కాలిఫోర్నియా కార్చిచ్చు: మంటల్లో చిక్కుకుని వెయ్యి మంది మిస్సింగ్

కాలిఫోర్నియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంటల్లో వేలాది నివాసాలు కాలిపోయాయి.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా వెయ్యి మందికి పైగా ఆచూకీ తెలియడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 71కు చేరింది.

300 మంది ఆచూకీ తెలియడం లేదని గురువారం అధికారులు తెలిపారు. అయితే, శనివారం నాటికి ఆ సంఖ్య 1,011కి పెరిగింది.

అయితే, ఈ జాబితాలో కొద్దిపాటి హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని అధికారి ఒకరు తెలిపారు.

కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఈ కార్చిచ్చు వల్ల దాదాపు 12,000 భవనాలు కాలిపోయాయి. 1,42,000 ఎకరాల అడవి కాలి బూడిదయ్యింది.

పరిస్థితిని పరిశీలించి, బాధిత కుటుంబాలను కలిసేందుకు దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం కాలిఫోర్నియా వెళ్తున్నారు.

కాలిఫోర్నియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాలిఫోర్నియా చరిత్రలో ఇంతటి విధ్వంసాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని అధికారులు అంటున్నారు.

ఎనిమిది రోజుల క్రితం రాజుకున్న ఈ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తుండడంతో వేలాది మంది ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లు వదిలి వెళ్లారు. కొందరు అగ్నికీలలు చుట్టుముట్టడంతో మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.

27,000 జనాభా ఉన్న ప్యారడైజ్ పట్టణం తీవ్రంగా నష్టపోయింది. పట్టణ వాసులంతా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.

ఈ పట్టణాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలంటే ఎన్నో ఏళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు.

కాలిఫోర్నియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మలిబులో తగలబడుతున్న ఇళ్లు

కాలిఫోర్నియా రాష్ట్రవ్యాప్తంగా 9,400 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం 50 శాతం మేర మంటలను ఆర్పివేశామని, ఈ నెలాఖరులోగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

కాలిఫోర్నియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ కార్చిచ్చు వల్ల గాలిలోకి భారీగా పొగ చేరుతోంది.

ఇంతటి విధ్వంసం గతంలో ఎన్నడూ జరగలేదని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ(ఫెమా) అధికారి బ్రోక్ లాంగ్ చెప్పారు.

మృతదేహాల కోసం వెతుకుతున్నామని, ఆ ఆపరేషన్ ఇంకా కొన్ని వారాల పాటు సాగుతుందని ఆయన తెలిపారు.

కాలిఫోర్నియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Getty Images

దర్యాప్తు కొనసాగుతున్నందున, ఈ కార్చిచ్చు ఎలా రాజుకుందన్న విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు.

అయితే, మంటలు చెలరేగడానికి స్థానిక విద్యుదుత్పత్తి సంస్థే కారణమంటూ పలువురు కోర్టులో దావా వేశారు. ఆ సంస్థకు చెందిన హై ఓల్జేటీ విద్యుత్ లైను విఫలమవ్వడంతోనే ఆ మంటలు రాజుకున్నాయని వారు ఆరోపించారు.

కాలిఫోర్నియాలో కార్చిచ్చు ప్రమాదాల పట్టిక

గతంలో కాలిఫోర్నియా అడవుల్లో వేసవి కాలంలోనే అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండేవి. కానీ, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఏడాది పొడవునా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

గాలిలో తేమ తగ్గిపోవడం, వేడి గాలులు వీయడం, వర్షాలు పడక భూమి పొడిబారడం లాంటి కారణాల వల్ల మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)