హాంగ్ కాంగ్: చైనాకు నిందితులను అప్పగించే ప్రతిపాదన మీద ఇంత తీవ్ర నిరసనలు ఎందుకు?

హాంగ్ కాంగ్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

హాంగ్ కాంగ్ నుండి 'నేరస్తుల'ను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన ఒక ముసాయిదా చట్టంపై హాంగ్‌కాంగ్‌లో భారీ నిరసన పెల్లుబుకుతోంది.

అయినప్పటికీ.. హాంగ్ కాంగ్ ఆ బిల్లును ఆమోదించి తీరుతానని చెప్తోంది. ప్రతిపాదిత సవరణలతో హాంగ్ కాంగ్ నగరం నేరస్తులకు సురక్షిత ఆశ్రయంగా ఉండబోదని వాదిస్తోంది.

కానీ.. ఈ ప్రతిపాదిత చట్టాన్ని చైనాలో తీవ్ర లోపభూయిష్టమైన పోలీసు, న్యాయ వ్యవస్థ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల హాంగ్ కాంగ్ న్యాయ వ్వవస్థ స్వాతంత్ర్యం ఇంకా తరిగిపోతుందని చెప్తున్నారు.

ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

కానీ హాంగ్ కాంగ్ నాయకురాలు క్యారీ ల్యామ్ ఆ ముసాయిదాను నిలిపివేయటానికి నిరాకరించారు. చట్టానికి సవరణలను జూలైలో ఆమోదించటానికి సంసిద్ధమయ్యారు.

హాంగ్ కాంగ్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు

ఏమిటీ మార్పులు?

హాంగ్ కాంగ్‌లో హత్య, అత్యాచారం వంటి నేరాల్లో అనుమానితులను తమకు అప్పగించాల్సిందిగా చైనా, తైవాన్, మకావు అధికారులు కోరటానికి ప్రతిపాదిత మార్పులు అవకాశం కల్పిస్తాయి.

ఈ విజ్ఞప్తులను హాంగ్ కాంగ్ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఇలా నిందితులు, అనుమానితులను అప్పగించాలన్న విజ్ఙాపనలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం హాంగ్ కాంగ్ కోర్టులకే ఉంటుందని చెప్తున్నారు.

అలాగే.. రాజకీయ నేరాలు, మతపరమైన నేరాలలో నిందితులను అప్పగించబోమని కూడా హాంగ్ కాంగ్ అధికారులు పేర్కొన్నారు.

వ్యాపారవేత్తల నుంచి వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో.. పన్ను ఎగవేత వంటి పలు వాణిజ్య నేరాలను ఈ అప్పగింత నేరాల జాబితా నుంచి తొలగించారు.

ఈ ప్రతిపాదిత చట్టం మీద ప్రజల ఆందోళనల నేపథ్యంలో వారికి భరోసా కల్పించటానికి హాంగ్ కాంగ్ ప్రభుత్వం ప్రయత్నించింది.

కనీసం ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం గల నేరాల్లో పరారీలో ఉన్న నిందితులను మాత్రమే చైనాకు అప్పగిస్తామని హామీ ఇవ్వటం వంటి మినహాయింపులు చేరుస్తామని హామీ ఇస్తోంది.

హాంగ్ కాంగ్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, AFP

ఈ చట్టం ఎందుకు వివాదాస్పదం?

