అనంతపురం జిల్లాలో పూర్వయుగపు ఆనవాళ్లు...మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఇచ్చిన సమాచారంతో గుర్తించిన పురావస్తు శాఖ

ఫొటో సోర్స్, Getty Images
అనంతపురం జిల్లాలో పూర్వయుగపు ఆనవాళ్లు...
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం పరిసర ప్రాంతాల్లో చారిత్రక పూర్వయుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది.
మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం పురావస్తు శాఖ పరిశోధన బృందం పర్యటించి ఆనవాళ్లు గుర్తించిందని ఈ కథనం పేర్కొంది.
స్థానిక పోతుగుండు సమీపంలో కొత్తరాతియుగపు విసురుడు రాళ్ల గుంటలు, క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల కిందటి నివాసస్థలాల గుంటలు, ఆది యుగపు ముడి ఇనుము, చిట్టెపురాళ్లు, నలుపు, ఎరుపు మట్టి పాత్రలు ఉన్నాయి.
వీటితోపాటు శాతవాహనుల కాలానికి చెందిన కుండ పెంకులు, పూసలు, ఇటుక రాతిముక్కలు లభించాయని పురావస్తుశాఖ అనంతపురం కార్యాలయం సహాయ సంచాలకులు రజిత తెలిపినట్లు ఈ కథనం వెల్లడించింది.
బాణిగౌరమ్మ ఆలయం, మునీశ్వరస్వామి దేవాలయం వద్ద క్రీస్తుశకం 8వ శతాబ్దం నాటి మహిష మర్దిని విగ్రహం, క్రీస్తుశకం 16వ శతాబ్దం నాటి సూర్యవిగ్రహం, రంగస్వామి బండమీద కొత్తరాతియుగపు నూరుడు గుంటలు గుర్తించామన్నారు.
నీలకంఠాపురం గ్రామానికి క్రీస్తు పూర్వం 4000 సంవత్సరం నాటి చరిత్ర ఉన్నట్టు ఆనవాళ్లు గుర్తించామని పురావస్తు శాఖ అధికారులు తెలిపినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Chennai Custom
విగ్గులో బంగారం...విలువ రూ.రెండున్నర కోట్లు
దుబాయి, షార్జా నుంచి ప్రత్యేక విమానాల్లో అక్రమంగా తీసుకొచ్చిన రూ.2.53 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని చెన్నై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.
అధికారులు అందించిన వివరాల ప్రకారం చెన్నై విమానాశ్రయానికి దుబాయి, షార్జా నగరాల నుంచి ఆదివారం రెండు ప్రత్యేక విమానాలు వచ్చాయి.
చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురు వ్యక్తులపై అనుమానంతో ప్రత్యేకంగా సోదా చేయగా ముడి బంగారంతోపాటు తల విగ్గు, సాక్సుల్లో దాచిన బంగారం పేస్టును గుర్తించారు.
ఈ బంగారం పేస్టు విలువ మొత్తం రూ.2.53 కోట్ల ఉంటుందని అధికారులు చెప్పారు. దాన్ని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని అరెస్టు చేశారు.
అదే సమయంలో చెన్నై నుంచి షార్జాకు అక్రమంగా తీసుకెళ్లేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దీనికి సంబంధించి నలుగురిని అరెస్టు చేశారని ఈనాడు కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO
తెలంగాణ పీఆర్సీకి ఎన్నికల సంఘం ఓకే...నేడు సీఎం ప్రకటనకు అవకాశం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఫిట్‌మెంట్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం పచ్చజెండా ఊపడంతో ప్రభుత్వం సోమవారం పీఆర్సీపై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం ఉందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ప్రచురించింది.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేస్తారని తెలిసినట్లు ఈ కథనం పేర్కొంది. రిటైర్మెంట్ వయసు పెంపుపైనా నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది.
సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినదానికన్నా ఎక్కువే ఇచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఈ కథనం పేర్కొంది.
పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వం కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నా..ఎన్నికల నిబంధనల కారణంగా వాయిదా పడింది.
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రకటించాలని భావించినా.. వెంటనే నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదలచేసింది. దీంతో మరోసారి ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. పీఆర్సీ ప్రకటనకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ మేరకు శనివారం లేఖ రాసింది. దీనిపై ఎన్నికల సంఘం ఆదివారం స్పందించింది.
పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. అయితే ఈ అంశాన్ని ఉపయోగించుకొని ఉపఎన్నిక జరుగుతున్న జిల్లాలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు, లబ్ధి పొందే ప్రయత్నాలు చేయవద్దని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పీఆర్సీ ప్రకటనకు మార్గం సుగమమైనట్లు ఈ కథనం పేర్కొంది.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పీఆర్సీపైనా, పదవీ విరమణ వయసు పెంపు, ఇతర అంశాలపైనా వీరు చర్చించినట్టు తెలిసిందని నమస్తే తెలంగాణ కథనం రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
పాత పద్ధతిలోనే ఏపీ ఎంసెట్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ సహా వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలను గతంలో మాదిరిగానే యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది. పాత విధానంలోనే ఏపీ ఎంసెట్-2021ను నిర్వహించనుందని ఈ కథనం తెలిపింది.
ప్రస్తుతం ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఈ మూడు సబ్జెక్టులు చదవని ఇతర గ్రూపుల ఇంటర్ విద్యార్థులకూ ఇంజనీరింగ్ కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పించేలా ఏఐసీటీఈ ఇటీవల నిబంధనలను విడుదల చేసింది.
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు అవసరమయ్యే కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులకు ఆ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూనే ఇతర కోర్సులకు ఇతర గ్రూపుల విద్యార్థులను అనుమతించాలని సూచించింది.
ఇందుకు 14 ఆప్షనల్ సబ్జెక్టులను పేర్కొంటూ వీటిలో ఏ మూడింటి కాంబినేషన్‌తో ఇంటర్ చదివినా ఇంజనీరింగ్ కోర్సుల్లోకి అనుమతించవచ్చని తెలిపింది. అయితే అంతిమంగా ఈ నిబంధనలను అనుసరించడంపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల ఇష్టానికే వదిలేసింది.
ఈ నేపథ్యంలో గతంలోని నిబంధనల ప్రకారమే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అయితే విద్యార్థులు ఇంటర్‌లో 45శాతం (రిజర్వుడ్ కేటగిరీలకు 40 శాతం) మార్కులు సాధించి ఉండాలి.
కరోనా నేపథ్యంలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎంసెట్‌లో కూడా సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించనున్నారు. ఏయే అంశాలపై బోధన జరిగిందో అవే అంశాల పరిధిలో ప్రశ్నలుండేలా ఉన్నత విద్యామండలి జాగ్రత్తలు తీసుకుంటోందని సాక్షి కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- దండి మార్చ్: గాంధీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో నడిచిన తెలుగు వ్యక్తి ఎవరు?
- బార్కోడ్: బీచ్‌లోని ఇసుకలో పుట్టిన ఆలోచన... ప్రపంచ వాణిజ్య రూపురేఖలను ఎలా మార్చేసింది?
- మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోతోంది?
- రాళ్లు అమ్మి కోటీశ్వరుడైన ఓ 'మేధావి' కథ
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- పెట్రోల్, గ్యాస్ ధరల వల్ల మీ జేబుపై ఎంత భారం పడుతుంది
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- మీ 'టేక్ హోమ్ సాలరీ' రాబోయే రోజుల్లో తగ్గిపోనుందా... ఎందుకని?
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








