కరోనావైరస్: దిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ... మాల్స్, జిమ్స్ బంద్, రెస్టారెంట్ల హోం డెలివరీకి అనుమతి

కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI

దిల్లీలో వారాంతపు రోజుల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దిల్లీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేజ్రీవాల్, దిల్లీలో ఆస్పత్రి పడకల కొరత లేదని చెప్పారు. ఈరోజుకు కూడా దిల్లీలో 5 వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని, ఈ సంఖ్యను మరింత పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.

తాజా నిర్ణయం ప్రకారం దిల్లీలో ఆడిటోరియాలు, మాల్స్, జిమ్స్, స్పాలు వారాంతాల్లో పూర్తిగా మూసేస్తారు. సినిమా థియేటర్లు మూడింట ఒక వంతు సామర్థ్యంతో నడపడానికి అనుమతించారు. హోటళ్లు కూడా మూసేస్తారు. హోం డెలివరీ మాత్రం చేసుకోవచ్చు. వీక్లీ మార్కెట్లను కూడా కొన్ని షరతులతో అనుమతించారు. ఇప్పటికే ఖరారైన పెళ్లిళ్లు జరుపుకోవడానికి అభ్యంతరం ఉండదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"వారం రోజుల్లోని పని దినాల్లో ఎవరైనా ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లాల్సి ఉంటుంది. కానీ, వారాంతాల్లో చాలా మంది వినోదం కోసం బయటకు వెళతారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఆపవచ్చు. ఈ నిర్ణయం కొంతమందికి బాధ కలిగించవచ్చు. కానీ, కరోనా సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని కేజ్రీవాల్ వివరించారు.

లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఇతర ఉన్నతాధికారులతో ఈ ఉదయం సమావేశమైన తరువాత కేజ్రీవాల్ ఈ నిర్ణయం ప్రకటించారు.

బుధవారం నాడు దిల్లీలో కొత్తగా 17,282 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి దిల్లీలో ఒకే రోజులో ఇన్ని కేసులు ఎన్నడూ నమోదు కాలేదు. దిల్లీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్‌తో తీవ్రంగా ప్రభావితమైన నగరంగా మారింది. బుధవారం నాడు మరణాలు కూడా 100 దాటిపోయాయి.

దిల్లీలో కరోనా పరీక్షలు చేయించుకుంటున్న వారిలో పాజిటివ్‌గా తేలుతున్న వారి శాతం గణనీయంగా పెరిగింది. సోమవారం నాడు 12.4 శాతం నుంచి ఇది బుధవారానికి 16 శాతానికి చేరుకుంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

దేశంలో ఒకే రోజు రికార్డు స్థాయిలో 2 లక్షల కొత్త కేసులు... వేయికి పైగా మరణాలు

భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 2,00,739 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య మంత్రిత్ శాఖ ప్రకటించింది.

ఒకే రోజు 1,038 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కు చేరగా, మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 1,73,123కు పెరిగింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

భారత్‌లో గత 24 గంటల్లో 93,528 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,24,29,564కు చేరింది.

దేశంలో ప్రస్తుతం 14,71,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

భారత్‌లో ఇప్పటివరకూ 11,44,93,238 డోసుల కరోనా వ్యాక్సీన్ వేశారు.

సెకండ్ వేవ్‌లో పది రోజుల్లో కేసులు రెట్టింపు అయ్యాయి.

ఈ ఏడాది ఏప్రిల్ 4న భారత్‌లో కరోనా కేసులు లక్షకు చేరాయి. ఆ రోజు 1,03,558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా పరీక్షలు

ఫొటో సోర్స్, Ravi prakash

యూపీలో 20 వేలు దాటిన రోజువారీ కేసులు

యూపీలో గత 24 గంటల్లో కొత్తగా 20,510 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కోవిడ్ వల్ల కొత్తగా 67 మంది చనిపోయారు. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 9,376కు చేరింది.

కరోనా కేసులు పెరగడంతో మిగతా రాష్ట్రాల నుంచి తిరిగొచ్చేవారు క్వారంటైన్‌లో ఉండాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

బయటి నుంచి వచ్చేవారికి ఆయా జిల్లాల అధికారులు పరీక్షలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, వారు 14 రోజుల హోం క్వారంటైన్ ఉండాల్సుంటుంది. లక్షణాలు లేనివారు 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి.

దీనిపై యూపీ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు లఖిత మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇళ్లలో క్వారంటీన్ వ్యవస్థ లేకపోతే, వారిని ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటీన్( స్కూళ్లు, ఇతర భవనాలు)లో ఉంచాలని సూచించింది.

కరోనా పరీక్షలు

ఫొటో సోర్స్, Ravi prakash

జార్ఖండ్‌లో యూకే, డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్

జార్ఖండ్‌లో దాదాపు మూడో వంతు శాంపిళ్లలో కరోనా యూకే స్ట్రెయిన్, డబుల్ మ్యూటెంట్ వైరస్ ఉన్నట్లు తేలింది.

జార్ఖండ్ రాంచీ, తూర్పు సింహభూమ్ జిల్లా నుంచి ఇటీవల సేకరించిన శాంపిళ్లలో కనీసం 33 శాతం శాంపిళ్లలో యూకే స్ట్రెయిన్, డబుల్ మ్యూటెంట్ ఉన్న వైరస్ ఉన్నట్లు ధ్రువీకరించారు.

ఈ శాంపిళ్లన్నింటినీ పరీక్షల కోసం భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌కు పంపించారు. ఆరోగ్య విభాగం దీనిని ధ్రువీకరించారు.

ఈ రిపోర్ట్ ప్రకారం యూకే స్ట్రెయిన్‌ను బి-1.1.7, డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్‌ను బీ-1.617గా గుర్తించారు.

జనవరి 1 నుంచి మార్చి 23 మధ్య ఇలాంటి శాంపిళ్లు చాలా తక్కువగా ఉన్నాయని రాష్ట్ర ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ చెప్పారు.

బుధవారం సాయంత్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,198 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకూ ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇది అత్యధికం. మొత్తం కేసుల్లో రాంచీలోనే 1273 కేసులు నమోదయ్యాయి.

ఏప్రిల్ 14న జార్ఖండ్‌లో కరోనా వల్ల 31 మంది చనిపోయారు. గత నాలుగు రోజులుగా వంద మరణాలు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)