దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య చర్చలతో వచ్చే ఫలితం ఏంటి?

ఫొటో సోర్స్, KOREA SUMMIT PRESS POOL/AFP/Getty Images
- రచయిత, వర్జీనియా హారిసన్
- హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్
ఉభయ కొరియాల అధినాయకుల భేటీ ఇరు దేశాల్లో కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి.
కిమ్ జోంగ్-ఉన్, మూన్ జే-ఇన్ భేటీలో.. అణు కార్యక్రమానికి స్వస్తి, కొరియా ద్వీపకల్పంలో శాంతి ప్రధాన అజెండాగా ఉంది.
అణ్వాయుధాలను వదులుకోవటానికి ఉత్తర కొరియా ఒప్పుకుంటుందా అనే దానిపై విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ విషయం అలా ఉంచితే.. ఇరు దేశాలకూ ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆంక్షలు, ఇరు దేశాల మధ్య విడిపోయిన కుటుంబాలు. చర్చలకు ఇవే ప్రధాన కారణంగా భావిస్తున్న వారూ ఉన్నారు.

ఫొటో సోర్స్, KOREA SUMMIT PRESS POOL/AFP/Getty Images
గత రెండు భేటీల ఫలితాలేమిటి?
ఇది చాలా ముఖ్యమైన సమావేశం. 2007 తర్వాత ఉభయ కొరియాల అధినేతలు తొలిసారి భేటీ అవుతున్నారు. కిమ్ ఇటువంటి భేటీలో పాల్గొనటం ఇదే ప్రథమం. ఆయన ఇటీవల రహస్యంగా చైనా వెళ్లి ఆ దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో సమావేశమవటానికి భిన్నమైన భేటీ ఇది. ఈ సమావేశాన్ని ప్రపంచవ్యాప్త మీడియా కవర్ చేస్తోంది. కిమ్, మూన్ చర్చల్లో కొంత భాగాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు.
కిమ్ తన తండ్రి కిమ్ జోంగ్-ఇల్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇల్ తొలుత 2000 సంవత్సరంలో (కిమ్ దే-జంగ్‌తో) తర్వాత 2007లో (రో మూ-హ్యూన్‌తో) దక్షిణ కొరియా ప్రభుత్వాధినేతలతో సమావేశమయ్యారు. కొరియా ద్వీపకల్పంలో అణు ముప్పును పరిష్కరించటం, ఉభయ కొరియాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయటం లక్ష్యంగా ఆ సమావేశాలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
నాడు ఈ చర్చల్లో సాధించిన ఫలితాలకు గాను కిమ్ దే-జంగ్‌కు నోబెల్ శాంతి బహుమతి కూడా ప్రకటించారు. ఆ సమావేశాల ఫలితంగా క్యేసోంగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏర్పాటైంది. ఇరు దేశాల మధ్య విడిపోయిన కుటుంబాలు కలిశాయి.
కానీ నిరాయుధీకరణ జరగలేదు. అణ్వస్త్ర కవ్వింపులు పునరావృతమవుతూ వచ్చాయి. దక్షిణ కొరియాలోని మితవాద ప్రభుత్వాలు ఉత్తర కొరియా విషయంలో కఠిన వైఖరి అవలంబించటం తోడై.. శాంతి కృషి పట్టాలు తప్పింది.
ఏకాకిగా ఉండిపోయిన ఉత్తర కొరియాను బయటకు రప్పించి.. దక్షిణ కొరియా విషయంలో విశ్వసనీయతను నిర్మించే ప్రయత్నాలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. దక్షిణ కొరియా అందిస్తున్న సాయం.. ఉత్తర కొరియా వైఖరిని మార్చకపోగా ఆ దేశం అణ్వస్త్ర కార్యక్రమాన్ని కొనసాగించేందుకే తోడ్పడుతోందని తప్పు పట్టేవారూ ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ కొరియా ఏం కోరుకుంటోంది?
