కరోనావైరస్‌తో క్యాజువల్ సెక్స్ తగ్గింది... పిల్స్ దొరకడం సమస్యగా మారింది

మాత్ర వేసుకుంటున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జార్జీ బివాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లాక్‌డౌన్ కారణంగా బ్రిటన్‌లో చాలామంది గర్భ నిరోధక మాత్రలు పొందలేకపోయారని గణాంకాలు సూచిస్తున్నాయి.

మార్చి, ఏప్రిల్ నెలల కాలంలో వీటి అమ్మకాలు 50 శాతం పడిపోగా నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) వైద్యులు ఇలాంటి మాత్రలు వాడాలంటూ సూచించడం కూడా 20 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గర్భనిరోధక జాగ్రత్తలు పాటించకుండా సెక్స్ జరిపితే గర్భం రాకుండా ఆ తరువాత ఇలాంటి మాత్రలను వేసుకుంటారు.

కాగా, అత్యవసర గర్భనిరోధక మాత్రలు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా సూపర్ మార్కెట్లలో కూడా విక్రయించేలా నిబంధనలు సడలించాలన్న తమ డిమాండ్‌కు ఈ గణాంకాలు ఊతమిస్తున్నాయని ‘ది బ్రిటిష్ ప్రెగ్నెన్సీ అడ్వైజర్ సర్వీస్’(బీపీఏఎస్) అంటోంది.

అయితే, ప్రభుత్వం మాత్రం చట్టంలో ఎలాంటి మార్పులు చేసినా అది సురక్షితంగానే ఉండాలని అంటోంది.

‘అవాంఛిత గర్భాలు పెరగొచ్చు’

నేరుగా దుకాణాల్లో, ఆన్‌లైన్లో కొనుగోలు చేసిన గర్భ నిరోధక మాత్రల, లెక్కను ఐఆర్ఐ వెల్లడించింది.

దాని ప్రకారం బ్రిటన్‌లో మార్చి నెలలో 38,553 యూనిట్లు అమ్ముడుపోగా ఏప్రిల్‌లో ఆ సంఖ్య 18,500కి పడిపోయింది.

మేలో మళ్లీ కాస్త అమ్మకాలు పుంజుకొన్నాయి. 23,918 యూనిట్లు అమ్ముడయ్యాయి.

మరోవైపు ఎన్‌హెచ్ఎస్ ప్రిస్క్రిప్షన్లలోనూ ఈ మందులను రాయడం తగ్గింది. ఈ ఏడాది జనవరిలో 6,865 ప్రిస్క్రిప్షన్లలో ఇవి కనిపిస్తే మార్చిలో 5,094.. ఏప్రిల్‌లో 4,099కి తగ్గింది.

అంతేకాదు.. ఏప్రిల్‌లో కండోమ్‌ల విక్రయమూ తగ్గింది.

గ్రర్భనిరోధక మాత్రలు

ఫొటో సోర్స్, BSIP

అత్యవసర గర్భనిరోధక మందులను బ్రిటన్‌లో క్లినిక్‌ల నుంచి పొందొచ్చు. ఫార్మసిస్ట్ కన్సల్టేషన్ తరువాత మందుల దుకాణంలో కొనొచ్చు. ఆన్‌లైన్‌లో కొనాలంటే ఒక ప్రశ్నావళిని నింపాల్సి ఉంటుంది.

అయితే, ఈ అత్యవసర గర్భనిరోధక మాత్రలు కొనాలంటే డాక్టరు కన్సల్టేషన్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను తొలగించి మిగతా కొన్ని యూరప్ దేశాలు, అమెరికా మాదిరిగా సూపర్ మార్కెట్లలోనూ సులభంగా దొరికేలా చేయాలని ‘ది బ్రిటిష్ ప్రెగ్నెన్సీ అడ్వైజర్ సర్వీస్’, ‘ది రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టిట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్(ఆర్‌సీఓజీ) కోరుతున్నాయి.

