ఎర్రబెల్లి దయాకర రావు: మహిళా ఎంపీడీవోతో వివాదాస్పద వ్యాఖ్యలు, మంత్రి అలా మాట్లాడొచ్చా అని విమర్శలు

ఫొటో సోర్స్, ErrabelliDayakarRao/FB
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓ మహిళా ఎంపీడీవో విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
మంత్రి తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో ఆయన ఈ వివాదంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించి చూపారని ఆరోపించారు.

ఫొటో సోర్స్, UGC
ఇంతకీ ఎర్రబెల్లి దయాకరరావు ఏమన్నారు?
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో శుక్రవారం పల్లె ప్రగతి గ్రామ సభ నిర్వహించారు.
మంత్రితో పాటు అధికారులు ఆ సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సభలో మాట్లాడుతూ, ''ఎంపీడీవో గారూ! ఉన్నాడానయా'' అన్నారు. ఆయనలా అనగానే ''మేడమ్.. మేడమ్'' అంటూ సర్ కాదు మహిళా అధికారి అన్న అర్థంలో అక్కడున్న మిగతా నాయకులు ఆయనకు మాట అందించారు.
ఆ వెంటనే ఎర్రబెల్లి, ''మేడమ్.. నువ్వయితే బాగనే ఊపుతున్నవు కానీ ఈడ ఊపుత లేవు. బాగనే పనిచేస్తది. ఇవన్నీ పార్కులు మంచిగ తయారుచేయాలె'' అన్నారు.
ఆయన అలా అనగానే వేదికపై ఉన్న ఇతర నాయకులు, ఎర్రబెల్లి అనుచరులు పకపకా నవ్వారు.
ఎర్రబెల్లి ఆ వ్యాఖ్యలు చేసేటప్పటికి ఆయన వెనుక వరుసలోనే ఇతర అధికారులతో పాటు కూర్చున్న ఆ మహిళా అధికారి లేచి నుంచుని అలా మౌనంగా ఉండిపోయారు.

ఫొటో సోర్స్, Dasoju Sravan Kumar
ఎర్రబెల్లిపై క్రిమినల్ కేసు పెట్టాలి: దాసోజు శ్రవణ్ కుమార్
మహిళా అధికారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి దయాకరరావుపై క్రిమినల్ కేసులు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తెలంగాణ నేత దాసోజ్ శ్రవణ్ కుమార్ బీబీసీతో అన్నారు.
''ఎర్రబెల్లి ఆ అధికారిణి విషయంలో సభ్యత సంస్కారం లేకుండా, అనుచితంగా, క్రూరంగా మాట్లాడారు.. ఇదంతా లైంగిక వేధింపుల కిందకు వస్తాయి. ఐపీసీ 354ఏ, 509 కింద ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలి'' అని శ్రవణ్ కుమార్ అన్నారు. తక్షణం ఎర్రబెల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
''మంత్రులు, ఆదర్శంగా ఉండాలి. ఇలా బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా? గతంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టరుపై అనుచితంగా మాట్లాడారు. ఆయనపై చర్యలు లేవు. జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా అంతే, ఆయనపైనా చర్యలు లేవు. అందుకే ఇప్పుడు దయాకర్ రావు కూడా ఇలా భయం లేకుండా మాట్లాడుతున్నారు. ఎర్రబెల్లి గతంలోనూ ఓ కలెక్టరును కుర్చీలు తెమ్మన్నారు. పాలకులలో అధికార దర్పం ఎక్కువైపోతుంది. ఇది మంచిది కాదు. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు స్పందించడం లేదో మరి'' అన్నారాయన.
''కేసీఆర్ పాలనలో మహిళల పాత్ర చాలా తక్కువ చేస్తున్నారు. ఆయన తొలిసారి సీఎం అయినప్పుడు మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. విమర్శలు రావడంతో రెండోసారి సీఎం అయ్యాక మంత్రివర్గంలో మహిళను తీసుకున్నారు. అలాగే మహిళా కమిషన్‌ను కూడా చాలా కాలం ఖాళీగా ఉంచారు. మహిళల విషయంలో ఆయన ఎంత చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారో ఆయన మంత్రులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు'' అన్నారు శ్రవణ్ కుమార్.
మహిళలంటే అంత చులకనా: కొండవీటి సత్యవతి
ఎర్రబెల్లి వ్యాఖ్యలను సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై సోషల్ యాక్టివిస్ట్ కొండవీటి సత్యవతి 'బీబీసీ'తో మాట్లాడారు. మంత్రే కాదు ఎవరైనా సరే తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళల పట్ల చులకనగా, అనుచితంగా మాట్లాడడం తప్పని ఆమె అన్నారు.
'ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్‌మెంట్ ఎట్ వర్క్‌ప్లేస్' చట్టం ప్రకారం ఎర్రబెల్లి నేరస్తుడు. ఆ ఎంపీడీవో ఈ చట్టం ప్రకారం ఎర్రబెల్లిపై కేసు పెట్టవచ్చు" అని అన్నారు.
''అక్కడ మంత్రి అలా మాట్లాడడం, చుట్టూ ఉన్నవారు నవ్వడం ఏమాత్రం సరికాదు. ఆయన భాష, మాట్లాడే పద్ధతి కరెక్టు కాదు. మంత్రయినా, రాజకీయ నేతయినా, ఇంకెవరైనా సరే అలా మాట్లాడే అర్హత లేదు. జెండర్ ఇన్‌సెన్సిటివిటీ సహించరానిది. ఆమె తనకు కూతురువంటిది అని చెబుతున్నారు మంత్రి. కానీ, పనిచేసే చోట ఉద్యోగిని కూతురు ఎలా అవుతుంది, ఇంట్లో అయినా తండ్రి అలా అంటారా? మంత్రి చాలా తేలిగ్గా అలాంటి వ్యాఖ్యలు చేయడం, దానికి అక్కడున్నవారంతా వెకిలిగా నవ్వడంలో పురుషాధిక్యం కనిపించిది. బహిరంగంగా ఒక అధికారిణి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిగతావారికీ ఆమె పట్ల గౌరవం తగ్గుతుంది'' అని సత్యవతి అన్నారు.

