కోవిడ్‌-19 నుంచి కోలుకున్న వారిలో జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తుతున్నాయా?

కోవిడ్ ప్రభావంతో జ్ఞాపకశక్తి తగ్గుతుందా

ఫొటో సోర్స్, Sean Gladwell/Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్ బారిన పడిన తర్వాత ఐసోలేషన్, చికిత్స పూర్తయి, నెగటివ్ రిపోర్ట్ రావడంతోనే కష్టాలు తీరటం లేదు.

కోవిడ్ జయించాం అని చెప్పుకున్న తర్వాత కూడా అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో జ్ఞాపకశక్తి, గ్రహణ శక్తి తగ్గిపోవడం లాంటి లక్షణాలు కూడా ఉంటున్నాయి.

కోవిడ్-19 వైరస్ మానసిక సామర్ధ్యంపై కూడా ప్రభావం చూపిస్తోందని లండన్ ఇంపీరియల్ కాలేజీ 80 వేల మందిపై చేసిన పరిశోధనలో తేలింది.

అయితే, ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని అధ్యయనవేత్తలు తెలిపారు.

కోవిడ్-19 మానసిక సామర్ధ్యంపై చూపే ప్రభావాన్ని అంచనా వేసేందుకు వరుసగా నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షల్లో తీవ్రంగా కోవిడ్ బారిన పడిన వారు తక్కువ స్కోర్ సంపాదించారు.

వారి తార్కిక శక్తి, సమస్యలను పరిష్కరించే జ్ఞానంపై కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది.

డాక్టర్ హ్యాంప్ షైర్ బీబీసీ 2 'హరైజన్స్ గ్రేట్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ టెస్ట్' కోసం రూపొందించిన ఆన్ లైన్ పరీక్షను ఈ అధ్యయనం కోసం ఉపయోగించారు.

"బొమ్మల కథలు కూడా చదవలేకపోతున్నాను"

59 ఏళ్ల భాస్కర్ (పేరు మార్చాం) డిసెంబరు 2020లో కోవిడ్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సుమారు 50 రోజులు ఆసుపత్రిలోనే ఉన్న ఆయన వెంటిలేటర్‌పై కూడా చికిత్స తీసుకున్నారు.

భాస్కర్ కోవిడ్ నుంచి కోలుకుని 6 నెలలవుతోంది. కానీ ఆయన పూర్తిగా సాధారణ స్థితికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయనకు జ్ఞాపక శక్తికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో, ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు.

జ్ఞాపకశక్తి

ఫొటో సోర్స్, Getty Images

భాస్కర్ ఒక ప్రముఖ పత్రికలో ఫోటో జర్నలిస్ట్ గా పని చేసేవారు.

జ్ఞాపకశక్తిపై కోవిడ్ వల్ల కలిగిన ప్రభావం గురించి బీబీసీ ఆయనతో మాట్లాడింది.

"పొద్దున లేవగానే వార్తలు, సాహిత్యంలో మునిగి తేలిన నేను ఇప్పుడు ఒక్క పేరా కూడా చదవలేకపోతున్నా. పదాల్లో ఒక్కో అక్షరం కూడబలుక్కుని చదవాల్సి వస్తోంది. చదివాక అవి గుర్తు పెట్టుకోవడం మరింత కష్టంగా ఉంటోంది" అని ఆయన తన ఇబ్బందిని వివరించారు.

"సులభమైన బొమ్మల కథలు కూడా చదవలేకపోతున్నాను. టీవీలో చూసిన విషయాలు మాత్రం కాసేపు గుర్తుంటున్నాయి" అని చెప్పారు.

చిన్నప్పటి విషయాలన్నీ గుర్తున్నాయని చెప్పిన బాస్కర్, ఇటీవల కాలంలో జరిగిన విషయాలు మాత్రం గుర్తుకు తెచ్చుకోలేక సతమతం అవుతున్నారు.

"సినిమా పాటలు గుర్తుకు వస్తున్నాయి, కానీ, పుస్తకాల పేర్లు, ఊరి పేర్లు గుర్తు రావడం లేదు. ఎవరైనా చెప్పిన విషయాలు అప్పటికప్పుడు అర్ధమవుతున్నా, తర్వాత గుర్తుండడం లేదు" అన్నారు.

ఆయనను మీ అమ్మాయి ఏ ఊర్లో ఉంటోంది అని అడిగినప్పుడు, పక్కనే ఉన్న కుటుంబ సభ్యుల సాయం తీసుకుని సాయంతో ఆయన సమాధానం చెప్పగలిగారు.

భాస్కర్ ఒక సారి చెప్పిన విషయాన్నే 5 నిమిషాల వ్యవధిలో మళ్ళీ చెప్పడం, అడిగిన ప్రశ్ననే మళ్ళీ మళ్ళీ అడగడం నేను గమనించాను.

ఉదాహరణకు, నా పేరు, ఊరు చెప్పి ఒక అయిదు నిమిషాలు మాట్లాడిన తర్వాత, “మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు?” అని ఆయన నన్ను అడిగారు.

కృత్రిమ వెంటిలేషన్ మీద ఉన్న రోగుల గ్రహణ శక్తిపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని లండన్ ఇంపీరియల్ కాలేజీ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది.

ఈ అధ్యయనాన్ని కింగ్స్ కాలేజీ లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించాయి.

శరీరంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, శరీరంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

వైద్య పరిభాషలో ఈ స్థితిని ఎలా పరిగణిస్తారు?

