69 ఏళ్ల వయసులో సహజీవనం: ‘‘ఎవరేమనుకున్నా మేం పట్టించుకోం’’

ఫొటో సోర్స్, NITIN NAGARKAR
- రచయిత, దీపాలీ జగ్తాప్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"మేము గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాం. సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచిస్తూ కూర్చుంటే నా జీవితం ఒంటరిగానే గడిచిపోతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే నా దగ్గర ఎవరుంటారు? సమాజమేం నన్ను చూసుకోదు కదా" అని ఆసావరీ కులకర్ణి అంటున్నారు.
పుణెలోని వసంత బాగ్ ప్రాంతంలో నివసిస్తున్న అనిల్ యార్దీ (69), ఆసావరీ కులకర్ణి (69) ఆరేళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు.
"లివ్-ఇన్ రిలేషన్ అంటే స్నేహితులుగా కలిసి జీవించడం. పెళ్లి ఆనేసరికి అనేక వ్యవహారాలు ఉంటాయి. లివ్-ఇన్‌కు ఆ బాధలేమీ ఉండవు. జీవితాంతం లివ్-ఇన్‌లో కలిసి ఉండగలమా అని మాత్రమే ప్రశ్నించుకోవాలి" అని అనిల్ అన్నారు.
ఆ సంభాషణ కొనసాగిస్తూ.. "కలిసి జీవించాలని నిశ్చయించుకున్నాక, సమాజం ఏమనుకుంటుందనేది మేము పట్టించుకోలేదు" అని ఆసావరీ చెప్పారు.
ఇదేమీ దాచాల్సిన విషయం కాదని, తమ ఆలోచనలను అందరితో పంచుకోవడానికి ఎలాంటి సంకోచం లేదని వీరు అంటున్నారు.
వీరిద్దరికీ ఎక్కడ, ఎలా పరిచయమైంది? కలిసి జీవించాలని ఎప్పుడు నిర్ణయించకున్నారు? లాంటి విషయాలన్నీ బీబీసీతో పంచుకున్నారు.

అలా మొదలైంది..
సుమారు ఏడేళ్ల క్రితం.. సీనియర్ సిటిజన్ల కోసం కార్యక్రమాలు నిర్వహించే మాధవ్ దామ్లే, తమ సంస్థ తరపున ఏర్పాటు చేసిన ఒక యాత్రలో అనిల్, ఆసావరీ కలుసుకున్నారు.
"నేను నా కార్లో వెళ్లాను. నేనెళ్లిన కొద్దిసేపటికి ఈమె వచ్చారు. తనని చూడగానే ఒక ఆకర్షణ కలిగింది. మెల్లిగా మా మధ్య మాటలు మొదలయ్యాయి. క్రమంగా స్నేహం కుదిరింది" అని అనిల్ వివరించారు.
తరువాత ఇద్దరూ రెండు మూడు రోజులకోసారి కలుసుకోవడం ప్రారంభించారు. అనిల్ వృత్తిపరంగా ఎలక్ట్రికల్ ఇంజినీర్. అప్పటికి ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆసావరీ ఇంటికెళ్లి, టీ తాగి, కాసిన్ని కబుర్లు చెప్పి వచ్చేవారు.
వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఒకరి ఆలోచనలు మరొకరికి నచ్చసాగాయి. అభిప్రాయాలు కలిశాయి.
"పది నెలలు ఇలా సాగింది. మా ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు ఒకటేనని మేము గ్రహించాం. మా ఇద్దరికీ కారాలు తినడం ఇష్టం. మాంసాహారం అంటే ఇష్టం. అప్పుడప్పుడూ కలిసి డ్రింక్ చేసేవాళ్లం. ఇద్దరికీ ప్రయాణాలు ఇష్టం. ఒక్కోసారి మేము రోజంతా బయట తిరిగి వచేవాళ్లం. మేమిద్దరం కలిసి జీవించగలమని మాకర్థమైంది" అని ఆసావరీ చెప్పారు.