కమలాపూర్‌లో నిరసనలు
మహిళా ఎంపీడీవోను అవమానపరిచేలా ఎర్రబెల్లి మాట్లాడడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఎర్రబెల్లి వ్యాఖ్యలకు నిరసనగా కమలాపూర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట స్థానిక యువత కొందరు నిరసన తెలిపారు.
మహిళా అధికారిణి విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి దయాకరరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒక మంత్రిగా ఉంటూ మహిళా ఎంపీడీవోతో ఇలా మాట్లాడడం సిగ్గుచేటంటూ ఆగ్రహించారు.
‘ఎక్కడిదీ సంస్కృతి?’: ఎం.సునీత
'అన్వేషి రీసెర్చి సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్' కోఆర్డినేటర్ ఎ.సునీత 'బీబీసీ'తో మాట్లాడుతూ ఎర్రబెల్లి వ్యాఖ్యలను ఖండించారు.
''2013లో వచ్చిన లైంగిక వేధింపుల చట్టం ప్రకారం మంత్రి దయాకరరావు అలా మాట్లాడడం నేరం. అధికార దర్పంతో ఇలాంటి అనుచితంగా మాట్లాడడమనే సంస్కృతి పెరిగిపోతోంది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రి ఇలా చట్టం తెలియకుండా, మర్యాద మరిచి మాట్లాడడం సరికాదు. ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ ఇది తప్పే. కూతురితో అయితే అలా మాట్లాడుతారా ఎవరైనా?" అని సునీత ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, dayakar rao errabelli
నేనలా అనలేదు.. కూతురిలా భావించా: ఎర్రబెల్లి
తాను ఆ మహిళ ఉద్యోగిని ఎక్కడ వివాదాస్పదంగా మాట్లాడలేదని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
''మీటింగ్ ప్రారంభయ్యే ముందు మైక్‌లో ఏం కూతురా బాగున్నవా అని పలకరించాను. నాకు ఆమె బాగా తెలిసిన వ్యక్తి. వరంగల్ జిల్లా దుగ్గొండి లో ఎంపీడీవో విధులు నిర్వర్తించారు. అప్పటి నుంచే నాకు పరిచయం.
అక్కడ ఉరికించావు.. ఇక్కడ ఎందుకు ఉరికించట్లేదు అని అడిగాను.
ఇవేవీ రాకుండా కేవలం అక్కడ బాగానే ఊపుతున్నావ్ ఇక్కడ ఊపు అనే వ్యాఖ్యలు వైరల్ చేస్తున్నారు ఇది మంచిది కాదు. నా కూతురు వరుస తోనే అన్నాను ఆమె కూడా ఫీల్ కాలేదు. నేను మాట్లాడిన వాటిలో కొన్నింటినే ప్రచారం చేస్తున్నారు'' అన్నారు ఎర్రబెల్లి.
ఆయన అనుచరులు జిల్లాలో దీనిపై వివరణ ఇస్తూ ఒక వీడియా విడుదల చేశారు. అందులో వారు, "ఊపడం అంటే తెలంగాణ భాషలో అత్యున్నత పదం. చాలా మంచి పదం. ఎవరైనా ఎక్స్‌ట్రాడినరీగా పని చేస్తే వాళ్లను ఊపిండ్రు అని అంటం. అంత మంచి మాటను వక్రీకరించారు" అని వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









