కరోనావైరస్: అమెరికాలో ఒక్క రోజులోనే 2 వేలకుపైగా మరణాలు... న్యూయార్క్‌లో మొబైల్ మార్చురీలు

న్యూయార్క్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ నగరంలో తాత్కాలిక శవాగారాలుగా ఏర్పాటు చేసిన రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులు

కరోనావైరస్ కారణంగా ఒక్క రోజులోనే 2,000 మంది ప్రాణాలు కోల్పోయిన మొట్టమొదటి దేశం అమెరికా.

జాన్‌హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 2,104 మంది కరోనావైరస్‌కు బలయ్యారు.

మరో 5 లక్షల మందికిపైగా ప్రజలు కరోనావైరస్ సోకి చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఇటలీలో అత్యధిక సంఖ్యలో మరణాలు నమోదు కాగా అమెరికా దాన్ని దాటేయబోతోంది.

అయితే, కరోనా ఉద్ధృతి తగ్గనారంభించిందని వైట్ హౌస్ కోవిడ్-19 నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా ముందు అనుకునట్లుగా లక్ష మంది చనిపోయే ప్రమాదం ఉండకపోవచ్చని.. మరణాల సంఖ్య తగ్గొచ్చని అన్నారు.

తమ వ్యూహాలు ఫలించి లక్షలాది మంది ప్రాణాలు కాపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నారాయన.

ఇక మిగతా విషయాలకొస్తే..

* లాక్‌డౌన్ కట్టుబాట్లను ముందే ఎత్తివేస్తే కరోనావైరస్ మరింత ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ హెచ్చరించారు.

* దక్షిణార్ధగోళంలో వెయ్యికి పైగా కరోనా మరణాలు నమోదైన తొలి దేశం బ్రెజిల్.

* టర్కీలోని 31 నగరాల్లో 48 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. ఇది అమల్లోకి రావడానికి కేవలం రెండు గంటల ముందు ప్రకటించడంతో ప్రజలు నిత్యవసరాలను కొనుగోలు చేయడానికి దుకాణాల ముందు బారులుతీరారు.

* ఏళ్ల తరబడి సాగుతున్న యుద్ధం కారణంగా కరవు కోరల్లో చిక్కుకోవడంతో పాటు ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలిన యెమెన్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసును గుర్తించడంతో సహాయ సంస్థల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

అమెరికా తాజా గణాంకాలేం చెబుతున్నాయి..

అమెరికాలో ఇప్పటివరకు 18,693 మంది మరణించారు. 5,00,399 పాజిటివ్ కేసులున్నాయి.

అమెరికాలోని మొత్తం మరణాల్లో సగం న్యూయార్క్ నగరంలోనే సంభవించాయని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి.

ఇటలీలో 18,849 మంది మరణించగా 1,02,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

శుక్రవారం అమెరికాలో అత్యధిక సంఖ్యలో మరణాలు నమోదవుతాయని, ఆ తరువాత క్రమంగా తగ్గడం మొదలవుతుందని పరిశీలకులు అంచనా వేశారు.

వారి అంచనా ప్రకారం.. ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాలనుకుంటున్న మే 1 నాటికి రోజుకు 970 మరణాలు నమోదవుతుండొచ్చు.

న్యూయార్క్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, శవపేటికల సామూహిక ఖననం

జీవితం తలకిందులు

నదా తాఫిక్, బీబీసీ న్యూస్, న్యూయార్క్

కరోనావైరస్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. న్యూయార్క్ నగరవాసులు భీతావహ దృశ్యాలు చూసి కలతచెందారు.

నిర్జన ఎడారుల్లా మారిన వీధుల్లో అంబులెన్సుల సైరన్ల మోత వినిపిస్తోంది.

హాస్పిటళ్ల వెలుపల నిలిపిన రిఫ్రిజిరేటెడ్ ట్రక్కుల్లోకి మృతదేహాలు ఉంచిన సంచులు ఎత్తిపడేస్తున్నారు.

సామూహిక ఖననాల కోసం హార్ట్స్ ఐలాండ్‌లో భారీ కందకాల తవ్వకం పనులు నిర్విరామంగా సాగుతున్నాయి.

అనాథ శవాలు, సామూహిక ఖననాలకు, ఊరూపేరూ లేని సమాధులకు చిరునామాగా ఉంటూ, అత్యంత దుఃఖమయ ప్రదేశంగా చెప్పే హార్ట్స్ ఐలాండ్‌లోని మారుమూల స్మశానం ఈ సామూహిక ఖననాలకు సిద్ధమవుతోంది.

బోట్లలో తప్ప మామూలుగా చేరుకోలేని ప్రదేశమది.అంత్యక్రియలు నిర్వహించడమూ కష్టమవుతోంది.

పెద్దసంఖ్య రోజువారీ మరణాలు నమోదవడానికి ముందు కూడా ఇక్కడ అంత్యక్రియలకు వారం రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.

