తెలంగాణ: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్‌హౌస్‌ బావిలో యువకుడి మృతదేహం - ప్రెస్ రివ్యూ

ఎర్రవల్లి గ్రామం
ఫొటో క్యాప్షన్, ఎర్రవల్లి గ్రామం

సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో పనికి వెళ్లిన యువకుడు మూర్చతో బావిలో పడి మృతి చెందినట్లు 'సాక్షి' పేర్కొంది.

''వర్ధరాజ్‌పూర్‌కు చెందిన రెడ్డమైన ఆంజనేయులు (19) కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూలీ పనులు చేస్తున్నాడు. మంగళవారం ఉదయం కొంతమంది కూలీలతో కలిసి ఫామ్‌హౌస్‌కు వచ్చాడు.

పెద్దబావి పక్కన ముళ్లపొదలను తొలగిస్తుండగా మూర్ఛ రావడంతో అందులోకి జారి పడ్డాడు. పక్కనే ఉన్న కూలీలు పనిలో నిమగ్నమై అతన్ని గమనించలేదు.

ఎంతకీ కనిపించకపోవడంతో బావిలో పడి ఉండొచ్చని భావించి కుటుంబ సభ్యులకు తెలిపారు. సాయంత్రం గజ ఈతగాళ్లతో బావిని గాలించినా ఫలితం లేకపోయింది.

బుధవారం మళ్లీ గజ ఈతగాళ్లు బావిలో గాలింపు చర్యలు చేపట్టగా ఆంజనేయులు మృతదేహం లబించింది.

అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. తండ్రి కిష్టయ్య ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు మర్కూక్ పోలీసులు తెలిపారని'' సాక్షి వెల్లడించింది.

బాధిత కుటుంబానికి రూ.7.5 లక్షల పరిహారం ఇచ్చినట్లు తెలిసిందని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

వర్చువల్‌ విచారణలో వకీలు రాసలీల

వర్చువల్‌గా కోర్టు విచారణలో ఓ మహిళతో అభ్యంతరకమైన రీతిలో కనిపించిన వకీలుపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయినట్లు 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది

''క్షణాల్లోనే లాయర్‌గారి సరసాలు నెట్‌లో వైరల్‌ అయిపోయాయి. ఆర్‌డీ సంతాన కృష్ణన్‌ అనే అడ్వొకేట్‌దీ ఘనకార్యం! ఈ ఘటనపై సీరియస్‌ అయిన మద్రాస్‌ హైకోర్టు, కృష్ణన్‌పై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది.

జస్టిస్‌ ప్రకాశ్‌, జస్టిస్‌ హేమలతతో కూడిన ధర్మాసనం, ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఐటీ చట్టం కింద అపరాధంగా పరిగణించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది.

గురువారానికి (డిసెంబరు 23) నివేదికను ఇవ్వాలని స్పష్టం చేసింది. ''విచారణ సందర్భంగా చోటుచేసుకున్న అశ్లీల ప్రదర్శనను కోర్టు ఓ మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకోబోదు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

లాయర్‌ సంతాన కృష్ణన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా బార్‌ కౌన్సిళ్లను ఆదేశించింది. ఈ మేరకు వెంటనే స్పందించిన తమిళనాడు, పుదుచ్చేరి బార్‌ కౌన్సిళ్లు.. ఏ కోర్టులోనూ ప్రాక్టీస్‌ చేయకుండా సంతాన కృష్ణన్‌పై నిషేధం విధించాయి.

కాగా ఇంటర్నెట్‌ నుంచి వీడియోను తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని చెన్నై సీపీకి ఆదేశాలు వెళ్లాయి.

కాగా సుమేధ్‌ సైనీ అనే రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, పంజాబ్‌ మాజీ పోలీస్‌ చీఫ్‌.. ఓ కేసుకు సంబంధించి వర్చువల్‌ విచారణలో భాగంగా పడకమీద పడుకున్న స్థితిలో వీడియోలో కనిపించారు.

1994లో మూడు హత్యలు జరిగిన ఘటనలో సుమేధ్‌ నిందితులు. ఈ నెల 22న సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది.

సుమేధ్‌ ప్రవర్తనను సీబీఐ జడ్జి సంజీవ్‌ అగర్వాల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. మున్ముందు జాగ్రత్తగా ఉండాలని వర్చువల్‌ విచారణలో భాగంగా కోర్టు మర్యాదను పాటించాలని హెచ్చరించినట్లు'' ఆంధ్రజ్యోతి తెలిపింది.

సలీమా

ఫొటో సోర్స్, RACHAKONDA POLICE/FB

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫొటో

రాష్ట్రంలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ సలీమా నిలిచారని 'నమస్తే తెలంగాణ' తెలిపింది.

'' ఈనెల 21న కేంద్రం విడుదల చేసిన నాన్ కేడర్ ఐపీఎస్‌ల జాబితాలో ఆమెకు స్థానం దక్కింది.

చింతకాని మండలం కోమట్ల గూడెంకు చెందిన లాల్ బహదూర్, యూకూబీ దంపతుల కూతురు సలీమా. తండ్రి ఖమ్మంలో ఎస్సైగా పనిచేసి రిటైర్ అయ్యారు.

సలీమా చదువంతా ఖమ్మంలోనే సాగింది. డిగ్రీ వరకు స్థానికంగానే చదువుకున్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశారు. 2007 గ్రూప్-1లో డీఎస్పీగా ఎంపికయ్యారు.

ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో తొలి పోస్టింగ్ పొందిన ఆమె అంబర్ పేట పీటీసీ వైస్ ప్రిన్సిపాల్‌గా, మాదాపూర్‌లో అదనపు కమిషనరేట్‌లో డీసీపీగా, ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీగా ఉన్నారని'' నమస్తే తెలంగాణ పేర్కొంది.

వరి

ఫొటో సోర్స్, EPA

39 వేల ఎకరాల్లోనే వరి పంట, నిరుటి సాగులో 15 శాతమే

రాష్ట్రంలో యాసంగి సాగు వెనుకపడింది. నిరుడు ఈ టైమ్​కు సాగైన విస్తీర్ణంలో ఇప్పటికి 15 శాతం మాత్రమే సాగైనట్లు ‘వెలుగు’ తెలిపింది.

‘‘యాసంగి సీజన్​ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఇంకో 10 రోజులు లేట్​గా పంటలేసినా.. సీజన్​ ముగిసేందుకు 15 రోజులే టైమ్​ ఉంది.

ఈ 15 రోజుల్లో మిగతా 85 శాతం సాగు జరిగేట్లు కనిపించట్లేదని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికి కేవలం10.27 లక్షల ఎకరాల్లోనే రైతులు పంటలేశారు. నిరుడు కంటే ఈయేడు నెల ముందే సాగు మొదలైనా.. టార్గెట్​లో 20 శాతం కూడా దాటలేదు.

సీజన్​లో సాధారణ పంటల సాగు 46.49 లక్షల ఎకరాలు కాగా, నిరుడు యాసంగి ముగిసే నాటికి 68.16 లక్షల ఎకరాల్లో పంటలేశారు.

వ్యవసాయశాఖ నిరుడు సాగును టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకోగా ఇప్పటివరకు టార్గెట్‌‌‌‌‌‌‌‌లో కేవలం15 శాతం మాత్రమే వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ విషయం బుధ వారం ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో పేర్కొనట్లు’’ వెలుగు తెలిపింది..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)