కొరియా సదస్సు: ఆ సంతకంతో కిమ్-ట్రంప్‌ల భేటీకి లైన్ క్లియర్!

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర-దక్షిణ కొరియా నేతల మధ్య కుదిరిన ఒప్పందం, ముఖ్యంగా వారు సంతకం చేసిన ఓ పత్రం.. కిమ్-డొనాల్డ్ ట్రంప్‌ల భేటీకి మార్గాన్ని సుగమం చేస్తుందని సోల్‌లోని కొరియన్ పెనిన్సులా ఫ్యూచర్ ఫోరమ్ నిపుణురాలు డుయోన్ కిమ్ బీబీసీతో చెప్పారు.
‘‘ఒప్పందంలో ‘సంపూర్ణ అణు నిరాయుధీకరణ’ అనే వాక్యాన్ని చేర్చడం ద్వారా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ఓ విధంగా పై చేయి సాధించారు. ఈ విషయాన్ని ఆయన నేరుగా అమెరికా దృష్టికి తీసుకెళ్లడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌ల భేటీకి వీలు కల్పించొచ్చు’’ అని డుయోన్ కిమ్ పేర్కొన్నారు.
‘కానీ ఉత్తర కొరియా కదలికల్ని చాలా నిశితంగా గమనించాలి. వాళ్లు తమ వాగ్దానాలను చాలాసార్లు నిలబెట్టుకోలేదు. ఒప్పందాలపై వాళ్లు వెనక్కు తగ్గొచ్చు. రకరకాల కుయుక్తుల ద్వారా వాళ్లు ఒప్పందం నుంచి బయటకు వచ్చి మళ్లీ అణు పరీక్షలను ముందుకు తీసుకెళ్లొచ్చు. గతాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఈ విషయంలో నేను వాళ్ల నుంచి ఎక్కువ ఆశించట్లేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు.


ఫొటో సోర్స్, Getty Images
ఇంతకుముందు కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్రాలు లేని ప్రాంతంగా మార్చడానికి ఉభయ కొరియా నేతల మధ్య ఒప్పందం కుదిరింది.
దక్షిణ కొరియా సరిహద్దులో ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్‌కూ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌కూ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ ప్రకటన చేశారు.
అయితే అణు నిరాయుధీకరణ ఎలా జరుగుతుందనే వివరాలు ఈ ప్రకటనలో లేవు.
గతంలో చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా తామిద్దరం పరస్పర సమన్వయంతో పనిచేయడానికి అంగీకరించినట్లు కిమ్ జోంగ్-ఉన్ ప్రకటించారు.
‘ఎదురుదెబ్బలు, కష్టాలు, నిరాశా నిస్పృహలు ఉంటాయి. కానీ నొప్పి లేకుండా విజయం దక్కదు’ అని కిమ్ వ్యాఖ్యానించారు.
ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటనలో అంగీకరించిన ముఖ్యమైన అంశాలు:
- రెండు దేశాల మధ్య ‘కవ్వింపు చర్యల’కు ముగింపు పలకడం.
- రెండు దేశాలనూ విభజించే డిమిలిటరైజ్డ్ జోన్‌ను ‘పీస్ జోన్’గా మార్చడం.
- ఉద్రిక్త పరిస్థితులను తొలగించేందుకు ఆయుధాలను తగ్గించడం.
- అమెరికా, చైనా దేశాలను కూడా చర్చల్లో భాగం చేసే దిశగా అడుగేయడం.
- యుద్ధం కారణంగా విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకునేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం.
- సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైల్వే వ్యవస్థను అనుసంధానించడంతో పాటు ఆధునికీకరించడం.
- ఈ ఏడాది జరగబోయే ఆసియన్ గేమ్స్‌తో సహా రానున్న రోజుల్లో జరిగే క్రీడా పోటీల్లో సంయుక్తంగా పాల్గొనడం.
అంతకు ముందు, శుక్రవారం ఉదయం ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్ సరిహద్దు దాటి వచ్చి దక్షిణ కొరియా అధ్యక్షుడిని పన్‌మున్‌జోమ్‌లో కలిశారు.
- ఒక గంట సేపు లాంఛనంగా సాగే స్వాగత కార్యక్రమం తర్వాత ఇరువురు నేతల మధ్య సంభాషణలు మొదలయ్యాయి.
- హౌస్ ఆఫ్ పీస్‌లో ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి.
- ఉత్తర కొరియా చేపట్టిన వివాదాస్పద అణు కార్యక్రమం చర్చలకు కేంద్రబిందువుగా ఉంది.
- స్థానిక సమయం ప్రకారం ఉదయం పదిన్నరకు చర్చలు మొదలయ్యాయి.
- చర్చలు ముగిసిన తర్వాత సాయంత్రం ఆరున్నరకు ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై ప్రకటన చేస్తారు.


