కాలిఫోర్నియా కార్చిచ్చు: రెండు లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఫొటో సోర్స్, RMG News
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సోమవారం చెలరేగిన కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది.
కార్చిచ్చు కారణంగా సుమారు రెండు లక్షల మంది ప్రజలు నివాసాలు వీడి సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాల్సి వచ్చింది.
కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్ గురువారం శాండియోగోలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కార్చిచ్చు కొన్ని గంటల వ్యవధిలోనే పది ఎకరాల నుంచి 4,100 ఎకరాలకు విస్తరించింది.
సుమారు 500 ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఫొటో సోర్స్, AFP
కార్చిచ్చును నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బందిలో ముగ్గురు గాయపడ్డారు.
వెంటూరా కౌంటీలోని ఒజాయ్ పట్టణంలో తగులబడిన ప్రాంతంలో ఒక మహిళ మృతదేహం కనిపించింది.
ఆమె మరణం కారు ప్రమాదం వల్ల సంభవించి ఉండొచ్చని, ఈ ప్రమాదానికి కార్చిచ్చు కారణం కాకపోయుండొచ్చని ఒక అధికారిని ఉటంకిస్తూ వెంటూరా కౌంటీ స్టార్ పత్రిక తెలిపింది.
దాదాపు 5,700 మంది మంటలార్పే సిబ్బంది కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాలిఫోర్నియా పొరుగు రాష్ట్రాలకు చెందిన మంటలార్పే సిబ్బంది కూడా కాలిఫోర్నియాలో సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.

ఫొటో సోర్స్, EPA
తేమ శాతం తక్కువగా ఉండటం, నేల పొడబారి ఉండటం, బలమైన గాలులు వీస్తుండటం లాంటి ప్రతికూలతల వల్ల కార్చిచ్చు తీవ్రస్థాయిలో ఉంది.
హెచ్చరికల్లో అత్యధిక స్థాయి హెచ్చరిక 'పర్పుల్ అలర్ట్'ను అధికారులు జారీ చేశారు.
కాలిఫోర్నియా వర్సిటీలో తరగతుల రద్దు
లాస్ ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం గురువారం అన్ని తరగతులను రద్దు చేసింది.
విశ్వవిద్యాలయ ప్రాంగణం కార్చిచ్చు వ్యాపిస్తున్న ప్రాంతంలో లేదు. అయితే అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది.
లాస్ ఏంజెలిస్‌లో నాలుగో వంతు పాఠశాలలను మూసివేశారు.

ఫొటో సోర్స్, EPA
లాస్ ఏంజెలిస్‌లో వ్యాపారవేత్తలు, సినీ, సంగీత ప్రముఖులు నివాసం ఉండే బెల్ ఎయిర్ అనే ధనిక ప్రాంతంలో విలాసవంతమైన ఇళ్ల నుంచి పెయింటింగ్‌లను, కళాఖండాలను సహాయ చర్యల సిబ్బంది ఇతర ప్రదేశాలకు తరలించారు.
కార్చిచ్చుతో మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్‌కు చెందిన ఒక ఎస్టేట్, ద్రాక్షతోట కొంత మేర దెబ్బతిన్నాయి.
కాలిఫోర్నియా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, ఎలాంటి సహాయం అందించడానికైనా అమెరికా అధ్యక్ష కార్యాలయం సిద్ధంగా ఉందని వైట్‌హౌస్ ప్రకటించింది.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