మళ్లీ దాదాపు దశాబ్ద కాలం తర్వాత.. అది కూడా ఇరు దేశాల మధ్య కోపతాపాలు, హెచ్చరికలు తీవ్రస్థాయిలో పెరుగుతున్న దశలో.. ఉత్తర కొరియాను చర్చలకు రప్పించగలిగింది దక్షిణ కొరియా.
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రో మూ-హ్యూన్ హయాంలో ఆయనకు సహాయకుడిగా పనిచేసిన మూన్ జే-ఇన్ గత ఏడాది అధ్యక్షుడయ్యారు. నాటి అనుభవం నేపథ్యంలో ఉత్తర కొరియాతో చర్చలకు ఆయన కృషి చేస్తున్నారు.
ఉత్తర కొరియాతో శాంతి పునరుద్ధరణ ఆయన తన హయాంలో ఒక లెగసీగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారనేదాంట్లో సందేహం లేదు’’ అని అమెరికన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సర్వీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి-యంగ్ లీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Chung Sung-Jun
సాంకేతికంగా ఇంకా పరస్పరం యుద్ధ రంగంలోనే ఉన్న ఉభయ కొరియాల మధ్య సుదీర్ఘ సంఘర్షణను ముగించేందుకు శాంతి ఒప్పందం కోసం గట్టిగా ప్రయత్నించి తీరాలని మూన్ భావిస్తున్నారు.
ఉభయ కొరియాల మధ్య ఆర్థిక సహకారానికి చిహ్నమైన క్యేసోంగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌ను దక్షిణ కొరియా 2016లో మూసివేసింది. కార్మికుల వేతనాలను ఉత్తర కొరియా సొంతం చేసుకుని అణు కార్యక్రమాలకు మళ్లిస్తోందని దక్షిణ కొరియా అందుకు కారణంగా పేర్కొంది.
అణ్వస్త్ర నిరాయుధీకరణ దిశగా పురోగతి సాధిస్తే.. దక్షిణ కొరియా యాజమాన్యంలోని ఫ్యాక్టరీల్లో దాదాపు 55,000 మంది ఉత్తర కొరియా కార్మికులకు ఉపాధి కల్పించిన ఆ కాంప్లెక్స్‌ను మళ్లీ తెరుస్తామని మూన్ చెప్తున్నారు.
కొరియా యుద్ధం వల్ల వేరైన 60,000 కుటుంబాల పున:కలయిక అంశం కూడా చర్చకు రానుంది. ఉత్తర కొరియా అణు కార్యక్రమం వల్ల సంబంధాలు క్షీణించకముందు చివరిసారిగా 2015లో ఆ కుటుంబ సమావేశాలు జరిగాయి. అలాగే.. ఉత్తర కొరియా నిర్బంధించిన విదేశీయుల విడుదల అంశం కూడా చర్చలకు వచ్చే అవకాశముంది.

ఫొటో సోర్స్, Chung Sung-Jun/Getty Images
ఉత్తర కొరియా ఏం కోరుకుంటోంది?
ఉత్తర కొరియా లక్ష్యాలు ఏమిటనేది స్పష్టంగా తెలియదు. తమ దేశాన్ని శిక్షిస్తూ విధించిన ఆంక్షల వల్లే కిమ్ చర్చలకు సిద్ధమయ్యారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
అమెరికా, ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలు.. ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను కుంటుపడేలా రూపొందించిన ఆంక్షలు. గత ఏడాది ఉత్తర కొరియా సైనిక హెచ్చరికలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ ఆంక్షలను మరింతగా పెంచారు.
ఆంక్షల వంటి అంశాలపై అమెరికా దిగివచ్చి తమతో సంప్రదింపులు జరపాలంటే.. దక్షిణ కొరియాతో తాము చర్చలు జరపడమొక్కటే మార్గంగా ఉత్తర కొరియా భావిస్తోందని అసన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ జేమ్స్ కిమ్ పేర్కొన్నారు.