అనేక యేళ్ల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు, బెదిరింపుల వాతావరణాన్ని చెరిపేస్తూ ఉభయ కొరియా దేశాల నేతలు చర్చల కోసం ఒక చోటికి చేరారు. కొద్ది సంవత్సరాల క్రితం బహుశా ఎవ్వరూ ఊహించి ఉండని పరిణామం ఇది.
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌తో చర్చలు జరపడానికి దక్షిణ కొరియా చేరుకున్నారు.
1953లో జరిగిన కొరియా యుద్ధం (కొరియా ద్వీపకల్పం రెండు భాగాలుగా విడిపోయింది అప్పుడే) తర్వాత ఉత్తర కొరియా నేత ఒకరు దక్షిణ కొరియా గడ్డపై అడుగు పెట్టడం ఇదే మొదటిసారి.
పన్‌మున్‌జోమ్‌లో కిమ్ జోంగ్-ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇద్దరూ చిరునవ్వుతో పరస్పరం కరచాలనం చేశారు. అలా వీరి చరిత్రాత్మక భేటీ మొదలైంది.
పన్‌మున్‌జోమ్ అనేది ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, అమెరికా సైనికులు రాత్రింబవళ్లు ఒకరితో ఒకరు కలుసుకునే చోటు. 1953 యుద్ధం తర్వాతి నుంచి ఇక్కడ కాల్పుల విరమణ అమలులో ఉంది.
కిమ్ శాంతి గీతాలాపన...
‘‘ఇది కొత్త చరిత్రకు ఆరంభం. ... శాంతి యుగానికి నాంది.’’
పాన్మున్జోమ్ సందర్శకుల పుస్తకంలో కిమ్ ఈ వ్యాఖ్య రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కిమ్, మూన్ ఇరువురి సంభాషణను టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
‘‘మనం సమావేశం ఆశావహంగా ఉండాలి. కృతనిశ్చయంతో ముందుకు సాగాలి. మన గుండె తలుపులు తెరిచి మాట్లాడుకుంటే ఈ సమావేశం మంచి ఫలితాన్నిస్తుంది’’ అని కిమ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, AFP
కిమ్ భార్య కూడా వచ్చారా?
ఉభయ కొరియాల మొదటి రెండు శిఖరాగ్ర సదస్సుల్లో ఇరు దేశాల అధినేతల భార్యలు ఎక్కడా కనిపించలేదు.
అయితే.. కిమ్ భార్య రి సోల్-జును ఉత్తర కొరియా మరింత ఎక్కువగా ప్రజల మధ్యకు తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆమె కూడా హాజరవుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే.. ఆమె ఇంకా దక్షిణ కొరియాలో కనిపించలేదు.

ఫొటో సోర్స్, Reuters
సరిహద్దుకు అటూ ఇటూ...
కిమ్.. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9:30 గంటలకు సరిహద్దులోని నిస్సైనిక ప్రాంతానికి చేరుకున్నారు.
మూన్ అనూహ్యంగా సరిహద్దు దాటి ఉత్తర కొరియా భూభాగంలోకి అడుగుపెట్టి కిమ్‌తో కరచాలనం చేశారు. ఆ తర్వాత ఇరువురూ కలిసి దక్షిణ కొరియా భూభాగం లోకి ప్రవేశించి మరోసారి కరచాలనం చేశారు.

ఫొటో సోర్స్, Reuters
ఇరువురు నాయకులకూ దక్షిణ కొరియా సైనిక వందనం చేసింది.
‘‘మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది’’ అని కిమ్‌తో మూన్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తామంటూ ఉత్తర కొరియా ఇటీవల ఇచ్చిన సంకేతాలపై ఈ చరిత్రాత్మక సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశముంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్-ఉన్‌ల మధ్య జూన్ ఆరంభంలో ప్రతిపాదిత ముఖాముఖి చర్చలకు సన్నాహకంగా ఉత్తర - దక్షిణ కొరియాల మధ్య ఈ చర్చలు జరుగుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









