శింగనమల పూజారి మరణం: భక్తులు పోసిన చమురే ప్రాణం తీసిందా?: ప్రెస్ రివ్యూ

గంప మల్లయ్య

ఫొటో సోర్స్, UGC

గంపమల్లయ్య కొండపై గరుడ స్తంభం తీసుకుని కిందికి దిగే సమయంలో కొండ రాళ్లు జారి పూజారి పాపయ్య చనిపోయారని సాక్షి దినపత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది.

అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాలపురం సమీపంలో ఏడుకొండల మధ్య గంపమల్లయ్య కొండ ఉంది.

దీనిపైకి 11 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఏటా శ్రావణమాసంలో నాలుగు శనివారాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

కొండపై ఉత్సవ విగ్రహాలకు శనివారం ఆనందరావుపేటకు చెందిన పూజారి అప్పా పాపయ్య (55) శ్రావణమాస పూజలు నిర్వహించారని సాక్షి రాసింది.

అక్కడి నుంచి 20 అడుగుల కింద గుహలో గంప మల్లయ్య స్వామికి పూజ చేయడానికి సిద్ధమయ్యారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తుండగా.. గుహలోకి వెళ్లడానికి ఐదు అడుగుల వరకు దిగారు.

తర్వాత కాలు జారడంతో 300 అడుగుల ఎత్తు పై నుంచి కింద పడి దుర్మరణం చెందారు. పాపయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

గంప మల్లయ్య కొండపై పూజ ప్రమాదమని తెలిసినా అప్పా కుటుంబీకులు సాహసం చేస్తున్నారని సాక్షి రాసింది.

భక్తులు తీసుకొచ్చిన చమురును గరుడ స్తంభంలోకి పోస్తారు. దాన్ని తీసుకుని పూజారి కిందకు దిగే క్రమంలో చమురు కారి రాళ్లపై పడుతూ ఉంటుంది.

దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అయినప్పటికీ పూజారిని గంప మల్లయ్య స్వామి ఆవహిస్తారన్న నమ్మకంతో దిగుతుంటారని తెలిపింది.

వారి వంశంలో ఐదు తరాల క్రితం కూడా ఇలాగే జారి పడి పూజారి ఒకరు మృతి చెందినట్లు భక్తులు తెలిపారని సాక్షి వివరించింది.

నర్సుపై చర్యలు

ఫొటో సోర్స్, UGC

పాటకు డాన్స్ వేసిన నర్సుపై చర్యలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాటకు డాన్స్ చేసిన ఒక నర్సుపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

'బుల్లెట్‌ బండెక్కి వచ్చేస్తపా' అన్న జానపద గీతం గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మంచిర్యాల జిల్లాలో సాయి శ్రేయ అనే నవవధువు ఈ పాటకు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో చాలామంది మహిళలు ఈ పాటకు నృత్యం చేస్తూ వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌ నర్సుగా చేస్తున్న రజని కూడా అదే పాటకు డ్యాన్స్‌ చేసిందని పత్రిక రాసింది.

పంద్రాగస్టు వేడుకల నాడు ప్రభుత్వాసుపత్రిలో ఆమె చేసిన నృత్యాన్ని, ఆమె స్నేహితులు షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌ అయి అధికారుల వరకూ చేరింది.

దీంతో నర్సు సరదాకి చేసిన నృత్యం కాస్తా ఆమె కొలువుకే ఎసరు పెట్టిందని పత్రిక చెప్పింది.

ఆ వీడియోపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రజనికి మెమో జారీ చేశారు. అందుకు సంబంధించిన నివేదికను వారు కలెక్టర్‌కు అందించినట్లు తమకు తెలిసిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

వైఎస్‌ వివేకానందరెడ్డి

ఫొటో సోర్స్, YSRCongress

వివేకానంద రెడ్డి హత్య సమాచారం ఇస్తే రూ.5 లక్షల బహుమతి-సీబీఐ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సమాచారం ఇస్తే 5 లక్షల బహుమతి ఇస్తామని సీబీఐ ప్రకటన ఇచ్చిందని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ అధికారులు శనివారం ఇచ్చిన పత్రికా ప్రకటన ఏపీలో చర్చనీయాంశమైంది.

