బడ్జెట్ 2021: రైతుల కోసం నిర్మలా సీతారామన్ ఏం ప్రకటించారు?

బడ్జెట్ 2021

ఫొటో సోర్స్, Getty Images

రెండు నెలల నుంచీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేపడుతున్నారు. మోదీ ప్రభుత్వ విధానాలను రైతు వ్యతిరేక విధానాలుగా వారు అభివర్ణిస్తున్నారు.

అయితే, రైతుల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ ఆర్థిక బడ్జెట్ 2021-22ను సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.

ఇంతకీ బడ్జెట్‌లో రైతుల కోసం ఏం ప్రకటించారు?

తాజాగా బడ్జెట్‌లో ''వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సు''ను పెట్రోలుపై లీటరుకు రూ.2.5కు, డీజిల్‌పై లీటరకు రూ.4 చొప్పున పెంచుతున్నట్లు ప్రతిపాదించారు.

మరోవైపు కాబూలీ చెనా (30 శాతం), బీన్స్‌ (50 శాతం), పప్పు ధాన్యాలు (5 శాతం), పత్తి (5 శాతం)పై అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సును పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొంది. అయితే కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. దీంతో ధరలపై పెద్దగా ఎలాంటి ప్రభావమూ పడదు.

బడ్జెట్ 2021

ఫొటో సోర్స్, LSTV

''మొత్తంగా వినియోగదారులపై ఎలాంటి అదనపు భారమూ పడదు. సాధారణ ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తున్నాం. దీంతో ధరల్లో పెద్దగా ఎలాంటి మార్పూ ఉండదు''అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

2021-22లో రూ.16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.

స్వామిత్వ్ యోజన పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు నిర్మలా చెప్పారు. మరోవైపు ''ఆపరేషన్ గ్రీన్'' పథకాన్ని మరిన్ని పంటలకు వర్తించేలా మార్పులు చేస్తున్నట్లు ఆమె వివరించారు.

ఐదు మత్స్యకార ఓడరేవులను కూడా అభివృద్ధి చేస్తామని నిర్మలా చెప్పారు. మరోవైపు తమిళనాడులో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను నెలకొల్పుతున్నట్లు వివరించారు.

బడ్జెట్ 2021

ఫొటో సోర్స్, EPA

కనీస మద్దతు ధర పరిస్థితేమిటి?

ప్రధానంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) గురించే రైతులు నిరసనలు చేపడుతున్నారు.

రైతుల సంరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పంట వ్యయానికి 1.5 రెట్లు ఉండేలా ఎంఎస్‌పీని తాము పెంచినట్లు వివరించారు.

గోధుమల ద్వారా రూ.75,060 కోట్లు, పప్పు ధాన్యాల ద్వారా రూ.10,503 కోట్లను రైతులకు ఎంఎస్‌పీగా చెల్లించినట్లు నిర్మల తెలిపారు.

మరోవైపు వరికి ఎంఎస్‌పీగా రూ.1,72,752 కోట్లు చెల్లించినట్లు నిర్మల పేర్కొన్నారు.

బడ్జెట్ 2021

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP VIA GETTY IMAGES

ప్రభుత్వం ఏం చెబుతోంది?

గోధుమలపై రైతులకు రూ.75,000 కోట్లను చెల్లించామని, దీని ద్వారా 43.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని నిర్మలా తెలిపారు. గత ఏడాది ఇది 35.57 లక్షలుగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ విషయాలను నిర్మలా చెబుతున్నప్పుడు సభలో ప్రతిపక్ష నాయకులు.. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న పంటలతోపాటు లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య పెరిగిందని నిర్మల చెప్పారు.

2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయలానే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మల పునరుద్ఘాటించారు. యూపీఏ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసిన దానికంటే.. తాము మూడు రెట్లు ఎక్కువగా రైతుల ఖాతాలకు నగదును బదిలీ చేశామని ఆమె అన్నారు. ప్రతి రంగంలోనూ రైతులు లబ్ధి పొందారని చెప్పారు.

''2013-14లో వరి కొనుగోలుకు రూ.63 వేల కోట్లు వెచ్చించారు. నేడు ఇది లక్ష 45 వేల కోట్ల రూపాయలకు పెరిగింది.

''గత ఏడాది 1.2 లక్షల కోట్ల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందారు. ప్రస్తుతం ఇది 1.5 కోట్లకు పెరిగే అవకాశముంది''.

''2013-14లో గోధుమలపై ప్రభుత్వం రూ.33,000 కోట్లను ఖర్చుపెట్టింది. 2019లో ఇది రూ.63,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఇది రూ.75 వేల కోట్లకు పెరగనున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. 2020-21లో 43 లక్షల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందారు''అని నిర్మలా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)