ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రామ్‌నాథ్ కోవింద్‌‌కు చంద్రబాబు వినతి - ప్రెస్ రివ్యూ

రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు

ఫొటో సోర్స్, fb/President of India

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను చక్కదిద్దడానికి ఆర్టికల్ 356ని ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారని ఈనాడు ఒక కథనం రాసింది.

ఆ కథనం ప్రకారం.. ఈ నెల 19న ఏపీలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం, పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి హింసించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ 323 పేజీల పుస్తకంతో పాటు తాజా పరిణామాలను వివరిస్తూ రూపొందించిన 8 పేజీల వినతి పత్రాన్ని టీడీపీ ప్రతినిధి బృందం రాష్ట్రపతికి అందజేసింది.

తాము చెప్పినవన్నీ రాష్ట్రపతి సావధానంగా విన్నారని, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారని టీడీపీ బృందం మీడియాకు చెప్పింది.

ఏపీ పరువు తీయడానికే బాబు దిల్లీ పర్యటన - వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌ పరువు తీయడానికే చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వెళ్లారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ విమర్శించారని సాక్షి పత్రిక పేర్కొంది.

తనకు అధికారం దక్కలేదన్న అక్కసుతో చంద్రబాబు అబద్ధాలు, అవాస్తవాలు పోగేసుకుని ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిశారని.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు, ఇక్కడ యువత డ్రగ్స్‌కు బానిసలైపోయినట్టు ఆరోపణలు చేశారని ఆయన అన్నారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, Trs

ఏపీలోనూ పార్టీ పెట్టమంటున్నారు - కేసీఆర్

దళిత బంధు పథకాన్ని చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీని పెట్టాలంటూ అక్కడి నుంచి వేలాది వినతులు వస్తున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌లో సోమవారం జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొమ్మిదోసారి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తెలంగాణ ఏర్పడితే ఇక్కడ అంధకార బంధురమవుతుందని దుష్ప్రచారం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.

''ఏ ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయామో ఆ ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం రూ.1.70 లక్షల కోట్లు. మన తలసరి ఆదాయం రూ.2.30 లక్షల కోట్లు. తెలంగాణ ఇస్తే కరెంటు ఉండదని ఏ ఏపీ నుంచి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండో అదే ఏపీలో ఇప్పుడు కరెంటు లేదు. ఇక్కడ 24 గంటల కరెంటు ఉంది'' అని ఎద్దేవా చేశారు.

దళిత బంధు పథకాన్ని చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీని పెట్టాలంటూ అక్కడి నుంచి వేలాది వినతులు వస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు.

''సార్‌.. మీ పార్టీని ఇక్కడ కూడా ప్రారంభించండి. మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నం.. మాకు మీ పథకాలు కావాలంటూ ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది విజ్ఞప్తి చేస్తున్నారు'' అని తెలిపారు.

పార్టీ అభిమానులకు అభివాదం చేస్తున్న షర్మిల
ఫొటో క్యాప్షన్, పార్టీ అభిమానులకు అభివాదం చేస్తున్న షర్మిల

నా జీవితం తెలంగాణకే అంకితం- షర్మిల

సీఎం కేసీఆర్‌ను నమ్ముకుంటే ప్రజల బతుకులు మారవని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నట్లు వెలుగు పత్రిక ఒక కథనం రాసింది.

ఆ కథనం ప్రకారం మహిళలు ఇబ్బందులు పడుతున్నా, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌కు పట్టడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

షర్మిల పాదయాత్రలో భాగంగా మహేశ్వరం మండలం లేమూరులో ప్రజలతో మాట్లాడారు.

కేవలం ఐదేళ్లు మాత్రమే సీఎంగా ఉన్న వైఎస్ఆర్..ఎలాంటి ట్యాక్సులు పెంచకుండానే..ఉచిత పథకాలతో పాటు ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేశారని తెలిపారు.

ప్రస్తుతం ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ కు పట్టడం లేదని విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)