‘‘కరోనా వైరస్ కారణంగా వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఉన్న వేళ ఈ అత్యవసర గర్భనిరోధక చికిత్సలకు ఉన్న ఆటంకాలను తొలగించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ముఖ్యం’’ అని ఆర్‌సీఓజీ ప్రెసిడెంట్ డాక్టర్ ఎడ్ మోరిస్ అన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ కన్సల్టెన్సీ లేకుండా మహిళలు, బాలికలు ఈ గర్భనిరోధక మాత్రలను పొందగలిగే అవకాశం ఉండాలంటారు మోరిస్.

కాగా బ్రిటన్‌లో లాక్‌డౌన్ సమయంలో 77 శాతం జనరల్ ప్రాక్టీస్‌నర్లు, 64 శాతం స్పెషలిస్టులు గర్భనిరోధక సేవలు, ఇతర లైంగిక ఆరోగ్య చికిత్సలు అందించడం ఆపేయడం కానీ బాగా తగ్గించేయడం కానీ చేశారని సర్వేలు చెబుతున్నాయి.

కండోమ్స్, ప్రకటనలు, నిరోధ్

ఫొటో సోర్స్, Getty Images

‘క్యాజువల్ సెక్స్ తగ్గిపోయింది’

అయితే ఎల్లావన్ అనే గర్భనిరోధక మాత్రకు బ్రాండ్ అడ్వైజర్ అయిన డెబోరా ఇవాన్స్ వాదన మరోలా ఉంది. లాక్ డౌన్ కారణంగా క్యాజువల్ సెక్స్ బాగా తగ్గిపోయిందంటున్నారు ఇవాన్స్ .

‘‘యూనివర్సిటీ విద్యార్థులు లేకపోవడం వల్ల అత్యవసర గర్భనిరోధక మాత్రల అమ్మకాలు తగ్గిపోయాయి.

అయితే, లాక్‌డౌన్ వేళ కలిసుండే జంటల్లో మాత్రం చాలామంది వైద్య సహాయం పొందకుండా అవాంఛిత గర్భాలను అలాగే ఉంచుకుంటున్నారు’’ అన్నారు ఇవాన్స్ .

గర్భం తొలగించుకోవాలనే మహిళలపై ఈ లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం చూపింది.

మరోవైపు బ్రిటన్‌లో ఏటా జరిపే అబార్షన్లలో మూడో వంతు చేసే బీపీఏఎస్ ఈ ఏప్రిల్ నుంచి అబార్షన్ల కోసం వచ్చేవారి సంఖ్య 15 శాతం పెరిగిందని చెబుతోంది.

అంతకుముందు సగటున రోజుకు 415 మంది వస్తే ఇప్పుడు సగటున 478 మంది వస్తున్నట్లు బీపీఏఎస్ గణాంకాలు చెబుతున్నాయి.

సోషల్ డిస్టెన్సింగ్, స్టేహోమ్ సందేశాల కారణంగా ఇంకా చాలామంది కన్సల్టేషన్ కోసం రావడం లేదని బీపీఏఎస్ చెబుతోంది.

‘‘లాక్‌డౌన్ వల్ల జననాలు భారీగా పెరుగుతాయో లేదో చెప్పలేను కానీ అత్యవసర గర్భనిరోధక మాత్రలు సులభంగా అందుబాటులో లేకపోవడం వల్ల మాత్రం లాక్‌డౌన్‌లో గర్భధారణలు మాత్రం పెరిగాయి’’ అన్నారు బీపీఏఎస్‌కు చెందిన కేథరిన్ ఓబ్రియాన్.

కాగా బ్రిటన్‌లో అబార్షన్ చట్టాల్లో ఇప్పటికే కొన్ని సడలింపు ఇచ్చారు. గతంలో క్లినిక్‌కు వెళ్లి అబార్షన్ పిల్స్ వాడాల్సి ఉండగా ఇప్పుడు గర్భం దాల్చామని తెలిసిన మహిళలు ఇంట్లోనే ఆ పిల్స్ వేసుకునేలా చట్టం మార్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)