కోవిడ్: భారత్‌లో రానున్న 3 వారాలు అత్యంత కీలకమంటున్న సీసీఎంబీ - ప్రెస్‌రివ్యూ

దేశంలో రానున్న మూడు వారాలు అత్యంత కీలకమని సీసీఎంబీ హెచ్చరించిందని ఈనాడు పత్రిక కథనం ప్రచురించింది.
‘‘కోవిడ్ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్‌లు ఉద్భవించే అవకాశం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) అప్రమత్తం చేసింది.
వచ్చే మూడు వారాలు భారత్‌కు కీలకమని.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సంస్థ డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోంది. ఈ క్రమంలో కొన్ని రకాలు బలహీనంగా ఉండి కనుమరుగైతే.. మరికొన్ని ఎక్కువ ప్రభావం చూపుతూ వ్యాప్తిలో ఉంటాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండున్నర లక్షలపైన పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో కొత్తరకం కరోనా వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి.
ఆయా నమూనాల నుంచి వైరస్ జన్యుక్రమం ఆవిష్కరించే పరిశోధనలు సాగుతున్నాయి. కొత్త రకంలో ఎక్కువ ఉత్పరివర్తనాలు ఉంటున్నాయా? వ్యాప్తి పెరగడానికి దోహదం చేస్తున్నాయా? అనేదానిపై పరిశీలిస్తున్నాం అన్నారు.
బి.1.617 రకం ఇతర వైరస్ రకాల కంటే ఎక్కువ వ్యాప్తికి కారణం అవుతుందనడానికి తగిన ఆధారాలు లేవు. దేశవ్యాప్తంగా దీని వ్యాప్తి ప్రస్తుతం 10 శాతంలోపే ఉంది.
ఈ484క్యూ, ఎల్452ఆర్ మ్యుటేషన్లతోపాటు మరికొన్ని బి.1.617లో ఉన్నాయి. భారత్‌లో ఈ రకం అక్టోబరులో బయటపడింది. అప్పట్లో ప్రజల జాగ్రత్తలతో వ్యాప్తి పెద్దగా లేదు.
రెండు నెలలుగా చాలామంది మాస్క్ లేకుండా తిరగడం, టీకా వచ్చిందని జాగ్రత్తలను విస్మరించడం.. కేసులు పెరగడానికి దారితీసింది'' అని ఆయన వివరించారని ఈనాడు రాసింది.
టీకా తీసుకున్నా ముఖానికి మాస్క్ ధరించాల్సిందే. పార్టీల ర్యాలీలు, మతపరమైన మేళాలు అత్యంత ప్రమాదకరం. వీటితోనే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేందుకు ఎక్కువ అవకాశం ఉంది.
గాలి నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. భవనాలు, ఇతర మూసి ఉండే ప్రదేశాల్లో 20 అడుగుల దూరం వ్యాపిస్తుంది. మాస్క్ ధరిస్తే 80 శాతం రక్షణ ఉంటుంది. అందరూ ధరిస్తే 99 శాతం రక్షణ లభిస్తుంది'' అని ఆయన వివరించారని ఈనాడు చెప్పింది.

ఫొటో సోర్స్, NAlle sivakumar
భారీగా పెరిగిన పోలవరం అంచనాలు
పోలవరం ప్రాజెక్ట్ పనుల అంచనాలు భారీగా పెరిగాయని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించింది.
‘‘పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనుల అంచనాలు ఒక్క రోజులోనే అమాంతం రూ.3,222 కోట్ల మేర పెంచారు.
హెడ్‌వర్క్స్ అంచనాలను ఒక్కరోజులోనే రూ.2,569.61 కోట్లు పెంచిన జగన్ ప్రభుత్వం.. ఒప్పందంలో లేని పనుల పేరిట మరో రూ.653 కోట్లకు టెండర్లను పిలిచేందుకు సిద్ధమైంది.
ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని నిర్మూలించేందుకు రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.
టెండరింగ్, పనుల అప్పగింతలో అవకతవకల పరిశీలనకు ఓ నిపుణుల కమిటీని కూడా వేశారు. దాని సిఫారసుతో కాంట్రాక్టు సంస్థకిచ్చిన పనులను రద్దుచేశారు.
ప్రాజెక్టులో మిగిలిన పనులతో పాటు పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు పనులకు పిలిచిన టెండర్లలో రూ.780 కోట్లు ఆదా అయ్యాయని ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయ’’ని ఆ కథనంలో రాశారు.
‘‘పోలవరం హెడ్‌వర్క్స్‌లో మిగిలిన రూ.1,771.44 కోట్లకు రివర్స్ టెండర్‌కు జగన్ ప్రభుత్వం వెళ్లింది. ఈ పనులకు మేఘా ఇంజనీరింగ్ రూ.1,548 కోట్లకు టెండర్ వేసింది.
రివర్స్ టెండర్ ద్వారా రూ.223.44 కోట్లు మాత్రమే మిగిలింది. కానీ హైడల్ ప్రాజెక్టు పనులను కలిపి రూ.780 కోట్లు మిగిలాయంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.
