చైనా కరోనా వైరస్: 'ఇప్పటికే వందలాది మందికి సోకింది... ఇతర దేశాలకు విస్తరిస్తోంది'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళగర్
- హోదా, హెల్త్ అండ్ సైన్స్ కరెస్పాండెంట్
చైనాలో ఓ కొత్త వైరస్ పుట్టింది. అంతుచిక్కని ఈ కొత్త వైరస్ ఇప్పటికే చాలా మందికి సోకి ఉంటుందని చెబుతున్నారు. బాధితుల సంఖ్య అధికారిక లెక్కల కన్నా అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు బీబీసీతో చెప్పారు.
ఇప్పటివరకూ ఈ కొత్త వైరస్ సోకిన కేసులు 50గా నిర్ధారించారు. అయితే, ఆ సంఖ్య 1,700 వరకూ ఉంటుందని బ్రిటన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వుహాన్ నగరంలో డిసెంబర్‌లో వెలుగుచూసిన ఈ వైరస్ వల్ల శ్వాస సంబంధిత అనారోగ్యంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు తెలుసు.
''వారం రోజుల కిందటి కన్నా ఇప్పుడు నా ఆందోళన చాలా ఎక్కువగా ఉంది'' అని వ్యాధి విజృంభణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ పేర్కొన్నారు.
బ్రిటన్ ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి సంస్థలకు సలహాలు అందించే ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఎంఆర్‌సీ సెంటర్ ఫర్ గ్లోబల్ ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ ఎనాలసిస్ ఈ అధ్యయనం నిర్వహించింది.
వుహాన్ నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికులకు సింగపూర్, హాంగ్‌కాంగ్‌లు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అమెరికా అధికార యంత్రాంగం కూడా.. శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, న్యూయార్క్ నగరాల్లోని ప్రధాన విమానాశ్రయాల్లో వచ్చే శుక్రవారం నుంచి ఇదే తరహా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

వైరస్ సోకిన వారి సంఖ్యను ఎలా లెక్కించారు?
ఈ సమస్య తీవ్రత ఎంత ఉందనే దానికి కీలకమైన ఆధారం ఇతర దేశాల్లో గుర్తిస్తున్న కేసుల్లో ఉంటుంది.
ఈ వైరస్ చైనా మధ్యలో ఉన్న వుహాన్ నగరంలో మొదలైనప్పటికీ థాయ్‌లాండ్, జపాన్‌లలో రెండు కేసులు నమోదయ్యాయి.
''ఇది నాకు ఆందోళన కలిగిస్తోంది'' అని ప్రొఫెసర్ ఫెర్గూసన్ చెప్పారు.
''వుహాన్ మూడు కేసులను ఇతర దేశాలకు ఎగుమతి చేసిందంటే.. వాళ్లు చెప్తున్న దాని కన్నా చాలా ఎక్కువ కేసులు ఉండాలని అర్థం'' అని ఆయన పేర్కొన్నారు.
అయితే, కచ్చితమైన సంఖ్యను తేల్చటం అసాధ్యం. కానీ ఈ వైరస్, స్థానిక జనాభా సంఖ్యను, విమాన ప్రయాణికుల సమాచారం ఆధారంగా వల్ల వ్యాధి విజృంభన నమూనాను రూపొందించటం ద్వారా ఒక అంచనాకు రావచ్చు.
వుహాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 1.9 కోట్ల మంది జనాభాకు సేవలు అందిస్తుంది. కానీ, ఇక్కడి నుంచి రోజుకు సగటున 3,400 మంది మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తారు.
వీటి ఆధారంగా రూపొందించిన సవివరమైన లెక్కలతో 1,700 కేసులు ఉండవచ్చుననే అంచనాకు వచ్చారు. ఈ అంచనా నమూనాను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దీని అర్థం ఏమిటి?
ఈ వైరస్ విజృంభణ గురించి తీవ్ర భయాందోళనలకు గురికావాల్సిన పరిస్థితి ఇప్పుడే లేదని ప్రొఫెసర్ ఫెర్గూసన్ చెప్పారు. అయితే, తాను వారం రోజుల కిందటి కంటే ఇప్పుడు ఎక్కువ ఆందోళనగా ఉన్నట్లు తెలిపారు.
ఇదిలావుంటే, ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపిస్తున్న ఉదంతాలేవీ లేవని చైనా అధికారులు అంటున్నారు.
వుహాన్‌లోని ఒక సముద్ర, అటవీ ఆహార మార్కెట్‌లో జంతువుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకిందని వారు పేర్కొన్నారు.
''ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకే ప్రమాదం, అవకాశాల గురించి మరింత సీరియస్‌గా పట్టించుకోవాలి'' అని ప్రొఫెసర్ పెర్గూసర్ వాదిస్తున్నారు.