కొత్త చట్టం ఫలితంగా.. చైనా చట్ట వ్యవస్థ కింద అనుమానితుల పేరుతో ప్రజలను ఏకపక్షంగా నిర్బంధించటం, అన్యాయంగా విచారించటం, హింసకు గురిచేయటం జరుగుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

''మెయిన్‌ల్యాండ్ చైనాకు సంబంధించి హాంగ్ కాంగ్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ ఈ ప్రతిపాదన ప్రమాదంలోకి నెడుతుంది. ఉద్యమకారులు, మానవ హక్కుల న్యాయవాదులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు.. ఏ ఒక్కరికీ భద్రత ఉండదు'' అని హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రతినిధి సోఫీ రిచర్డ్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చైనా నాయకులను విమర్శించే పుస్తకాలను విక్రయించినందుకు 2015లో తనను అపహరించి చైనాలో నిర్బంధించారని.. 'చట్టవ్యతిరేకంగా బుక్‌స్టోర్ నిర్వహిస్తున్నా'నని తనపై అభియోగం మోపారని.. హాంగ్ కాంగ్ పుస్తక విక్రేత లామ్ వింగ్ కీ చెప్పారు.

''నేను చైనా వెళ్లకపోతే.. హాంగ్ కాంగ్ అధికారులే నన్ను అప్పగిస్తారు. ఈ ప్రభుత్వం నా భద్రతకు కానీ.. హాంగ్ కాంగ్ నివాసి అయిన ఏ ఒక్కరి భద్రతకు కానీ భరోసా ఇస్తుందన్న నమ్మకం నాకు లేదు'' అని ఆయన పేర్కొన్నారు.

ల్యామ్ గత ఏప్రిల్ చివర్లో హాంగ్ కాంగ్ నుంచి పారిపోయి తైవాన్‌లో తలదాచుకుంటున్నారు. అక్కడ ఆయనకు తాత్కాలిక నివాస వీసా ఇచ్చారు.

హాంగ్ కాంగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చైనాలో భాగమే అయినప్పటికీ హాంగ్ కాంగ్‌కు సొంత న్యాయ వ్యవస్థ ఉంది

హాంగ్ కాంగ్‌లో ప్రతిపాదిత అప్పగింత చట్టాన్ని వ్యతిరేకిస్తున్నది ఎవరు?

ఈ చట్టానికి ప్రజల్లో చాలా విస్తృతంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమాజంలోని అన్ని వర్గాలు, బృందాల వారు - న్యాయవాదులు మొదలుకుని స్కూళ్లు, ఇళ్లలో ఉండే మహిళల వరకూ - తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మార్పులను వ్యతిరేకిస్తూ దరఖాస్తులు సమర్పించారు.

ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనలో పది లక్షల మంది పాల్గొన్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే.. అత్యధికంగా 2.40 లక్షల మంది మాత్రమే నిరసనలో పాల్గొన్నారని పోలీసులు చెప్తున్నారు.

నిరసన ప్రదర్శన నిర్వాహకుల అంచనా వాస్తవమైతే.. ఒకప్పుడు బ్రిటిష్ వలస ప్రాంతంగా ఉన్న హాంగ్ కాంగ్‌ను 1997లో చైనాకు అప్పగించినపుడు జరిగిన ప్రదర్శన తర్వాత.. ఇదే అత్యంత భారీ ప్రదర్శన అవుతుంది.

ప్రతిపాదిత చట్టాన్ని పక్కనపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల మొదట్లో 3,000 మంది న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, విద్యావేత్తలు మౌన ప్రదర్శన నిర్వహించారు.

హాంగ్ కాంగ్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, ANTHONY KWAN

అంతర్జాతీయంగానూ ఆందోళన

హాంగ్ కాంగ్ ప్రతిపాదిత చట్టం మీద అంతర్జాతీయంగా కూడా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

హాంగ్ కాంగ్ మరింత ఎక్కువగా చైనా రాజకీయ ఒత్తిడి పెరగటానికి, హాంగ్ కాంగ్ స్వయం ప్రతిపత్తి ఇంకా తరిగిపోవటానికి ప్రతిపాదిత చట్టం దోహదపడుతుందని అమెరికా కాంగ్రెస్ కమిషన్ ఇటీవల వ్యాఖ్యానించింది.

బ్రిటన్, కెనడాలు కూడా ఒక సంయుక్త ప్రకటనలో ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేశాయి. హాంగ్ కాంగ్‌లో నివసిస్తున్న బ్రిటన్, కెనడా పౌరుల మీద.. ప్రతిపాదిత చట్టం చూపగల ప్రభావం గురించి కూడా ఆ దేశాలు ఆందోళన తెలిపాయి.

