‘పుల్కా తినేసిందని ఎద్దును చంపేశాడు’ - ప్రెస్ రివ్యూ

ఎద్దు

ఫొటో సోర్స్, Getty Images

పుల్కా బండిలో నుంచి ఓ పుల్కా లాగి తినేసిందన్న కోపంతో ఆ బండి నిర్వాహకుడు ఇనుప రాడ్డుతో చితకబాదడంతో ఎద్దు అక్కడికక్కడే మరణించిందని 'ఆంధ్రజ్యోతి' కథనం రాసింది.

పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

''పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని డీమార్టు సమీపంలో రాజస్థాన్‌కు చెందిన పుబారామ్‌ పుల్కా బండి వద్దకు రోజూ ఒక ఎద్దు వచ్చి ఆయన పెట్టే పుల్కాలు, ఎవరైనా వదిలేసిన పదార్థాలను తినేది.

రోజులానే ఆదివారం రాత్రి ఆ ఎద్దు అక్కడికి వచ్చి అక్కడున్న దొంతరలో నుంచి ఓ పుల్కాను లాగి తినేసింది.

దీంతో ఆగ్రహించిన పుబారామ్‌ ఇనుపరాడ్డుతో దాని తలపై చితకబాదాడు.

కింద పడిపోయిన ఎద్దు తిరిగి లేవలేదు. స్థానిక వీహెచ్‌పీ నాయకులు దీనిపై ఏలూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎద్దుకు పోస్టుమార్టం అనంతరం, పుబారామ్‌పై జంతువుల రక్షణ చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఆవును చంపాడంటూ తొలుత ప్రచారం సాగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అది ఎద్దు అని పోలీసులు స్పష్టం చేయడంతో పరిస్థితి సద్దుమణిగిందని'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫోన్లో మునిగిపోయిన యువతులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆన్‌లైన్ బానిసలే

కోవిడ్‌-19 మహమ్మారి వల్ల ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా అధికశాతం ప్రజలు స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడ్డారని 'నమస్తే తెలంగాణ' కథనం వెల్లడించింది.

''భారత్‌లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆన్‌లైన్‌లోనే గడుపుతున్నారు. నార్తన్‌ లైఫ్‌ లాక్‌ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సైబర్‌ సేప్టీ సర్వేలో భారత్‌ నుంచి పాల్గొన్నవారిలో 66 శాతం మంది ఈ విషయాన్ని అంగీకరించారు.

పని, చదువు కోసం కాకుండా రోజుకు అదనంగా 4.4 గంటలు ఆన్‌లైన్‌లో గడుపుతున్నామని 82 శాతం మంది అంగీకరించారు.

ఇంట్లో ఉండేవారి ఆన్‌లైన్‌ ప్రవర్తనపై ఈ సర్వే నిర్వహించారు.

ఈ కారణంగా శారీరక ఆరోగ్యం దెబ్బతిన్నదని 74 శాతం మంది, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని 55 శాతం మంది చెప్పారు.

మొత్తంగా 76 శాతం మంది ఆన్‌లైన్‌లో ఉండే సమయాన్ని తగ్గించుకునేందుకు బయటికి వెళ్తున్నామని, స్నేహితులతో సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపినట్లు'' ఈ కథనం తెలిపింది.

తిరుమల

భక్తులకు అందుబాటులోకి శ్రీవారి అగరబత్తీలు: టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) ఆధ్వర్యంలో తయారు చేసిన పరిమళ అగరబత్తీలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపినట్లు 'సాక్షి' కథనం ప్రచురించింది.

''టీటీడీ ఆధ్వర్యంలోని 50 దేవాలయాల్లో స్వామి, అమ్మవార్ల పూజల్లో ఉపయోగించిన పూలతో ఈ అగరబత్తీలను తయారు చేస్తున్నారు.

సోమవారం తిరుపతి ఎస్వీ గోశాలలోని అగరబత్తీల తయారీ కేంద్రాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. లడ్డూ కౌంటర్ల వద్ద 3 కౌంటర్లు, శ్రీవారి ఆలయం ఎదురుగా పుస్తకాల విక్రయాల వద్ద ఓ అగరబత్తీల కొనుగోలు కౌంటర్‌ను టీటీడీ ప్రారంభించింది. మొదటి రోజు అగరబత్తీలను భక్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.

'అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకష్టి, స్పష్టి, తుష్టి, దష్టి పేర్లతో కూడిన ఏడు రకాల అగరబత్తీలను భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. కెమికల్స్‌ లేకుండా పరిమళభరితంగా వీటిని తయారు చేస్తున్నారు. సప్తగిరి మాసపత్రికను కూడా తిరిగి ప్రారంభించాం' అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

నాలుగు రోజుల నుంచి రోజుకు రెండు వేల సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. త్వరలోనే వీటి సంఖ్య పెంచే అంశంపై అధికారులతో చర్చించనున్నట్టు సుబ్బారెడ్డి తెలిపారని'' కథనంలో పేర్కొన్నారు.

వినాయక నిమజ్జనం

ఫొటో సోర్స్, Getty Images

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు నో.. తీర్పు మార్చని హైకోర్టు

వినాయక నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించినట్లు 'వెలుగు' పేర్కొంది.

''జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ పై ఏసీజే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌‌ల ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది.

పరిస్థితులను అర్థం చేసుకుని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. కానీ పరిస్థితులన్నీ సర్కారు సృష్టించుకున్నవేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని.. కోర్టులది కాదని స్పష్టం చేసింది.

నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. జలాశయాలను కలుషితం చేసేందుకు అనుమతి ఇవ్వాలా అంటూ మండిపడింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపింది.

అయితే చట్టాలను ఉల్లంఘించాలా, అమలు చేయాలా అనేది ప్రభుత్వ ఇష్టమని పేర్కొంది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జసనం చేయొద్దని గతంలో తాము ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసినట్లు'' వెలుగు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)