కరోనావైరస్‌ల గురించి మనకు తెలిసిన విషయాలను బట్టి చూస్తే, ఇంత పెద్ద సంఖ్యలో మనుషులకు సోకటానికి ప్రధాన కారణం జంతువులే అయ్యే అవకాశం ఉందని నేను భావించటం లేదు'' అని ఆయన చెప్పారు.
ఓ కొత్త వైరస్ ఎలా విస్తరిస్తోందో అర్థంచేసుకోవడం, ముప్పును అంచనా వేయటానికి చాలా కీలకం.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ ఈ వైరస్ ఏమిటి?
ఈ వైరస్ సోకిన రోగుల నుంచి శాంపిల్స్ సేకరించి లేబరేటరీల్లో విశ్లేషించారు.
ఇది మనుషులు, ఇతర జంతువుల్లో వ్యాధులకు కారకమయ్యే కరోనావైరస్ అని చైనా అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు నిర్ధారించారు.
కరోనావైరస్‌లు.. ఒక విస్తృత కుటుంబానికి చెందిన వైరస్‌లు. కానీ, అందులో కేవలం ఆరు వైరస్‌లు మాత్రమే మనుషులకు సోకుతాయని తెలుసు. ఈ కొత్త వైరస్‌తో ఈ సంఖ్య ఏడుకు పెరుగుతుంది.
ఈ వైరస్‌లు మనుషుల మీద అతి స్వల్పంగా ప్రభావం చూపితే మామూలు జలుబు కలిగిస్తాయి. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) అనే కరోనావైరస్.. 2002లో చైనాలో విజృంభించి వ్యాప్తి చెందినపుడు 8,098 మందికి సోకగా వారిలో 774 మందిని బలితీసుకుంది.
కొత్త వైరస్ జన్యు పటాన్ని విశ్లేషించినపుడు... ఇది ఇతర కరోనా వైరస్‌ల కన్నా సార్స్ వైరస్‌కు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించింది.
ఈ వైరస్ వల్ల కొందరు రోగులకు న్యుమోనియా వచ్చింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇతర నిపుణులు ఏం చెప్తున్నారు?
ఈ వైరస్ విజృంభణ విషయంలో ఇంకా వెలుగులోకి రావాల్సింది చాలా ఉందని వైద్య పరిశోధన స్వచ్ఛంద సంస్థ 'వెల్‌కమ్' డైరెక్టర్ డాక్టర్ జెరిమీ ఫారర్ అన్నారు.
''ఈ వైరస్ విషయంలో అనిశ్చితి, లోపాలు ఉన్నాయి. కానీ, ఇది ఏదో ఒక స్థాయిలో మనిషి నుంచి మనిషికి సోకుతోందనేది విస్పష్టం'' అని చెప్పారు.
''చైనా, ఇతర దేశాల్లో మరిన్ని కేసులు బయటపడటం మొదలైంది. ఈ నమూనా చూపినట్లు మరిన్ని కేసులు, మరిన్ని దేశాల్లో కనిపిస్తాయని తేలుతోంది'' అని ఆయన విశ్లేషించారు.
''ముఖ్యమైన విషయం ఏమిటంటే, విస్తృతంగా పరీక్షలు నిర్వహించనిదే ఎన్ని కేసులు ఉన్నాయనే వాస్తవ సంఖ్యను లెక్కించటం కష్టం'' అని యూనివర్సిటీ ఆఫ్ నాటింగామ్ ప్రొఫెసర్ జొనాథన్ బాల్ చెప్పారు.
''అయితే, ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించలేదని మనకు నిర్ధారణ అయ్యే వరకూ ఈ సంఖ్యను సీరియస్‌గా పట్టించుకోవాలి. జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకిన కేసులు 41 ఉన్నాయంటే కొంచెం అతిగా అనిపిస్తోంది. ఇప్పటివరకూ గుర్తించిన కేసుల కన్నా మరింత అధికంగా ఈ ఇన్‌ఫెక్షన్ వ్యాపించి ఉండొచ్చు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- భూత వైద్యం: వైద్యులకు దెయ్యాలపై చదువు చెప్పనున్న బనారస్ హిందూ యూనివర్శిటీ
- రాకాసి ఆకలి: తిండి దొరక్కపోతే తమని తామే తినేస్తారు
- ‘నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’
- అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి.. జరిగే నష్టమేంటి
- రూపాయి చరిత్ర : కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- కీటకాలు అంతరిస్తున్నాయి.. అవి లేకపోతే మనిషి కూడా బతకలేడు
- ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- జాలర్లకు సముద్రంలో రహస్య నిఘా పరికరాలు దొరుకుతున్నాయి.. ఎందుకు
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: కంగారూల ద్వీపాన్ని కమ్మేసిన మంటలు
- సెక్స్ కోరికలు ఎక్కువైన ఈ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది... తన జాతి అంతరించి పోకుండా కాపాడింది
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- మహిళల జీవితాలను మార్చేసిన కుట్టు మిషన్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








