వరల్డ్‌ కప్ 2019లో దక్షిణాఫ్రికాను వీడని కష్టాలు.. వెస్టిండీస్‌తో మ్యాచ్ వర్షార్పణం

దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డుప్లెసిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డుప్లెసిస్

క్రికెట్ ప్రపంచకప్ 2019లో దక్షిణాఫ్రికాకు కష్టాలు వెంటాడుతున్నాయి. సోమవారం వెస్టిండీస్‌తో ప్రారంభమైన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది.

ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచుల్లో ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా జట్టు సౌతాంప్టన్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగి 7.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం కొన్ని గంటల పాటు కురుస్తూ.. ఆగుతూ.. మళ్లీ కురుస్తూ వచ్చింది. దీంతో సాయంత్రం 4.15 గంటలకు మ్యాచ్‌ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు.

దీంతో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లకు చెరొక పాయింట్ లభించింది. నాలుగు మ్యాచ్‌ల అనంతరం దక్షిణాఫ్రికాకు లభించిన తొలి పాయింట్ ఇదే.

అయినప్పటికీ ఆ జట్టు కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరుకుంది.

పది జట్లు తలపడుతున్న ఈ ప్రపంచకప్‌లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి.

ఈ ప్రపంచకప్‌ సమరంలో వర్షం వల్ల రద్దయిన రెండో మ్యాచ్ ఇది. గత శుక్రవారం పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ కూడా ఇలాగే వర్షం వల్ల రద్దయ్యింది.

ప్రపంచకప్ పాయింట్ల పట్టిక
ఫొటో క్యాప్షన్, ప్రపంచకప్ పాయింట్ల పట్టిక

దక్షిణాఫ్రికా తన తదుపరి మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ జట్టుతో తలపడనుంది. శనివారం జరిగే ఈ మ్యాచ్‌లో తాము తప్పక గెలిచి తీరాలని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ చెప్పాడు.

వన్డేల్లో 3వ ర్యాంకులో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచకప్ 2019 తొలిపోరులో ఇంగ్లండ్‌పై 104 పరుగుల తేడాతో, తర్వాత బంగ్లాదేశ్‌పై 21 పరుగుల తేడాతో, భారత్‌పై 6 వికెట్ల తేడాతో వరుస పరాజయాలు చవిచూసింది.

మంగళవారం.. బ్రిస్టల్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య, టాన్‌టన్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచులు జరగాల్సి ఉండగా.. ఆయా ప్రాంతాల్లో కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, వెస్టిండీస్ జట్టు సౌతాంప్టన్‌లో జరిగే తన తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)