Yaas: తీరం దాటిన 'యాస్' తుపాన్.. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీర జిల్లాల్లో కుంభవృష్టి

ఒడిశాలో పారాదీప్ సమీపంలో రాజ్‌నగర్-గుప్తి మెయిన్ రోడ్‌లో కూలిన చెట్లను తొలగిస్తున్న సిబ్బంది

ఫొటో సోర్స్, odisha govt

ఫొటో క్యాప్షన్, ఒడిశాలో పారాదీప్ సమీపంలో రాజ్‌నగర్-గుప్తి మెయిన్ రోడ్‌లో కూలిన చెట్లను తొలగిస్తున్న సిబ్బంది
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణంగా 20 కిలోమీటర్ల దూరంలో యాస్ తుపాను తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది.

బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బాలాసోర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుపాను 10.30 ప్రాంతంలో తీరాన్ని తాకిందని ఐఎండీ తెలిపింది.

11.30 ప్రాంతంలో తుపాను తీరం దాటింది. తీరం దాటిన తరువాత ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్న తుపాను క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ విభాగా అధికారులు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

‘‘యాస్' తుపాను ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

సముద్రంలో అలలు రెండున్నర మీటర్ల నుంచి అయిదు మీటర్ల వరకు ఎగసిపడే సూచనలున్నాయని.. మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్లరాదని విపత్తులు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.

ఉత్తరాంధ్ర జిల్లాలలోనూ గంటకు 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.

యాస్ తుపాను ధాటికి సముద్రపు అలలు తీవ్రంగా ఎగిసి పడ్డాయి.

ఫొటో సోర్స్, SANJAY DAS

బాలేశ్వర్‌లో కూలిన చెట్టు

ఫొటో సోర్స్, PWD Balasore

కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సమస్య రాకూడదు..

'యాస్' తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్ధితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విశాఖ వెళ్లాలని ఆదేశించారు.

"తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. తుపాను కారణంగా ఆక్సిజన్‌ ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ఆస్పత్రుల నుంచి కోవిడ్‌ రోగుల తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచి వారిని తరలించాలన్న దానిపై వెంటనే నిర్ణయం తీసుకుని, తుపాను ప్రభావం మొదలు కాక ముందే వారిని తరలించాలి. " అని సమావేశంలో అధికారులను ఆదేశించారు.

మరోవైపు తుపాను సన్నద్ధతపై ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిషా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపానుతో ఉత్పన్నమయ్యే పరిస్థితులు.. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అమిత్‌షాకు జగన్‌ తెలిపారు.

పశ్చిమబెంగాల్ తీరంలో బోట్లు

ఫొటో సోర్స్, Getty Images

మత్స్యకారులు వెనక్కి రావాలి...

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.

సముద్రంలో అలలు 2.90 నుంచి 4.5 మీటర్లు ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పారు.

మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే సముద్రంలో వేట చేస్తున్న మత్స్యకారులు వెంటనే తీరానికి రావాలన్నారు.

"ఈ తుపాను ప్రభావం ఒడిశా, బెంగాల్ పై అధికంగా ఉంటుంది. తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 150 నుంచి 160 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి.

మే 25 నుంచి బెంగాల్ లోని కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

ఇదే సమయంలో ఒడిశాలోని కోస్తా జిల్లాలైన బాలేశ్వర్, భద్రక్, జగత్‌సింగ్‌పూర్‌లపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది" గోపాల్‌పూర్‌ డాప్లార్‌ రాడార్‌ కేంద్రం అధికారి ఉమాశంకర్‌ దాస్‌ మీడియాతో చెప్పారు.

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి గర్భిణులను ఆసుపత్రికి తరలిస్తున్న ఆరోగ్య సిబ్బంది

ఫొటో సోర్స్, odisha govt

ఫొటో క్యాప్షన్, ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి గర్భిణులను ఆసుపత్రికి తరలిస్తున్న ఆరోగ్య సిబ్బంది

రంగంలోకి నేవీ, కోస్ట్ గార్డ్...

వాతావరణశాఖ హెచ్చరికలతో తుపాను ప్రభావిత రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తుపాను కారణంగా...ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు.

మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ తెలిపారు.

అవసరమైన సమయాల్లో ప్రజలను తరలించేందుకు 149 బృందాలు, మరో 99 బృందాలు క్షేత్రస్థాయిలో మోహరించామని ప్రధాన్ చెప్పారు.

తుపానును ఎదుర్కొనేందుకు నేవీ, కోస్ట్ గార్డ్ సైతం అప్రమత్తమయ్యాయి. నాలుగు యుద్ధ నౌకలు, 11 సరకు రవాణా విమానాలు, 25 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు నేవీ ప్రకటించింది.

రైలు ప్రయాణికులు

ఫొటో సోర్స్, Getty Images

100 రైళ్లు రద్దు...

ఈ తుపాను తీవ్రతతో ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌, బాలాసోర్‌, భద్రక్‌లలో తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉంది.

ఒడిశాలోని పూరీ, కటక్‌, జైపూర్‌, మయూర్‌బంజ్‌లలో గాలులు గంటకు 120 నుంచి 130 వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు ఒడిశా వాతావరణశాఖ తెలిపింది.

అదే సమయంలో తుపానుక కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైలు సర్వీసులను రద్దు చేసింది.

భువనేశ్వర్- పూరి , పూరి -చెన్నై మధ్య నడిచే 90 రైళ్లను రద్దు చేసింది. మరో 10 రైళ్ళను కూడా రద్దుచేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)