పెన్స్
ఫొటో క్యాప్షన్, ఇల్లు దాటి రావద్దని సూచిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్

వ్యాధి వ్యాప్తి ఉద్ధృతి త్వరలో నెమ్మదిస్తుందనడానికి కారణమేంటి?వైరస్ వ్యాప్తి వేగం, కేసుల సంఖ్య పెరుగుదల వేగం తగ్గుతుందని అమెరికా సాంక్రమిక వ్యాధుల చీఫ్ డాక్టర్ ఆంథోనీ ఫాసీ అన్నారు.

ఈ విషయంలో ప్రగతి కనిపిస్తున్నప్పటికీ సోషల్ డిస్టెన్సింగ్ వంటి పద్ధతులు పాటించడం మాత్రం మానరాదన్నారు.

వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ‘ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ ఆగస్టు 4 నాటికి 60 వేల మంది మరణిస్తారని అంచనా వేసింది.

గత నెలలో డాక్టర్ ఫాసీ కనీసం లక్ష మంది చనిపోతారని అంచనావేశారు.

న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో వంటి తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రస్తుతం వైరస్ తీవ్రత ఒక స్థిరమైన స్థాయికి చేరుకుందని డాక్టర్ బిర్క్స్ చెప్పారు.

అమెరికా జనాభారీత్యా చూస్తే ఇతర కొన్ని ప్రభావిత దేశాల కంటే మరణాల రేటు తక్కువగా ఉందని ఆమె చెప్పారు.

అయితే, అమెరికాలో ఇంకా ఈ వ్యాధి పీక్ స్టేజ్‌కి వెళ్లలేదంటున్నారామె.

‘‘మేం నిన్న, గత వారం, అంతకుముందు వారం ఏం చేశామో.. ఇకముందూ అదే చేయాల్సిన అవసరం ఉంది.

ముందుముందు రోజుల్లో పీక్ స్టేజికి చేరి అక్కడి నుంచి తగ్గనారంభిస్తుంది’’ అన్నారామె.

న్యూయార్క్

ఫొటో సోర్స్, Getty Images

న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుయామో శుక్రవారం మాట్లాడుతూ ఉద్ధృతి తగ్గుతోందని.. అలా అని ఉదాసీనంగా ఉండరాదని అన్నారు.

అమెరికాలోని మైనారిటీ సమాజాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ వర్గాల్లో వారి జనాభాకు భిన్నంగా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.

యూఎస్ సర్జన్ జనరల్ డాక్టర్ జెరోమ్ ఆడమ్స్ మాట్లాడుతూ, అమెరికాలోని మైనారిటీల్లో అధికులకు సాధారణంగా ఉబ్బసం, రక్తపోటు మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నందున కరోనావైరస్ కారణంగా వారు దుర్బల పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు.

నిజానికి తాను కూడా ఉబ్బసం వస్తుందనే భయంతో 40 ఏళ్లుగా జేబులో ఎప్పుడూ ఇన్‌హేలర్ ఉంచుకుని తిరుగుతున్నానని ఆడమ్స్ చెప్పారు.

అయితే, మైనారిటీలు మద్యం, పొగతాగడం, డ్రగ్స్ తీసుకోవడం తగ్గిస్తే కరోనావైరస్ ముప్పు తగ్గుతుందని ఆయన అనడం వివాదాస్పదంగా మారింది.

మరోవైపు ట్రంప్ కూడా శుక్రవారం.. న్యూయార్క్‌లోని హార్ట్ ఐలాండ్‌లో సామూహిక ఖననాలను తాను డ్రోన్ చిత్రాలలో చూసినట్లు చెప్పారు.

150 ఏళ్లుగా అనాథ శవాల ఖననానికివాడుతున్న ఈ ద్వీపంలో ఇప్పుడు సాధారణ రోజుల కంటే అయిదు రెట్లు అధికంగా ఖననాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా కోవిడ్-19పై పోరాటంలో ముందువరుసలో ఉంటూ సేవలందిస్తున్న కార్మికులకు నేరుగా చెల్లింపులు చేయడానికి గాను ‘కోవిడ్-19 హీరోస్ ఫండ్’ ఏర్పాటుపై వాషింగ్టన్‌లో చట్టసభల సభ్యులు చర్చిస్తున్నారు.

డెమొక్రాట్లు ఈ ప్రతిపాదన చేశారు. గంటకు 13 డాలర్ల లెక్కన గరిష్ఠంగా 25,000 డాలర్లు చెల్లించే దిశగా ఆలోచిస్తున్నారు.

వైద్యులు, నర్సులు, నిత్యవసర సరకుల దుకాణాల్లో పనిచేసేవారు, రవాణా రంగంలో ఉన్నవారు, ఇతర అత్యవసర సర్వీసుల్లో ఉన్న కార్మికులు ఈ సహాయం పరిధిలోకి వస్తారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)