ఈ పనులు చేజిక్కించుకున్న కొద్ది నెలల్లోనే .. ఇసుక పాలసీలో వచ్చిన మార్పులు.. మార్గదర్శకాల ప్రకారం మెట్రిక్ టన్నుకు రూ.375 చెల్లించాలని, జీఎ్‌సటీ, ఇతర పనులు, టెండర్ డాక్యుమెంటులోకి రాని ఇతర పనులకు కూడా కలిపి.. అదనంగా రూ.500 కోట్లను చెల్లించాలని ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వమూ సూత్రప్రాయంగా అంగీకరించింద’’ని ఆంధ్రజ్యోతి చెప్పింది.
అంటే.. అప్పటికే రివర్స్ టెండర్‌లో మిగిలింది రూ.223.44 కోట్లయితే.. అదనపు వ్యయం రూ.276.36 కోట్లు.. ఈ విషయాన్ని ప్రభుత్వం దాచేసిందని రాశారు.
తాజాగా ప్రాజెక్టు ప్రధాన పనుల అంచనా వ్యయాన్ని మరో రూ.1,656.61 కోట్లకు పెంచుతూ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం రెండు ఉత్తర్వులు జారీ చేశారని ఆంధ్రజ్యోతి కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనాపై 48 గంటల్లో నిర్ణయం తీసుకోండి
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కట్టడి కోసం 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినట్లు నమస్తే తెలంగాణ పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ, వారంతపు లాక్‌డౌన్‌పై 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో తగిన ఆదేశాలు జారీచేస్తామని హైకోర్టు స్పష్టంచేసింది.
సోమవారం కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదైన కేసులు వార్డులవారీగా కోర్టుకు సమర్పించాలని, దవాఖానల్లో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారిని ఎవరినైనా నియమించారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
వెబ్‌సైట్‌లో కొవిడ్ కేసుల వివరాలు నమోదు చేయాలని తెలిపింది. వివాహాలు, శుభకార్యాల్లో, పబ్లిక్ స్థలాల్లో ప్రజల హాజరు, సంచారంపై ఆంక్షలు విధించాలని సూచించింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసిందని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
పింక్ వాట్సప్ లింక్ నొక్కితే సైబర్ నేరగాళ్లకు ఫోన్ డేటా
పింక్ వాట్సాప్ మెసేజ్ క్లిక్ చేస్తే పోన్ డేటా సైబర్ నేరగాళ్లకు చేరుతుందని పోలీసులు చెబుతున్నారంటూ సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
మీ వాట్సాప్ ఆకర్షణీయమైన పింక్ కలర్‌లో చూసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఈ లింక్ క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి.
ఇలాంటి ఆకర్షణీయమైన, ఆకట్టుకునే ప్రకటనలతో నమ్మకంగా పంపించే లింకులను క్షణం ఆలోచించకుండా క్లిక్ చేస్తే మీరు తప్పులో కాలేసినట్టే.
సైబర్ నేరగాళ్లు నయా దందాలకు ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నట్టు సైబర్ పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల ఫేస్‌బుక్ అక్కౌంట్లను హ్యాక్ చేసి ఖాతాదారు ఫ్రెండ్స్‌తో మెసెంజర్ ద్వారా నమ్మకంగా చాటింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న సైబర్ క్రైమ్ ముఠాలు చెలరేగిపోయాయి.
తాజాగా వాట్సాప్ గ్రూపులకు యాప్‌లు, ఆఫర్లు, సినిమాలు, గేమ్స్ అంటూ లింక్‌లు పెట్టి డేటా దోచేసే ముఠాలు పేట్రేగిపోతున్నాయి.
ప్రస్తుతం ఫోన్లు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్న సంక్షిప్త ప్రకటనలతో వచ్చే లింక్‌ను క్లిక్ చేస్తే.. ఫోన్‌లోని సమాచారం చోరీ అవుతోంది.
ఇన్‌స్టాల్ పేరుతో ఆయా లింక్‌లను క్లిక్ చేసి ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కు అనుమతిస్తే వెంటనే మన ఫోన్ సైబర్ నేరస్తుల స్వాధీనంలోకి వెళ్లిపోతోంది. ఫోన్‌లోని డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల సర్వర్‌లోకి చేరుతోందని పోలీసులు చెప్పినట్లు పత్రిక రాసింది.
ఆ డేటాను ఉపయోగించుకుని మన మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉంటే మనకు తెలియకుండానే డబ్బులు లాగేయడం, వ్యక్తిగతమైన ఫొటోలు, వీడియోలు చిక్కితే న్యూడ్ ఫొటోలు, వీడియోలు అంటూ డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయడం, మన కాంటాక్ట్స్‌కు కాల్‌చేసి డబ్బులు అడగడం వంటి మోసాలు చేసేందుకు అవకాశం ఉంది.
సోషల్ మీడియా ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో కొద్ది రోజులుగా పింక్ వాట్పాప్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి లింక్‌లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అటువంటి వాటిని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దు.
మనకు తెలియని, అవగాహన లేని లింక్‌లను తెరిస్తే ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల పాలయ్యే ప్రమాదం ఉంది.
వీటిపై ఇప్పటివరకు మా పరిధిలో ఎటువంటి కేసు నమోదు కాలేదు. అయినా ఇటువంటి లింక్‌ల పట్ల సోషల్ మీడియా యూజర్లు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సైబర్ క్రైమ్ ఏసీపీ బి.రాజారావు చెప్పారని సాక్షి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








