హైదరాబాద్‌ను కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేసేందుకు విశాఖకు రూ.1400 కోట్లు :ప్రెస్ రివ్యూ

విశాఖ

హైదరాబాద్‌ను కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం విశాఖకు రూ. 1400 కోట్లు ఇవ్వనుందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్ విభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడం ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి విశాఖపట్నం అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో 15వ ఆర్థికసంఘం రూ.1,400 కోట్ల గ్రాంట్‌ను సిఫార్సు చేసింది.

నగరాన్ని ప్రధాన ఆర్థిక కేంద్రంగా, అభివృద్ధి సూచీ (గ్రోత్‌పోల్‌)గా రూపుదిద్దాలని.. ఇందుకోసం రహదారులు, నీటిసరఫరా, విద్యుత్తు పంపిణీ, భూగర్భ డ్రైనేజీ, అవసరమైన భవనాల నిర్మాణానికి ఏపీ నిధులు కోరింది.

ఈ మేరకు తాము సిఫార్సు చేశామని ఆర్థిక సంఘం వెల్లడించింది. తక్కువ వర్షపాతం పడేచోట, దీర్ఘకాలంగా కిడ్నీవ్యాధులు, ఫ్లోరైడ్‌ సమస్య ఉన్న ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు గ్రాంట్లు కావాలని కూడా ఏపీ విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నట్లు పత్రిక రాసింది.

అందుకే కిడ్నీ సమస్యలున్న ఉద్దానం ప్రాంతానికి రూ.300 కోట్లు, ఫ్ల్లోరైడ్‌ సమస్యతో సతమతమవుతున్న గుంటూరు జిల్లాలోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతాలకు కలిపి రూ.400 కోట్లు, యురేనియం ఫిల్టరింగ్‌తో ప్రభావితమైన పులివెందుల ప్రాంతానికి రూ.200 కోట్ల ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు ఆర్థికసంఘం తెలిపింది.

రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.2,300 కోట్ల రాష్ట్ర ప్రత్యేక గ్రాంట్లన్నీ ఈ పనులకే ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఈ పద్దు కింద 2021-22లో ఏమీ రాదు. తర్వాత రెండేళ్లలో ఏటా రూ.460 కోట్ల చొప్పున విడుదలవుతుంది. మిగిలిన రెండేళ్లు రూ.690 కోట్ల చొప్పున అందుతుందని ఈనాడు వివరించింది.

విద్యార్థులు హాజరు

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో 45 శాతం విద్యార్థులు హాజరు

తెలంగాణలో విద్యా సంస్థలు ప్రారంభమైన తొలి రోజు స్కూళ్లకు 45 శాతం మంది విద్యార్థులే హాజరైనట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తెరచుకున్నాయి. 9వ తరగతి ఆపైన విద్యాసంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో సోమవారం ఉన్నత పాఠశాలలు, పాలిటెక్నిక్‌, ఐటీఐ కాలేజీలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి.

ఈ విద్యాసంవత్సరంలో తొలిరోజు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది.

జూనియర్‌ కాలేజీల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రోజు విడిచిరోజు తరగతులు నిర్వహించాలని నిర్ణయించడంతో.. సోమవారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పాఠాలు ప్రారంభమయ్యా యి. మంగళవారం సెకండియర్‌ విద్యార్థులకు నిర్వహించనున్నారని పత్రిక రాసింది.

హాస్టల్‌ వసతి ఉన్న కసూర్బా, గురుకుల పా ఠశాలల్లో విద్యార్థుల హాజరు అతి తక్కువగా నమోదైం ది. హాస్టళ్లకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ఇంకా సుమఖంగా లేకపోవడమే దీనికి కారణం అని తెలిసింది.

కాగా తొలిరోజు పాఠశాలల్లో 45శాతం పిల్లలు బడికి వచ్చారు. ప్రైవేటు స్కూళ్లలో 55 శాతం, ప్రభుత్వ బడుల్లో 48శాతం హాజరు నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సోమవారం ''ఆంధ్రజ్యోతి'' క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. చౌటుప్పల్‌, సర్వేల్‌, రామన్నపేటలోని ప్రభుత్వ గురుకుల స్కూల్‌లో 9, 10, ఇంటర్‌ విద్యార్థులుండగా ఒక్కరూ రాలేదు.

మరికొన్నిచోట్లా ఇదే పరిస్థితి కనిపించింది. అన్ని విద్యాసంస్థల్లో తొలిరో జు కొవిడ్‌ నిబంధనలు పాటించా రు. గదికి 20 మంది చొప్పున కూ ర్చోబెట్టారు.

కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నీటివసతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరుగుదొడ్లు అపరిశుభ్రం గా ఉండటంతో వినియోగించలేకపోయామని విద్యార్థు లు చెప్పారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఇంటింటికీ బియ్యం

ఫొటో సోర్స్, Andhra Pradesh CM

ఏపీలో ఇంటింటికీ రేషన్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ పథకం ప్రారంభమైందని సాక్షి దినపత్రిక వార్త ప్రచురించింది.

పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ రేషన్‌ పంపిణీ' పథకం పట్టణాల్లో సోమవారం ప్రారంభమైంది.

మొన్నటి వరకు సరుకుల కోసం పేదలు రేషన్‌ షాపుల వద్ద వేచి ఉండే పరిస్థితి. ఒక్కోసారి పేదలు కూలి పనులు మానుకుని రేషన్‌ సరుకుల కోసం వెళ్లాల్సి వచ్చేది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి ఇబ్బందులను గుర్తించి లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సరుకుల పంపిణీ చేసేందుకు వీలుగా 9,260 వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు వాటిని వెంటనే వినియోగంలోకి తెచ్చారు.

రాష్ట్రమంతటా సోమవారం నుంచి లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి రేషన్‌ సరుకులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టగా..

పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సరఫరాను నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో నాణ్యమైన బియ్యం పంపిణీ మొదటి రోజున కేవలం పట్టణాల్లో మాత్రమే ప్రారంభించారు.

మొబైల్‌ వాహనదారులకు ఈ-పాస్‌ వినియోగం, తూకం వేయడం, ఇళ్ల దగ్గరకు వెళ్లి సరుకులు పంపిణీ కొత్త కావడంతో అక్కడక్కడా కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.

తొలి రోజు 83,387 మంది కుటుంబాలకు 12.86 లక్షల కిలోల నాణ్యమైన బియ్యం పంపిణీ చేసినట్టు పౌర సరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారని సాక్షి వివరించింది.

ఒకవైపు ఎండ మరోవైపు చలి

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో ఒకవైపు ఎండ మరోవైపు చలి

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం భిన్నంగా ఉందని నమస్తే తెలంగాణ దినపత్రిక వార్త ప్రచురించింది.

తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత ఉండగా, మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులతో పొడి వాతావరణం ఏర్పడింది.

సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా అర్లి(టీ)లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మూడురోజుల్లో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో తొమ్మిది నుంచి 13 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నది.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని స్కైమెట్‌ అంచనా వేసింది. 2019, 2020లో నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయి.

గత ఏడాది నైరుతిపై లానినా ప్రభావం ఎక్కువగా ఉంది. ఈసారి వర్షాకాలం నాటికి లానినా ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని స్కైమెట్‌ తెలిపిందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)