ఆన్‌లైన్ క్లాసులో నగ్నంగా ప్రత్యక్షమైన ఆగంతకులు, జూమ్ యాప్‌ వినియోగాన్ని సస్పెండ్ చేసిన సింగపూర్

జూమ్ అప్లికేషన్

ఫొటో సోర్స్, Getty Images

వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ‘జూమ్’‌లో భద్రతా లోపాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండగా, తాజాగా సింగపూర్‌లో మరో ఘటన వెలుగుచూసింది.

విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆగంతకులు తెరపై ప్రత్యక్షమై అసభ్యకరంగా ప్రవర్తించారని స్థానిక మీడియా తెలిపింది.

దాంతో ఆ యాప్‌ను తమ ఉపాధ్యాయులు వాడకుండా సస్పెండ్ చేస్తున్నట్లు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.

కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బుధవారం నుంచి సింగపూర్‌లో పాఠశాలలను మూసివేశారు. ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడం ప్రారంభించారు.

తాజాగా తమ కుమార్తె భూగోళ శాస్త్రం పాఠం వింటుండగా, తెరపై అసభ్యకరమైన చిత్రాలు ప్రత్యక్షమయ్యాయని, ఆ తర్వాత ఇద్దరు పురుషులు అమ్మాయిలను బట్టలు విప్పాలని అడిగారని ఒక తల్లి చెప్పారు.

ఈ ఘటన పట్ల చింతిస్తున్నామని జూమ్ బీబీసీతో చెప్పింది.

ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు సంబంధించి ఈ సంస్థ తన యాప్‌లో డీఫాల్ట్ సెట్టింగులను మార్చింది. భత్రతను ఎలా పెంచుకోవాలో చెబుతూ ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు చేసింది.

లాక్‌డౌన్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా జూమ్‌‌కు రోజువారీ వినియోగదారులు భారీగా పెరిగారు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, లాక్‌డౌన్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా జూమ్‌‌కు రోజువారీ వినియోగదారులు భారీగా పెరిగారు

ఆ క్లాసులో అసలేం జరిగింది?

మొదటి సంవత్సరం సెకండరీ స్కూలు విద్యార్థులు భూగోళ శాస్త్రం పాఠం వింటుండగా ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు చెప్పారు.

హ్యాకింగ్ జరిగినప్పుడు ఆ ఆన్‌లైన్ క్లాసులో 39 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యలో అకస్మాత్తుగా ఇద్దరు పురుషులు తెరపై కనిపించారు, అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. దాంతో, అవాక్కైన ఉపాధ్యాయులు వెంటనే ఆ క్లాసును ఆపేశారు.

“ఆన్‌లైన్ తరగతులు సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది అంత సులువు కాదని నాకు తెలుసు. కానీ ఒక పేరెంట్‌గా నాకు ఆందోళన ఉంది” అని ఒక వ్యక్తి అన్నారు.

ఈ ఆన్‌లైన్ క్లాసులోకి హ్యాకర్లు ఎలా ప్రవేశించారన్నది ఇంకా తెలియడంలేదు.

జూమ్ మీటింగ్స్‌కు 9 అంకెల యూజర్ ఐడీ ఉంటుంది. ఈ యాప్‌లో సెక్యూరిటీ సెట్టింగ్స్ సరిగా లేకుంటే, మీటింగ్‌ జరుగుతున్నప్పుడు మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు కూడా అందులో ప్రత్యక్షమయ్యే ప్రమాదం ఉంటుంది.

ఈ యాప్‌ను కంపెనీలు, పాఠశాలలు విస్తృతంగా వాడుతున్నాయి

ఫొటో సోర్స్, epa

ఫొటో క్యాప్షన్, ఈ యాప్‌ను కంపెనీలు, పాఠశాలలు విస్తృతంగా వాడుతున్నాయి

ప్రభుత్వం ఏమంటోంది?

ఇది అత్యంత హేయమైన సంఘటన అని, దీనిపై దర్యాప్తు జరిపిస్తున్నామని, అవసరమైతే పోలీసు కేసు నమోదు చేస్తామని సింగపూర్ విద్యాశాఖ తెలిపింది.

"ముందు జాగ్రత్త చర్యగా, ఈ భద్రతా లోపాలను సవరించే వరకూ ఉపాధ్యాయులెవరూ జూమ్ అప్లికేషన్‌ను వాడొద్దు" అని ప్రభుత్వం ఆదేశించింది.

ఆన్‌లైన్ తరగతులు సురక్షితంగా ఉండేందుకు ఉపాధ్యాయులందరూ తమ లాగిన్ ఐడీలను కఠినతరం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

జూమ్‌ యాప్‌ను ఉపాధ్యాయులు వాడకుండా సస్పెండ్ చేస్తున్నామని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది

ఫొటో సోర్స్, ZOOM

ఫొటో క్యాప్షన్, జూమ్‌ యాప్‌ను ఉపాధ్యాయులు వాడకుండా సస్పెండ్ చేస్తున్నామని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది

జూమ్ స్పందన ఏంటి?

ఈ సంఘటన పట్ల తీవ్రంగా చింతిస్తున్నామని జూమ్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.

"అలాంటి ప్రవర్తనను జూమ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగితే నేరుగా జూమ్‌కు నివేదించాలని వినియోగదారులను కోరుతున్నాం. అప్పుడు మేం తగిన చర్య తీసుకోగలుగుతాం" అని అన్నారు.

భద్రతను పెంచేందుకు యాప్‌లో డీఫాల్ట్ సెట్టింగులను మార్చామని, ఆన్‌లైన్ తరగతుల నిర్వాహకులకు ప్రత్యేక సూచనలు కూడా చేశామని ఆ సంస్థ తెలిపింది.

జూమ్ అప్లికేషన్

ఫొటో సోర్స్, Getty Images

జూమ్ హ్యాక్ కావడం ఇదే మొదటిసారా?

జూమ్ అనేది ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్. 2013లో ఈ అప్లికేషన్ విడుదలైంది.

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. దాంతో, జూమ్ వాడకం భారీగా పెరిగిందని ఆ సంస్థ ఇటీవల వెల్లడించింది.

గత ఏడాది వరకు, రోజువారీ వినియోగదారుల సంఖ్య కోటి దాకా ఉండేది. ఈ ఏడాది మార్చిలో, ఆ సంఖ్య 20 కోట్లు దాటిపోయింది.

ఒక్కసారిగా వినియోగం పెరగడంతో, ప్రపంచవ్యాప్తంగా కాన్ఫరెన్సులను దుండగులు హైజాక్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇటీవల అమెరికాలోని ఓ పాఠశాలలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు తెరపైకి వచ్చి జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.

పెన్సిల్వేనియాలో జరిగిన ప్రభుత్వ వీడియో కాన్ఫరెన్సులో అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి.

ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని, 90 రోజుల్లో లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జూమ్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)