కోవిడ్: భారత్‌లో మూడో వేవ్ ముప్పు భయంతో ఊపందుకున్న వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ తన వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేస్తోంది.
మంగళవారం ఒక్కరోజే దేశంలో 88.1 లక్షల టీకాలు వేశారు. ఈ ఏడాది జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత పెద్దసంఖ్యలో వ్యాక్సీన్లు వేయడం ఇదే తొలిసారని ప్రభుత్వం చెబుతోంది.
తాజాగా భారత ఔషధ నియంత్రణ సంస్థ ప్రపంచంలోనే మొదటిదైన కోవిడ్ డీఎన్ఏ వ్యాక్సీన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది.
ఈ టీకాను క్యాడిలా హెల్త్ కేర్ సంస్థ అభివృద్ధి చేసింది. మూడు సార్లు తీసుకోవలసిన ఈ ZyCoV-D అనే వ్యాక్సీన్ ప్రాథమిక పరీక్షలలో 66% మందికి లక్షణాలతో కూడిన కోవిడ్ రాకుండా నివారించగలిగింది. పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సీన్ డోసులను ఏటా 12 కోట్లు ఉత్పత్తి చేయాలని క్యాడిలా భావిస్తోంది. గతంలోని డీఎన్ఏ వ్యాక్సీన్లు జంతువుల మీద పని చేశాయి కానీ మనుషుల మీద కాదు.
ఇప్పటివరకు భారతదేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి డోసులు 57 కోట్లకు పైగా ఇచ్చారు. అయితే, వ్యాక్సినేషన్ కోసం నిర్దేశించిన అర్హత వయసు పరిధిలో ఉన్న దేశ జనాభాలో 13 శాతం మందికి మాత్రమే పూర్తిగా రెండు డోసుల వ్యాక్సీన్ అందింది.
ఇంతవరకు సుమారు 3.2 కోట్ల కోవిడ్ కేసులు నమోదైన భారత్ ప్రపంచంలోనే ఈ వైరస్ కేసులు అత్యధికంగా నమోదైన రెండో దేశం.
అలాగే 4 లక్షలకు పైగా మరణాలు నమోదైన దేశాల్లో మూడోది. భారత్ కంటే ఎక్కువగా బ్రెజిల్, అమెరికాల్లోనే కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
ఈ ఏడాది చివరి నాటికి భారతీయులందరికీ వ్యాక్సీన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వ్యాక్సీన్ల కొరత, దానికితోడు చాలామంది టీకా వేయించుకోవడానికి ముందుకురాకపోవడం వల్ల లక్ష్యం చేరుకోవడం అంత సులువు కాదు.
ప్రస్తుతం భారత్ రోజుకు సగటున 50 లక్షల మందికి టీకాలు వేస్తోంది. కానీ, 2021 చివరి నాటికి అర్హులైన అందరికీ వ్యాక్సీన్ వేయాలంటే రోజుకు 80 లక్షల నుంచి 90 లక్షల మందికి వేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
2021 జనవరి 16 నుంచి ఇప్పటివరకు భారత్ 56.5 కోట్ల డోసుల వ్యాక్సీన్ వేసింది. 44 కోట్ల మంది మొదటి డోస్ వేయించుకోగా 12.5 కోట్ల మంది రెండు డోసులు వేయించుకున్నారు.
గురువారం(19.08.2021) భారత్‌లో కొత్తగా 36,400 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న మే నెలలో కేస్ లోడ్‌తో పోల్చితే ఇది అందులో 10 శాతమే. కానీ, వైద్యులు మాత్రం మూడో వేవ్ తప్పనిసరిగా వస్తుందని హెచ్చరిస్తున్నారు.
కొత్త వేరియంట్లు ఉద్భవిస్తుండడం, దేశమంతా అన్‌లాక్‌లో ఉండడంతో మూడో వేవ్ ముప్పు ఉందని వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం వ్యాక్సినేషన్ వేగవంతమవుతుండగా నిపుణులు మాత్రం మహిళలకు వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం పురుషులతో పోల్చితే వ్యాక్సిన్ వేయించుకున్న మహిళల సంఖ్య 6 శాతం తక్కువగా ఉంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళల్లో వ్యాక్సీన్ వేయించుకుంటున్నవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం, టీకా వేయించుకోవడానికి వెనుకాడడం వంటివి దీనికి కారణాలుగా గుర్తించారు.
మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో రోజూ పెద్దసంఖ్యలోనే వ్యాక్సీన్ వేస్తున్నప్పటికీ పట్టణ ప్రాంతాలలో వ్యాక్సీన్ వేయించుకుంటున్నవారి సంఖ్యతో పోల్చితే ఇది తక్కువే.

ఫొటో సోర్స్, Getty Images
ఆగస్ట్, డిసెంబర్ నెలల మధ్య 135 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని జూన్‌లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది.
దేశంలో అర్హులందరికీ పూర్తిగా టీకాలు వేయాలంటే 180 కోట్ల డోసులు అవసరం.
సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం ఏఏ కంపెనీల వ్యాక్సీన్లు ఎన్ని అందుబాటులోకి వస్తాయో కూడా తెలిపింది.
దాని ప్రకారం..
* కోవిషీల్డ్ - 50 కోట్ల డోసులు
* కోవాగ్జిన్ - 40 కోట్ల డోసులు
* 'బయలాజికల్ ఈ' సంస్థ వ్యాక్సీన్ - 30 కోట్ల డోసులు
* స్పుత్నిక్-వి - 10 కోట్లు
* జైకోవ్.డి - 5 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియాలో వినియోగిస్తున్న వ్యాక్సీన్లు ఏవి?
భారత్‌లో ప్రస్తుతం మూడు వ్యాక్సీన్లు వినియోగిస్తున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి వ్యాక్సీన్లు ప్రస్తుతం భారత్‌లో వేస్తున్నారు.
మోడెర్నా వ్యాక్సీన్ దిగుమతి చేసుకోవడానికి సిప్లా కంపెనీకి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అయితే, ఇవి ఎన్ని డోసులు భారత్‌లో అందుబాటులోకి వస్తాయన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.
మరికొన్ని వ్యాక్సీన్లు కూడా వివిధ అనుమతుల దశల్లో ఉన్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్‌లలో వ్యాక్సీన్లను ఉచితంగా వేస్తున్నారు. ప్రయివేటు ఆసుపత్రులలో వేయించుకోవాలనుకునేవారు నిర్ణీత ధర చెల్లించి వేయించుకోవచ్చు.

ఫొటో సోర్స్, AFP
కోవిడ్ వ్యాక్సీన్లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
వ్యాక్సీన్లు(కోవిడ్ ఒక్కటే కాదు అన్ని రకాల టీకాలు) వేయించుకున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ పర్యవేక్షించడానికి భారత్‌లో సర్వేలెన్స్ ప్రోగ్రాం ఉంది. 34 ఏళ్లుగా ఇది అమలులో ఉంది.
ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ తరువాత 23,000 మందిలో కొన్ని దుష్ఫలితాలు కనిపించినట్లు మే 17 వరకు ఉన్న గణాంకాలు చెబుతున్నాయి.
అందులో చాలామందికి తలతిప్పడం, మగతగా ఉండడం, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలు కనిపించాయి.
ఈ సర్వేలెన్స్ ప్రోగ్రాం గణాంకాల ప్రకారం జూన్ వరకు 488 మంది వ్యాక్సినేషన్ తరువాత ప్రాణాలు కోల్పోయారు. అయితే, అవన్నీ వ్యాక్సీన్ కారణంగా చోటుచేసుకున్న మరణాలు కావని ప్రభుత్వం చెబుతోంది.
వ్యాక్సీన్ వేసుకోకపోవడం వల్ల కోవిడ్‌తో మరణించే ముప్పు కంటే వ్యాక్సినేషన్ తరువాత మరణించే ముప్పు చాలా తక్కువని ప్రభుత్వం చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: ‘తాలిబాన్లు చూస్తే నన్ను అక్కడికక్కడే చంపేస్తారు, చాలా భయమేస్తోంది’ - బీబీసీతో కాబుల్ మహిళ
- ‘వారు నన్ను దెయ్యం అనుకున్నారు’
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- ‘వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్‌వేపైనే ఎందుకు ముక్కలు చేశారు
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








