‘మాజీ ముఖ్యమంత్రి, ఇతర నేతలపై రాసలీలల వల’ -ప్రెస్ రివ్యూ

లైంగిక కార్యకలాపం సింబాలిక్ ఫొటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

రాజకీయ నేతలు, సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని మధ్యప్రదేశ్‌లో అయిదుగురు మహిళలు సాగించిన సెక్స్ స్కాండల్ వెలుగు చూసిందని నమస్తే తెలంగాణ ఒక కథనంలో తెలిపింది.

‘‘అధికారులను, రాజకీయ నేతలను ప్రలోభ పెట్టి, వారితో లైంగిక కార్యకలాపాలు, సంభాషణల వీడియోలు, ఆడియోలను రికార్డు చేసి.. తర్వాత వారిని బెదిరించి భారీగా డబ్బు వసూలు చేస్తున్న మహిళల ముఠా గుట్టును మధ్యప్రదేశ్ పోలీసులు బయట పెట్టారు.

వారి నుంచి దాదాపు 4000 ఆడియో, వీడియో ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో వెయ్యికి పైగా ఫైళ్లు ఉండి ఉంటాయని, వాటి కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు.

తనపై చిత్రీకరించిన వీడియోను బయటపెట్టకుండా ఉండాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని ఆర్తీ దయాళ్ అనే మహిళ డిమాండ్ చేశారంటూ ఇండోర్ నగరపాలక సంస్థ అధికారి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సదరు అధికారి నుంచి తొలి విడతగా రూ.50 లక్షల వసూలు కోసం బయల్దేరిన ఆర్తీ దయాళ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించడంతో ముఠా గుట్టు రట్టయింది.

ఈ కుంభకోణంలో బాలీవుడ్‌కు చెందిన ద్వితీయ శ్రేణి హీరోయిన్లు కూడా పాలుపంచుకున్నారు.

ఈ వ్యవహారానికి సూత్రధారిగా వ్యవహరించిన శ్వేతా విజయ్ జైన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణం మధ్యప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాకపోవచ్చునని తెలిపారు. పలువురు సీనియర్ అధికారులు, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ ముఠాకు చిక్కినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఈ వలలో పడ్డ ప్రముఖుల్లో ఒక మాజీ సీఎం, ఒక మాజీ గవర్నర్‌, 13 మంది అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారని ఆంధ్రజ్యోతి తన కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం- విలాసవంతంగా జీవించేందుకు డబ్బులిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కాలేజీ అమ్మాయిలను నమ్మించి, వారిని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులకు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు వల వేశారు. కొందరి నుంచి కోట్ల రూపాయలు బలవంతపు వసూళ్లు చేశారు. మరికొందరికి అమ్మాయిలను ఆశ చూపి పెద్దయెత్తున ప్రభుత్వ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నారు.

మధ్యప్రదేశ్‌లో 'క్విడ్‌ ప్రో కో' ఆరోపణలతో ఏకంగా పది మందికిపైగా సీనియర్‌ అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారిస్తోంది. శ్వేత భోపాల్‌లో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.

మద్యపానం

ఫొటో సోర్స్, Getty Images

మద్యం దుకాణాలను నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలను తానే స్వయంగా నిర్వహించాలని యోచిస్తోందని, దీనిపై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖను ఆదేశించిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ప్రభుత్వ అధీనంలో షాపులను నడిపితే లాభాలు ఏ మేరకు ఉంటాయి? ఇబ్బందులేమిటి? ఎంత మంది సిబ్బంది అవసరం? కొత్తగా నియామకాలు ఏమైనా చేపట్టాలా? వంటి అంశాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది. పూర్తి వివరాలతో ఒక నివేదిక ఇవ్వాలని కోరింది.

దీనిపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వమే నడిపితే వచ్చే లాభనష్టాలపై అధ్యయనం మొదలైంది. ప్రజాభిప్రాయం కూడా సేకరిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలోని 2,216 మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల విధానం కింద ప్రభుత్వం వీరికి షాపులను అప్పగించి, పన్ను వసూలు చేస్తోంది.

జగన్

ఫొటో సోర్స్, FB/ANDHRAPRADESHCM

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధానికి జగన్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని పాలనా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారని ఈనాడు తెలిపింది.

అటవీ, పర్యావరణశాఖలపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు.

పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యత ప్రభుత్వమే తీసుకొంటుందని, ఆ మేరకు వాటికి హరిత పన్ను విధిస్తుందని జగన్ తెలిపారు.

పరిశ్రమల రూపంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తుంటే ఎర్రతివాచీ పరిచి ఆహ్వానిస్తున్నామేగాని, వాటి నుంచి ఎలాంటి కాలుష్యం వెలువడుతుందనే ఆలోచన చేయట్లేదని, ఈ పరిస్థితి మారాలని ముఖ్యమంత్రి చెప్పారు.

ఉత్తమ్

ఫొటో సోర్స్, FB/UTTAMKUMARREDDY

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ చరిత్రను మలుపు తిప్పే ఎన్నిక: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక తెలంగాణ చరిత్రను మలుపు తిప్పే ఎన్నిక అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారని సాక్షి తెలిపింది.

ఈ ఎన్నిక అవినీతి, అధికారానికి - నీతి నిజాయతీకి జరుగుతున్న పొరాటమని ఆయన అభిప్రాయపడ్డారు.

గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

ఎవరు నిస్వార్థంగా పనిచేశారో, ఎవరు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)