ఈ కేసుకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల బహుమానం ఇస్తామని సీబీఐ ప్రకటించింది. సమాచారం అందించినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చిందని పత్రిక రాసింది.

సమాచారం ఇవ్వాలనుకునే వారు కేసు పరిశోధన అధికారి డీఎస్పీ దీపక్‌ గౌర్‌, పర్యవేక్షణ అధికారి ఎస్పీ రామ్‌సింగ్‌ను ఫోన్‌ ద్వారా లేక కార్యాలయంలో సంప్రదించాలని కోరింది.

వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు శనివారం వివేకా కార్యాలయంలో కంప్యూటరు ఆపరేటర్‌గా పని చేసే ఇనయతుల్లా, అనంతపురం జిల్లాకు చెందిన విజయ్‌శంకర్‌రెడ్డిని విచారించారని ఈనాడు రాసింది.

వాచ్‌మన్‌ రంగన్న, పులివెందుల పురపాలక పారిశుద్ధ్య కార్మికుడు గంగులయ్యను ప్రశ్నించారు. ఈ కేసులో జమ్మలమడుగు కోర్టు జడ్జికి రంగన్న వాంగ్మూలం సమర్పించిన తర్వాత... ఆయన ఇంటివద్ద ఇద్దరు పోలీసులతో భద్రత కల్పించారు.

శనివారం వారి భద్రతతోనే రంగన్న విచారణకు హాజరయ్యారు. వేంపల్లెకు చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు, ఆల్‌అమీన్‌ సొసైటీ అధ్యక్షుడు డా.ఎస్‌.ఎఫ్‌.బాషాను కూడా విచారించారని ఈనాడు రాసింది.

కలవ అక్కచెల్లెళ్లకు కవల పిల్లలు

ఫొటో సోర్స్, iStock

కవల అక్కచెల్లెళ్లకు మళ్లీ కవల పిల్లలు

కరీంనగర్‌లో నెలల తేడాతో ప్రసవించిన కవల అక్కచెల్లెళ్లకు కవలలు పుట్టారని నమస్తే తెలంగాణ పత్రిక ఒక వార్త ప్రచురించింది.

వారిద్దరూ కవల అక్కాచెల్లెళ్లు. చిన్ననాటి నుంచి ఒకే తరహాలో పెరిగిన వారిద్దరు.. వివాహాలయ్యాక కవల పిల్లలకు జన్మనిచ్చారు.

మూడు నెలల కింద చెల్లెలు ముగ్గురికి (ట్రిపులెట్స్‌) జన్మనిస్తే, శనివారం అక్క నలుగురు శిశువుల (క్వాడ్రుప్లెట్స్‌)కు జన్మనిచ్చిన అరుదైన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకున్నది.

కవలలైన తమ బిడ్డలు మళ్లీ కవలలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన పబ్బ శ్రీలత, శ్రీనివాస్‌ దంపతులకు ఇద్దరు కవల ఆడ పిల్లలు జన్మించారు.

పెద్ద పాపకు నిఖిత, చిన్న పాపకు లిఖిత అని పేర్లు పెట్టారు. నిఖితను కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాలకు చెందిన సాయికిరణ్‌కు, లిఖితను రామడుగు మండలం వెలిచాలకు చెందిన రాకేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు.

మూడు నెలల కిందట కరీంనగర్‌లోని ఒక దవాఖానలో లిఖిత ఒకే కాన్పులో ఇద్దరు మగ, ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చింది.

తాజాగా శనివారం నిఖిత కూడా ఇద్దరు మగ, ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. అక్కచెల్లెళ్ల పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్‌ ఆకుల శైలజ తెలిపారు.

ఏడెనిమిది లక్షల్లో ఒకరిద్దరికి జన్యు ప్రభావంతో ఇలాంటి అరుదైన జననాలు జరుగుతాయని చెప్పారు.

తమ ఇద్దరు కవల పిల్లల్లో ఒకరికి ముగ్గురు, మరొకరికి నలుగురు పిల్లలు జన్మించడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయిందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)