నిర్ణయం తీసుకోవడం సులభం కాలేదు
"2013లో నా భార్య చనిపోయింది. అంతకుముందు నా తల్లిదండ్రులు చనిపోయారు. తరువాత నా సోదరుడు మరణించాడు. ఆ తరువాత, నా కొడుకు కూడా నన్ను విడిచి వెళ్లిపోయాడు. నాకో కూతురు ఉంది. కానీ నేను ఒంటరి జీవితం గడుపుతూ ఉండేవాడిని. నాకు ఒక తోడు కావాలని అనిపిస్తూ ఉండేది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని అనిల్ తెలిపారు.
ఆసావరీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. 2012లో ఆమె రిటైర్ అయ్యారు. 1997లోనే ఆమె భర్త చనిపోయారు.
"నా భర్త పోయిన తరువాత మా ఆడపడుచు, వాళ్ల అబ్బాయి మా ఇంటికి దగ్గరగా ఉండేవారు. అందువల్ల నాకెప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. కానీ, కొన్నాళ్లకు వాళ్లు వాళ్లబ్బాయితో పాటూ వేరే ప్రాంతానికి వెళిపోయారు. అప్పుడు నేను ఒంటరితనం అనిభవించడం మొదలుపెట్టాను. ఆ సమయంలో పూణె కాలేజీలో వృద్ధులకోసం 'లివ్-ఇన్ రిలేషన్‌షిప్'పై ఒక సదస్సు నిర్వహించారు. నేను ఆ సదస్సుకు హాజరయ్యాను. మిగిలిన జీవితం ఆనందంగా అనుభవించడానికి ఇదే సరైన మార్గమని భావించాను.
ఆ సదస్సులో అనేక విషయాలపై చర్చించారు. ఈ వయసులో ఒకరితో ఒకరు సర్దుకుని కలిసిమెలిసి జీవించడం ఎలా, మనకు సరైనవారెవరో తెలుసుకోవడమెలా...ఇలా అనేక రకాల విషయాలపై మాట్లాడారు. మేమిద్దరం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు నా వయసు 62 సంవత్సరాలు. లివ్-ఇన్ రిలేషన్ మొదలుపెట్టడానికి అది సరైన వయసని ఆ సదస్సులో చెప్పారు. ఎందుకంటే 70 ఏళ్లు దాటితే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. తిరగడానికి ఓపిక ఉండదు. ఈ చర్చంతా నాలో ఆలోచనలు రేకెత్తించింది" అని ఆసావరీ వివరించారు.

'సమాజాన్ని చూసి భయపడలేదు'
సమాజంలో ఇప్పటికీ లివ్-ఇన్ రిలేషన్స్‌కు గౌరవం లేదు. వివాహం కాకుండా కలిసి జీవించేవారిని చిన్నచూపు చూస్తారు.
"ఒక పక్క, నా గురించి జనాలు ఏమనుకుంటారు అని ఆలోచనగా ఉండేది. మరోవైపు, సమాజం గురించి ఆలోచిస్తూ నేను ఒంటరిగా మిగిలిపోవాలా అని అనిపిస్తూ ఉండేది. ఈ ఆలోచనలతో నాకు రాత్రుళ్లు నిద్ర పట్టేది కాదు. నేను ఎవరితో మాట్లాడతాను? నాకు ఏదైనా అవసరమైతే ఎవరు సహాయం చేస్తారు? మనం సమాజం గురించి ఆలోచిస్తుంటాంగానీ సమాజం మన బాగోగులు చూడదు కదా" అని ఆసావరీ అన్నారు.
కానీ, అనిల్, ఆసావరీ వివాహం చేసుకోకుండా లివ్-ఇన్‌లో ఉండాలని ఎందుకు అనుకున్నారు?
"ఈ వయసులో రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే లివ్-ఇన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. అవసరమైతే వివాహం చేసుకోవచ్చు. మిగిలిన జీవితమంతా సంతోషంగా గడపాలని అనుకున్నాం. ఈ విషయంలో మేమిద్దరం స్పష్టంగానే ఉన్నాం. సమాజం గురించి మేము భయపడలేదు. అంతా బానే ఉంటే పెళ్లి చేసుకోడానికి కూడా అభ్యంతరమేమీ లేదు. ఒక్కోసారి పెళ్లయ్యాక అవతలి వ్యక్తి మీద మనకి ఇష్టం పోవచ్చు. అందుకే మేము అసలు ఆ జంజాటంలోకే వెళ్లకుండా లివ్-ఇన్‌లోనే ఉందామనుకున్నాం. పెళ్లి అవసరమని మాకనిపించలేదు" అని ఆసావరీ జవాబిచ్చారు.
"ఈ విషయాన్ని మేము మా స్నేహితులతో పంచుకున్నాం. వారంతా చాలా సంతోషించారు. మా ఇంటికి వస్తూ ఉంటారు. మేమూ వాళ్ల ఇళ్లకు వెళతాం. ఇంతవరకూ సమాజం నుంచి మాకు ఎలాంటి చేదు అనుభవం ఎదురవ్వలేదు" అని అనిల్ తెలిపారు.
అనిల్, ఆసావరీ ఇద్దరికీ పిల్లలు ఉన్నారు. అంతకుముందు వారి, వారి జీవితాలున్నాయి. వాటితో ముడిపడిన జ్ఞాపకాలున్నాయి. అలాంటప్పుడు ఈ కొత్త బంధాన్ని పటిష్ఠపరుచుకునేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
"మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది. ఈ ఏడేళ్లల్లో మా నమ్మకాలను వమ్ము చేసేలా ఏదీ జరగలేదు" అని ఆసావరీ అన్నారు.
ఆమె మాటను అందుకుంటూ.. "మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ ఉంది" అని అనిల్ నవ్వుతూ చెప్పారు.