ఏదైనా విషయాన్ని అప్పటికప్పుడే మర్చిపోవడాన్ని జ్ఞాపక శక్తి తగ్గిపోవడంలో మొదటి దశగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరోగ్యనాథుడు బీబీసీకి వివరించారు.

ఇలాంటి కేసుల్లో తమ జ్ఞాపకశక్తి తగ్గిపోతున్న విషయం రోగి తెలుసుకోలేరని చెప్పారు.

"రెండో దశలో, పొద్దున చేసిన టిఫిన్, మధ్యాహ్నం తిన్న ఆహార పదార్ధాల గురించి మర్చిపోవడం జరుగుతుంది. మూడో దశలో, చిన్ననాటి విషయాలన్నీ పూర్తిగా మర్చిపోతారు. డెమెన్షియాలో కూడా ఇలాంటి దశలే ఉంటాయి" అని ఆయన వివరించారు.

కోవిడ్ తీవ్రత కంటే, శరీరంలో ఆ ఇన్ఫెక్షన్ ఎంతకాలం ఉంది అనేది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలిందని ఆరోగ్య నాథుడు వివరించారు.

"కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రభావం నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం శరీరంలో ఉంటే, ఆ ప్రభావం మానసిక సామర్ధ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, అలాంటి కేసులను నేను నేరుగా చూడలేదు" అని ఆయన చెప్పారు.

మెదడుకి ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు, శరీరం పూర్తిగా ఇన్ఫెక్ట్ అయినా, బీపీ తగ్గిపోయినా మెదడు దెబ్బ తినే అవకాశాలు ఉంటాయని డాక్టర్ వివరించారు.

జ్ఞాపకశక్తి

ఈ కేసులు డాక్టర్ల దృష్టికి వచ్చాయా?

కోవిడ్ సోకిన ప్రతీ ఒక్కరి మానసిక సామర్ధ్యం పై ప్రభావం ఉండకపోవచ్చు గానీ, ఎంతో కొంత మోతాదులో అయితే, ఆలోచనా శక్తి పై ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు అంటున్నారు.

కోవిడ్ బారిన పడిన కొన్ని వారాల తర్వాత పక్షవాతానికి గురవడం, లేదా మాట పడిపోవడం లాంటి కేసులు తమ దృష్టికి వచ్చినట్లు కాకినాడకు చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ బీబీసీకి చెప్పారు.

కోవిడ్ తర్వాత శరీరంలో ఇన్ఫలమేషన్ వ్యవస్థీకృతమవ్వడం వల్ల, రక్తం గడ్డ కట్టేందుకు ప్రేరేపిస్తోంది. ఈ ప్రభావం ముందు ఊపిరితిత్తుల పై, తర్వాత గుండె, మెదడు పై ప్రభావం చూపిస్తోందని తెలిపారు.

ఒక్కొక్కసారి వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా కొంత మందిలో మెదడు మొద్దుబారిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. దానినే 'మెంటల్ ఫాగ్' అని అంటున్నారని అన్నారు.

ఏకాగ్రత లేకపోవడం వల్ల కూడా విషయ గ్రహణ ఉండదు కానీ, దానిని పూర్తిగా జ్ఞాపకశక్తి కోల్పోవడం కింద పరిగణించలేమని ఆరోగ్యనాథుడు అన్నారు. రోగులు గనక జ్ఞాపక శక్తి కోల్పోతున్నామనే విషయాన్ని డాక్టర్ కి వివరించగల్గితే, దానిని ఫాల్స్ మెమరీ లాస్ అని అంటారని డాక్టర్ ఆరోగ్యనాథుడు తెలిపారు.

అయితే, ప్రత్యేకంగా జ్ఞాపకశక్తి కోల్పోయిన కేసులు తమ దృష్టికి రాలేదని, కాకినాడకు చెందిన ప్రైవేట్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ గోపీకృష్ణ చెప్పారు.

భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి, కంగారు, మూడ్ స్వింగ్స్ లాంటి సమస్యలతో ఎక్కువ మంది తమను సంప్రదించినట్లు చెప్పారు.

జ్ఞాపకశక్తి

ఫొటో సోర్స్, Getty Images

ఈ సమస్యకు చికిత్స ఏంటి?

ఇలాంటి సమస్యలకు మందుల కంటే కూడా యోగా, ప్రాణాయామంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు సూచించినట్లు డాక్టర్ గోపీకృష్ణ చెప్పారు. వాటిపై భారతదేశంలో ప్రత్యేకంగా అధ్యయనాలు జరగలేదని చెప్పారు.

కానీ, రక్తంలో గడ్డలు ఏర్పడితే వాటిని కరిగించడానికి మందులు తప్పనిసరిగా వాడాలి అని గోపీ కృష్ణ చెబుతున్నారు.

సాధారణంగా రోగులకు మెదడుకు వ్యాయామం కలిగించే పదబంధాలను పూరించడం, రూబిక్ లాంటి వాటితో ఆడటం లాంటివి మెదడుకు పనిచెప్పే యాక్టివిటీస్ సూచిస్తుంటామని ఆయన చెప్పారు.

కోవిడ్-19 మానసిక సామర్ధ్యంపై ప్రభావం చూపిస్తే, దానికి ఎలాంటి చికిత్స అందించాలనే విషయంలో ఇప్పటివరకూ పూర్తి గైడ్ లైన్స్ లేవని ఆరోగ్యనాథుడు తెలిపారు.

సులభమైన వాటిని చదవడం, కుటుంబ సభ్యులు కొన్ని విషయాలను గుర్తు చేస్తూ ఉండటం, పజిల్స్ నింపడం లాంటివి చేయవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడవచ్చని ఆరోగ్యనాథుడు సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)