పారు.

న్యాయపరమైన చర్యలు ఈ వారంలో ప్రారంభమవుతాయని టిక్‌టాక్ భావిస్తోందని బీబీసీ బిజినెస్ రిపోర్టర్ వివియెన్నె నునిస్ చెప్పారు.

చైనా సంస్థ టెన్సెంట్‌కు చెందిన సోషల్ మీడియా యాప్ ‘వియ్‌చాట్‌పై కూడా అధ్యక్షుడు ఇలాంటి నిషేధమే విధించడాన్ని సవాలు చేస్తూ చైనా-అమెరికన్లతో కూడిన ఒక బృందం శుక్రవారం విడిగా మరో కేసు వేసింది.

డాన్సులు, రోజువారీ పనులు, అంతర్జాతీయ రాజకీయాలు లాంటి వివిధ అంశాలపై టిక్‌టాక్ యూజర్లు చిన్న చిన్న వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల, ముఖ్యంగా టీనేజర్లలో దీనికి ఎక్కువ పాపులారిటీ వచ్చింది.

టిక్‌టాక్‌ను ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

కానీ, చైనా ఈ యాప్‌ను తమ ప్రభుత్వ ఉద్యోగుల లొకేషన్స్ ట్రాక్ చేయడానికి, వారిని బ్లాక్‌మెయిల్ చేయడానికి తగిన సమాచారం సేకరించడానికి లేదా కంపెనీలపై గూఢచర్యం కోసం ఉపయోగింవచ్చని ట్రంప్ ఆరోపిస్తున్నారు.

“చైనా సంస్థలకు చెందిన, చైనా తయారీ మొబైల్ యాప్స్ పెరగడం వల్ల జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఏర్పడుతోంది” అని ట్రంప్ అన్నారు.

“అమెరికాలోని వ్యక్తుల, యాజమాన్యాల సమాచారం చైనా కమ్యూనిస్ట్ పార్టీ చేతికి చిక్కేలా ఈ డేటా సేకరణ ముప్పు తెచ్చిపెడుతోంద”ని ట్రంప్ తన ఆదేశాలలో చెప్పారు.

టిక్‌టాక్ మాత్రం అమెరికా యూజర్ల ఏ డేటానూ ఎప్పుడూ తాము చైనా అధికారులకు ఇవ్వలేదని చెబుతోంది.

టిక్ టాక్

ఫొటో సోర్స్, Getty Images

నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు పెరుగుతున్న చైనా వ్యతిరేక ప్రచారంలో భాగంగా ట్రంప్ తాజాగా టిక్‌టాక్, వియ్‌చాట్‌పై చర్యలు తీసుకున్నారు.

ఆయన అధికారం చేపట్టగానే, చైనాపై వాణిజ్య యుద్ధానికి తెరలేపారు.

అమెరికా ఒక్కటే టిక్‌టాక్‌పై నిషేధం అమలు చేయలేదు. భారత్ కూడా ఈ యాప్‌ను నిషేధించింది. ఆస్ట్రేలియా కూడా దానిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది..

వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాంలను బ్లాక్ చేసి, చైనాతో మంచి సంబంధాలున్న దేశాల యూజర్లలో వియ్‌చాట్ చాలా పాపులర్ యాప్.

దీనిని చైనా అంతర్గత నిఘా ఉపకరణాల్లో చాలా కీలకమైనదిగా కూడా చూస్తున్నారు. హానికరమైన వదంతులు వ్యాపిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న స్థానిక యూజర్లు ఇందులో తమ ఫేస్ స్కాన్, వాయిస్ ప్రింట్ నమోదు చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)