కోవిడ్-19: చిన్న వయసులోనే తోడు కోల్పోయి ఒంటరైన జీవితాలు

ఫొటో సోర్స్, Courtesy Pamela Addison
కరోనావైరస్ కారణంగా ఒక్క అమెరికాలోనే సుమారు 4,30,000 మంది మరణించారు. ఇందులో చాలామంది యువతీ యువకులే. అనేకమంది నడి వయస్కులు తమ తోడును కోల్పోయి ఒంటరి జీవితం గడుపుతున్నారు.
జీవిత భాగస్వామిని బలి తీసుకున్న కోవిడ్ వారిపై కొత్త బరువు బాధ్యతలను కూడా మోపింది. చిన్న వయసులోనే భర్త లేదా భార్యను కోల్పోయినవారు పిల్లలు, సంపాదన అనే అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తోంది.
పమేలా అడిసన్ భర్త , 44 ఏళ్ల మార్టిన్.. మహమ్మారి మొదలైన తొలి వారాల్లోనే వైరస్ బారిన పడి మరణించారు. అప్పటికి పమేలా ఇద్దరు పిల్లల తల్లి . ‘‘ఆయన మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తిత్వం’’ అని ఆమె తన భర్త గురించి గుర్తు చేసుకున్నారు.
‘‘ఆయనకు నేనంటే ప్రాణం. నా మీద ఒక పాట కూడా రాశారు. ఆయన మరణించిన తర్వాత ఫోన్ లో నేను ఆ పాటను చూశాను’’ అన్నారు పమేలా.
రెండో కూతురు పుట్టిన రోజైన మార్చి 22న మార్టిన్ దగ్గు, జలుబుకు లోనయ్యారు. పరీక్షల్లో అది కోవిడ్ అని తేలింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. ఏప్రిల్ 3న శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడ్డారు.

ఫొటో సోర్స్, COURTESY JENNIFER LAW
వైద్య ప్రయత్నాలు విఫలం
ఓ ఆసుపత్రిలో పెథాలజిస్టుగా పని చేస్తున్న తనకు అక్కడే వైరస్ సోకినట్లు మార్టిన్ భావించారు. 26 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు మార్టిన్.
‘‘మా పెళ్లి రోజున ఆసుపత్రి నుంచే నాకు స్కైప్ కాల్ చేశారు. అవే నాతో ఆయన చివరి మాటలు’’ అని గుర్తు చేసుకున్నారు పమేలా. ఐసీయూలో ఉండగానే ఏప్రిల్ 29న మార్టిన్ గుండెపోటు రావడంతో మరణించారు.
భర్తను కోల్పోయిన 37 ఏళ్ల పమేలా.. తనలా చిన్న వయసులోనే కరోనా కారణంగా తోడును కోల్పోయిన వారి ఫేస్ బుక్ గ్రూప్ లో చేరారు. తద్వారా వారి కథలను కూడా విని సాంత్వన పొందేవారామె.
‘‘ఈ బాధ నుంచి ఎలా బైటపడాలో, పిల్లలను ఎలా పోషించాలో అర్ధంకాకుండా ఉంది. నా భర్త ఆసుపత్రిలో ఉండగా, నాన్న ఎప్పుడు వస్తారు అంటూ పిల్లలు అడుగుతుండేవారు’’ అని వెల్లడించారు పమేలా.
టెక్సాస్ లో నివసించే 35 సంవత్సరాల జెన్నిఫర్ ది కూడా దాదాపు ఇలాంటి కథే. ఆమె భర్త మాథ్యూ గత నవంబర్‌లో కోవిడ్ కారణంగా మరణించారు.
‘‘మేమంతా కోవిడ్ బారిన పడ్డాం. పిల్లలు తొందరగా బైటపడ్డారు. నవంబర్ 9న మాథ్యూను ఆసుపత్రిలో చేర్చాం. యాంటీవైరల్ మెడిసిన్ రెమిడెసివిర్‌ను మాథ్యూకు ఇచ్చారు. ఆయన క్షేమంగా ఐసీయూ నుంచి వస్తారని అనుకున్నాం. కానీ పరిస్థితి మరింత క్షీణించింది’’ అన్నారు జెన్నీఫర్.
నవంబర్ 27న మాథ్యూని వెంటిలేటర్ మీద ఉంచారు. శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు.

వేధించే కుంగుబాటు
చిన్నప్పటి నుంచి జెన్నీఫర్, మాథ్యూ ఒకే స్కూల్‌లో పక్కపక్కనే కూర్చుని చదువుకున్నారు. చర్చ్‌కు వెళ్లినా కలిసే వెళ్లేవారు. ‘‘ఆయన నాకు 23 ఏళ్లుగా తెలుసు. మేం పెళ్లి చేసుకుని 13 సంవత్సరాలైంది’’ అన్నారు జెన్నిఫర్.
కొన్నాళ్లు అమెరికా సైన్యంలో పని చేసిన మాథ్యూ, రిటైర్మెంట్ తర్వాత టెక్సాస్ వచ్చి మెకానిక్‌గా స్థిరపడ్డారు. ‘‘మాథ్యూ లేని జీవితం నాకు ఒక పరీక్ష’’ అని నీళ్లు నిండిన కళ్లతో అన్నారు జెన్నిఫర్.
‘‘ఆయనకు నివాళులు తెలిపేందుకు వీధి వీధంతా క్యూకట్టి నిలబడ్డారు. తండ్రి లేని షాక్ నుంచి బైటపడేందుకు పిల్లలు చికిత్స పొందుతున్నారు’’ అన్నారామె.
పమేలా, జెన్నిఫర్‌లు ఇద్దరూ ఫేస్ బుక్ గ్రూప్ ద్వారా పరిచయమయ్యారు. ఇద్దరితో మొదలైన ఈ గ్రూప్ లో ఇప్పుడు రెండు వందలమంది సభ్యులున్నారు.
‘‘ఫేస్‌బుక్‌లో ఇలాంటి అనేకమంది కోవిడ్ బాధితుల గ్రూపుల్లో నేను చేరాను. నా కథ చూసి చాలామంది నేనూ మీలాంటిదాన్నే అంటూ కామెంట్లు పెడుతున్నారు ’’ అన్నారు పమేలా.
‘‘నాలాంటి వారందరినీ ఏకం చేసే మరో గ్రూపును రూపొందించాలని అనుకుంటున్నాను. మీరెవరూ ఒంటరివారు కాదు అని వారికి చెప్పాలన్నది నా లక్ష్యం. వారు ఆ బాధ నుంచి బైటపడటానికి కావాల్సిన సాయం అందిస్తాను’’ అన్నారామె.
మొదట్లో ఇలాంటి బాధను అనుభవించేది, పిల్లల బరువు బాధ్యతలను మోయాల్సి వచ్చింది తానొక్కదాన్నే అనుకున్నారామె. కానీ రానురానూ ఎందరో ఆమెకు పరిచయం అయ్యారు.
ఏకాంతం వల్ల కలిగే బాధ నుంచి విముక్తి పొందడానికి ఏర్పాటు చేసిన గ్రూపులో జెన్నిఫర్ సభ్యురాలు. ‘‘ కొందరు ఈ బాధ నుంచి బైటపడలేరు. వారికి సాయం అందించాల్సి ఉంది. ‘‘ మీకు మేమున్నామని చెప్పాలని నేను భావిస్తున్నాను’’ అన్నారు జెన్నిఫర్.

ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న డిమాండే హత్యకు కారణమా?
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