అయితే.. తాము చర్చలకు ముందుకు రావటానికి కారణం ఆంక్షలు కాదని.. తమ ‘‘ఆత్మవిశ్వాస’’మే దానికి కారణమని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఉద్ఘాటిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశానికి వారం రోజుల ముందు.. తాము అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణుల పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ పరీక్షలు గతంలో ఉద్రిక్తతలకు, ఆంక్షలు పెరగటానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆ ఆంక్షలను సడలించేలా చూడాలని ఉత్తర కొరియా కోరుకుంటున్నట్లు ఈ చర్యలు సూచిస్తున్నాయి.
ఈ చర్యలను మూన్ స్వాగతించారు. అంతకన్నా ముఖ్యంగా.. కిమ్ దృష్టిలో చూస్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆహ్వానించారు.
‘‘కిమ్ దృష్టిలో అన్ని దారులూ అమెరికాకు బాటవేయాలి. మూన్‌తో చర్చలు జరపటమనేది ఆ లక్ష్యానికి చేరుకోవటానికి తను చెల్లించాల్సిన మూల్యం’’ అని లోవీ ఇన్‌స్టిట్యూట్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ విభాగం డైరెక్టర్ డాక్టర్ యువాన్ గ్రాహం విశ్లేషించారు. ట్రంప్‌తో ముఖాముఖి చర్చలు జరపటం ద్వారా ఏకాకిగా ఉన్న ఉత్తర కొరియా నాయకుడికి స్వదేశంలో ఓ విజయం లభించినట్లవుతుంది.
‘‘అమెరికా నాయకులతో సమానంగా తనను పరిగణించాల’’ని కిమ్ కోరుకుంటున్నట్లు అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లీ అంటారు.
‘‘నియంతలు ఏదైనా చేయగలరని మనం అనుకుంటుంటాం. కానీ ఆయన నిరంతరం ఒత్తిడికి లోనవుతున్నారు. ఉత్తర కొరియాలో తన స్వీయ స్థానం గురించి కూడా ఆయన ఆందోళనకు గురవుతుంటారు’’ అని లీ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Korea Summit Press Pool/Getty Images
ఈ చర్చల ద్వారా ఏం సాధించవచ్చు?
ఈ చర్చల ద్వారా వాస్తవికంగా సాధించగలిగేదానికన్నా.. వీటిపై ఆశలు, ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ కొరియా వాసుల్లో మూడు వంతుల మందికన్నా ఎక్కువ మంది ‘‘సానుకూల’’ దృక్పథంతో ఉన్నారని ఆ దేశ ఏకీకరణ మంత్రిత్వశాఖ చెప్తోంది.
ముఖ్యంగా.. ఉభయ కొరియాల ఏకీకరణకు, ఉత్తర కొరియా అణ్వస్తాలను త్యజించేందుకు ఈ చర్చలను ఒక ఆరంభంగా చూస్తున్నారు.
‘‘ఈ చర్చలు ఒక రకమైన ఆరంభ వేదికగా ఉపయోగపడవచ్చు’’ అని ప్రొఫెసర్ లీ అభిప్రాయపడ్డారు. ఈ సదస్సు నేపథ్యంగా ఇరు దేశాల మధ్య చాలా ఒప్పందాలు, మరిన్ని రాకపోకలు ఉంటాయని ఆయన భావిస్తున్నారు.
ఇరువురు నాయకుల సంబంధం మీద కూడా దృష్టి ఉంటుంది. ఇరు దేశాల అధ్యక్షులు మూన్, కిమ్‌ల మధ్య బంధం ఎలా ఉంటుంది.. వారిరువరూ కలిసి సాగగలరా అనేదాని మీద ఈ భేటీ విజయం ఆధారపడి ఉంటుందని డాక్టర్ జేమ్స్ కిమ్ వ్యాఖ్యానించారు.
‘‘ఇరువురు నాయకులకూ ఇది మంచి భేటీ అవుతుంది. కానీ.. అణ్వస్త్ర నిరాయుధీకరణకు దారితీస్తుందా అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను’’ అని ఆయన పేర్కొన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