షి జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హాంగ్ కాంగ్ ప్రతిపాదనపై అంతర్జాతీయ విమర్శలు.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నమని చైనా ఖండిస్తోంది

యూరోపియన్ యూనియన్ సైతం తన ఆందోళనను వ్యక్తం చేస్తూ హాంగ్ కాంగ్ నాయకుడు ల్యామ్‌కు దౌత్య సూచన పంపించింది.

అయితే.. ఈ ఆందోళనలు, విమర్శలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. అదంతా హాంగ్ కాంగ్ ప్రభుత్వ ప్రతిపాదనను రాజకీయం చేయటానికి, చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నమని ఆరోపించింది.

ల్యామ్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, నిరసనలు పెల్లుబుకుతున్నా ప్రతిపాదిత చట్టాన్ని పక్కన పెట్టటానికి ల్యామ్ నిరాకరిస్తున్నారు

ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు చేస్తోంది?

గత ఏడాది ఫిబ్రవరిలో తైవాన్‌లో విహారానికి వెళ్లిన హాంగ్ కాంగ్‌కు చెందిన ఒక 19 ఏళ్ల వ్యక్తి.. గర్భిణి అయిన తన 20 ఏళ్ల గర్ల్ ‌ప్రెండ్‌ను హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

ఆ వ్యక్తి గత ఏడాది హాంగ్ కాంగ్ తిరిగి వచ్చాడు. అతడిని తమకు అప్పగించటానికి సాయం చేయాలని హాంగ్ కాంగ్ అధికారులను తైవాన్ అధికారులు కోరారు. కానీ.. తైవాన్‌తో అప్పగింత ఒప్పందం లేనందున తాము సాయం చేయలేమని హాంగ్ కాంగ్ అధికారులు బదులిచ్చారు.

ఈ నేపథ్యంలో 'నిందితుల అప్పగింత' ప్రతిపాదనను హాంగ్ కాంగ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ.. కొత్తగా చేయబోయే మార్పుల కింద సదరు అనుమానితుడిని అప్పగించాలని తాము కోరబోమని తైవాన్ చెప్తోంది. ఆ హత్య కేసును వేరుగా పరిగణించాలని అంటోంది.

హాంగ్ కాంగ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, హాంగ్ కాంగ్ - చైనా: ఒక దేశం రెండు వ్యవస్థలు

హాంగ్ కాంగ్.. చైనాలో భాగం కాదా?

హాంగ్ కాంగ్ ఒకప్పుడు బ్రిటిష్ వలస ప్రాంతంగా ఉండేది. 1997లో చైనా పాలన కిందకు వచ్చింది. కానీ.. 'ఒక దేశం - రెండు వ్యవస్థ'ల సూత్రం కింద హాంగ్ కాంగ్ పాక్షిక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా కొనసాగుతోంది.

ఈ నగరానికి తన సొంత చట్టాలు ఉన్నాయి. చైనా పౌరులకు లేని పౌర స్వాతంత్ర్యాలు హాంగ్ కాంగ్ వాసులకు ఉన్నాయి.

బ్రిటన్, అమెరికా సహా 20 దేశాలతో 'నిందితుల అప్పగింత' ఒప్పందాలు కుదుర్చుకుంది హాంగ్ కాంగ్. కానీ.. ప్రధాన చైనాతో అటువంటి ఒప్పందం ఏదీ ఖరారు కాలేదు. దీని కోసం రెండు దశాబ్దాలుగా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి.

చైనా చట్టం కింద నిందితులకు సరైన న్యాయ రక్షణ లేకపోవటమే దీనికి కారణమని విమర్శకులు చెప్తారు.

రిపోర్టర్: జెఫ్ లీ, బీబీసీ చైనీస్

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)