ఆంధ్రప్రదేశ్: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు అనుమతి.. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న ఎన్నికల కమిషనర్

ఏపీ ఎన్నికల అధికారి, ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతించింది. ప్రభుత్వ అభ్యంతరాలపై స్పందిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలను జరపాలని తెలిపింది.

ఫిబ్రవరి 4 నుంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 8న షెడ్యూల్ ప్రకటించిన తరువాత ప్రభుత్వం అందుకు అభ్యంతరం తెలిపింది. కోవిడ్ టీకాల పంపిణీ కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదంటూ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో, కోర్టు జనవరి 11న ఎస్ఈసీ ఆదేశాలను కొట్టి వేసింది.

ఆ నిర్ణయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అపీలుకు వెళ్లింది. ఎస్ఈసీ అపీలుపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసింది. మూడు రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం : రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హై కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఇంతకు ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అవుతామని కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
ఫొటో క్యాప్షన్, ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తాం: ఏపీ మంత్రి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతామని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

మరో మంత్రి కన్నబాబు కూడా, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గౌరవం ఉందని అంటూనే, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ స్వార్థ ప్రయోజనాలతో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు.

పదవీకాలం ముగిసేలోగా ఎన్నికలు జరపాలని ఆయన పట్టుదలతో ఉన్నారని అన్నారు. అందుకోసం ఆయన కరోనా వేళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు.

జగన్

ఫొటో సోర్స్, ysrcongressparty

షెడ్యూలు విడుదల తరువాత నాటకీయ పరిణామాలు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నడుమ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఫిబ్రవరి 5 నుంచి నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు.

అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వీలుకాదని ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు.

‘‘ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాదనతో మేం విభేదిస్తున్నాం. నిజానికి మొదట ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల కమిషనే’’అని లేఖలో ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు

ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు..

‘‘కోవిడ్-19 కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎన్‌డీఎంఏ)ను విధించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను మేం అనుసరిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కష్టం’’అని ఆదిత్యనాథ్ తెలిపారు.

‘‘రాష్ట్ర ప్రజలు ఒకవైపు కరోనావైరస్‌తో సతమతం అవుతుంటే మరోవైపు ఎన్నికలు నిర్వహించడం లేదని వ్యాఖ్యానించడం శోచనీయం. అనధికార సమాచార ప్రసార మార్గాలను రాజ్యాంగ సంస్థలు ఉపయోగించడం తగ్గించాలని మేం భావిస్తున్నాం’’.

‘‘ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇదివరకే సుప్రీం కోర్టు సూచించింది. కరోనావైరస్ కేసులు పెరగడంతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం కష్టమని మేం కూడా సూచించాం. కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండానే షెడ్యూల్ విడుదలచేశారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు

‘‘ప్రస్తుతం అధికారులంతా కోవిడ్-19 వ్యాక్సీన్ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం వీలుపడదు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల విషయంలో రాష్ట్రం నిబద్ధతతో కట్టుబడి ఉందని మేం పునరుద్ఘాటిస్తున్నాం. అయితే.. కరోనా వ్యాప్తి నడుమ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి’’అని ఆయన అన్నారు.

నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం ఆయనతో ఆదిత్యనాథ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ భేటీ అయ్యారు. ఎన్నికలు ప్రస్తుతం నిర్వహించలేమని వీరంతా నిమ్మగడ్డకు తెలియజేశారు.

అయితే, కోర్టు ఆదేశాలు, నిబంధనల మేరకు నడుచుకుంటానని చెబుతూ షెడ్యూల్‌ను నిమ్మగడ్డ విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)