ఫొటో సోర్స్, Aasawari Kulkarni
కుటుంబం వ్యతిరేకించిందా?
కుటుంబాల నుంచీ కొంత వ్యతిరేకత వచ్చిందని అనిల్, ఆసావరీ ఇద్దరూ చెప్పారు.
"మొదట్లో మా అమ్మాయి మా సంబంధాన్ని అంగీకరించలేదు. ఆసావరీని పరిచయం చేయడానికి నేను మా అమ్మాయి ఇంటికి తీసుకెళ్లాను. మా అమ్మాయి ఒప్పుకోలేదు. అయితే, మెల్లిగా తనని ఒప్పించాం.. ఇది మాకు రెండో పెళ్లి కాదు. మేము ఒకరితో ఒకరు కలిసి ఉండాలనుకుంటున్నాం అని చెప్పాం" అని అనిల్ వివరించారు.
"గత ఏడేళ్లుగా మేము ఆనందంగా కలిసి జీవించడం చూసి మా పిల్లలు ఇప్పుడు ఎంతో సంతోషిస్తున్నారు. మా బంధాన్ని నమ్ముతున్నారు. పిల్లల పుట్టినరోజులకు మొత్తం కుటుంబం అంతా కలుస్తాం. మా బంధువుల ఇళ్లకు కూడా మేమిద్దరం కలిసే వెళతాం. మా బంధాన్ని వారంతా కూడా గౌరవిస్తున్నారు. ఇప్పటివరకూ అంతా బాగానే జరుగుతోంది" అని ఆసావరీ తెలిపారు.
సీనియర్ సిటిజన్ల సమస్యలపై పలు సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ వారి సమస్యలకు లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అన్నిటికన్నా ఉత్తమ పరిష్కారమని ఆసావరీ అంటున్నారు.
అయితే, లివ్-ఇన్‌లోకి వెళ్లే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఆ బంధానికి గౌరవమిస్తూ అందులోకి వెళ్లాలని అనిల్, ఆసావరీ కూడా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, NITIN NAGARKAR/BBC
ఇద్దరు వ్యక్తులు విభిన్న కుటుంబాలనుంచీ, విభిన్న జీవితాలనుంచీ వచ్చి కలిసి ఉంటున్నప్పుడు ఇంటి ఖర్చుల వ్యవహారం పెద్ద పాత్రే పోషిస్తుంది.
"ఆ విషయంలో మాకు కొన్ని స్పష్టమైన నిబంధనలున్నాయి. నెల ఖర్చులను ఇద్దరం సరి సమానంగా పంచుకుంటాం. బట్టలు, నగలు ఎవరి డబ్బులతో వాళ్లు కొనుక్కుంటాం. డబ్బుల గురించి మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఏ గొడవా రాదు. ఒక బంధంలోకి వెళ్లే ముందు డబ్బు విషయంలో ఒక స్పష్టత ఉండడం చాలా అవసరం. పిల్లల అంగీకారం ఉండడం కూడా అంతే అవసరం" అని ఆసావరీ అన్నారు.
"ఎవరైనా సరే లివ్-ఇన్ బంధాన్ని తేలికగా తీసుకోకూడదు. ఎప్పుడూ ఈ బంధాన్ని బలపరుచుకోవడానికే ప్రయత్నించాలి. మనం కలిసి ఉండాలని నిర్ణయించుకున్న తరువాత కొన్నాళ్లకు విడిపోతే సమాజం మనపై అనేక ప్రశ్నలు సంధిస్తుంది. చివరి వరకూ కలిసి ఉంటే మనల్ని ఎవరూ వేలెత్తి చూపలేరు" అనిల్ చెప్పారు.
ఏ బంధానికైనా ప్రేమ ముఖ్యమని ఆసావరీ, అనిల్ విశ్వసిస్తారు. కొంత త్యాగం, కొంత రాజీ పడే తత్వం కూడా ఉండాలని వారిద్దరూ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- నువ్వలరేవు: ఇక్కడ వరుడికి వధువు తాళి కడుతుంది, ఇంకా...
- దిశా రవి ఎవరు? ఏమిటీ టూల్‌కిట్ కేసు?
- "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- ప్రిన్సెస్ లతీఫా: దుబాయ్ పాలకుడి కుమార్తె 'నిర్బంధం' వ్యవహారంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- కరోనావైరస్ ఇంతలా పెరగడానికి ఎవరు కారణం.. గబ్బిలాలా? మనుషులా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- ఇంట్లోనే ఉంటున్నప్పుడు.. గొడవలు, ఘర్షణలు లేకుండా కుటుంబ సభ్యులతో గడపడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









