డీడీసీ ఎన్నికల ఫలితాలు: జమ్ముకశ్మీర్‌లో 73 సీట్లతో అతి పెద్ద పార్టీగా బీజేపీ

కశ్మీర్ ఓటరు

ఫొటో సోర్స్, Getty Images

జమ్మూ కశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ)కి జరిగిన ఎన్నికల్లో 280 స్థానాలలో 73 స్థానాల్లో బీజేపీ గెలిచి రాష్ట్రంలో అతి పెద్ద ఏకైక పార్టీగా అవతరించిందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

అంతే కాకుండా, కశ్మీర్ లోయలో తొలిసారిగా బీజీపీ మూడు స్థానాలను గెలుచుకుంది.

మరోవైపు పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్‌కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) కూటమి 112 స్థానాలు గెలుచుకుని ఆధిక్యత సాధించింది.

ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలో ఏడు పార్టీల కూటమిగా పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్‌కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) ఏర్పడింది.

యూనియన్ టెరిటరీ ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం..పీఏజీడీ 100 సీట్లు గెలుచుకుంది. మరో 12 స్థానాల్లో ముందుంది.

47మంది స్వతంత్ర్య అభ్యర్ధులను విజేతలుగా ప్రకటించగా, మిగతా ఆరుగురు ఆధిక్యతలో ఉన్నట్లు సమాచారం.

జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ (జేకేఏపీ) 11 స్థానాలు గెలుచుకుంది.

కాంగ్రెస్ ఇప్పటివరకు 22 స్థానాలు గెలుచుకుంది. ఐదు స్థానాల్లో ఆధిక్యతలో ఉంది.

డీడీసీ ఎన్నికల ఫలితాలు జమ్మూ కశ్మీర్

ఫొటో సోర్స్, EPA/JAIPAL SINGH

కశ్మీర్ లోయలో తొలిసారి బీజేపీ

కాగా, కశ్మీర్‌ ప్రాంతంలో గత ఆరేళ్లలో తొలిసారి బీజేపీ ఎన్నికల్లో గెలుపొందింది.

శ్రీనగర్ శివారు ప్రాంతం బాలాహామ్, సరిహద్దు పట్టణం గురేజ్‌లోని తులాయిల్‌.. ఈ రెండు చోట్లా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.

డీడీసీ ఎన్నికల ఫలితాలు జమ్మూ కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికలు ఇవి. మొదటి దశ ఓటింగ్ నవంబర్ 28 న జరిగింది, 8వ, చివరి దశ ఓటింగ్ డిసెంబర్ 19వ తేదీన జరిగింది.

ఈ ఎన్నికలలో బీజేపీ, జమ్మూ కశ్మీర్ అపనీ పార్టీ (జేకేఏపీ) మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి.

ఈ ఎన్నికల్లో ఏడు పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), పీపుల్స్ కాన్ఫరెన్స్, సీపీఐ, సీపీఐఎం, అవామి నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జేకేపీఎం) కలిసి పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) ఏర్పాటు చేశాయి.

అయితే, ఈ కూటమిలో కాంగ్రెస్ భాగం కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)