మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీబీఐ కేసు ఎందుకు, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ చిక్కుల్లో పడినట్టేనా

rayapati sambashiva rao

ఫొటో సోర్స్, fb/Rayapati.TDP

    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

రెండేళ్ళ క్రితం వరకూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా కనిపించిన మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇప్పుడు సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారు.

మరోవైపు, పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఆయన సంస్థ ట్రాన్స్ ట్రాయ్ చేజారిపోయింది.

ఈ సంస్థకు సంబంధించిన లావాదేవీలతో పలు వివాదాలు వచ్చాయి.. తాజాగా ఆయన నివాసం, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు.

ఇంతకీ, రాయపాటి సాంబశివరావు మీద ఉన్న సీబీఐ కేసులు ఏంటి అనేది, ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రాయపాటి సాంబశివరావు సర్పంచ్ స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. ఐదు సార్లు పార్లమెంట్‌కి ఎన్నికయ్యారు. 1991, 1996, 2004,2009,2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున నర్సారావుపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

కేసు వివరాలు ఇవీ

వ్యాపారం పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించకుండా ఎగవేయడమే కాకుండా, తప్పుడు పత్రాలతో మోసాలకు పాల్పడ్డారంటూ 2019 డిసెంబర్ 30న సీబీఐ కేసు నమోదు చేసింది.

ఎఫ్ఐఆర్ RC.14(A)/2019 CBI/ACB/HYD హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నమోదయ్యింది. 2013 నుంచి 2017 మధ్య జరిగిన లావాదేవీల్లో జరిగిన అక్రమాలపై 2019 ఆగస్టు 8న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయ్యింది.

యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎస్‌కే నాయుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశామని సీబీఐ పేర్కొంది.

ఈ కేసులో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీతో పాటు చెరుకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, మరికొందరి పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరు బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు.

అందులో చెరుకూరి శ్రీధర్‌ను ట్రాన్స్ ట్రాయ్ ఎండీగా, రాయపాటి సాంబశివరావుని సంస్థ డైరెక్టర్ అండ్ ప్రమోటర్, చైర్మన్‌గా పేర్కొన్నారు.

ఈ కేసులో ఏ3గా ఉన్న రాయపాటి సహా నిందితులపై 120(బీ), రెడ్‌ విత్‌ 420, 406, 468, 477(ఏ), పీసీఐ యాక్ట్‌ 13(2), రెడ్‌ విత్‌ 13(1)డీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సంస్థ మరో డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస్‌ ఇందులో ఏ4గా కూడా ఉన్నారు.

సీబీఐకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సీబీఐకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు

అభియోగాలు ఇవే..

ఎఫ్ఐఆర్‌లో సీబీఐ ప్రస్తావించిన అంశాల ప్రకారం తాము చేపట్టబోయే కొన్ని ప్రాజెక్టులకు రుణం కావాలని ట్రాన్స్‌ ట్రాయ్ సంస్థ కొన్ని బ్యాంకుల్ని కోరింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఆ అప్పు ఇచ్చేందుకు అంగీకరించింది.

ఆ రుణాల కోసం తప్పుడు పత్రాలు, నకిలీ బ్యాలెన్స్‌ షీట్లు, మోసపూరిత స్టేట్‌మెంట్లు, తప్పుడు లెక్కల పుస్తకాలు, పత్రాలు చూపించారని కెనరా బ్యాంక్ ఆరోపించింది. ఈ సంస్థ వల్ల తమకు రూ.7,926 కోట్లు నష్టం వచ్చిందని సీబీఐకి ఫిర్యాదు చేసింది.

ట్రాన్స్‌ ట్రాయ్ వివిధ సందర్భాల్లో కొన్ని క్రెడిట్‌ లిమిట్స్‌ నుంచి రూ.264 కోట్లను వేరే ఖాతాలకు మళ్లించిందని బ్యాంకులు ఆరోపించాయి.

ఒకే మొత్తాన్ని వివిధ సందర్భాల్లో, వేరు వేరు ఖాతాల్లో చూపించి మోసం చేశారు అనేది ఆరోపణ. తమ దగ్గర తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా వేరే ఖాతాలకు మళ్లించారని, హైదరాబాద్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఫిర్యాదు చేసింది.

సీబీఐ ఎఫ్ఐఆర్ లో రాయపాటి పేరు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సీబీఐ ఎఫ్ఐఆర్ లో రాయపాటి పేరు

బ్యాంకు కుంభకోణాల్లో ఇదీ ఒకటి

దేశంలో బ్యాంకుల్లో జరిగిన భారీ కుంభకోణాలను గమనిస్తే, ట్రాన్స్ ట్రాయ్ కేసు కూడా వాటిలో ఒకటి అవుతుందని సీబీఐ లెక్కలు చెబుతున్నాయి.

సీబీఐ నివేదికల ప్రకారం నీరవ్ మోడీ రూ.6,000 కోట్లు, ఆయన బంధువు మెహూల్ చోక్సీ రూ.7,080.86 కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారనే అభియోగాలు ఉన్నాయి. వీరిద్దరు తీసుకున్న రుణాల మొత్తం రూ.13 వేల కోట్లు. ఇది దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ స్కామ్‌గా నిలిచింది.

ట్రాన్స్‌ ట్రాయ్ కేసులో రూ.7926 కోట్ల మేర అభియోగాలున్నాయి. ఈ సంస్థ 12 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్టు సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.

కన్సార్టియంగా ఉన్న కెనరా బ్యాంకుతోపాటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ కూడా ఆ సంస్థపై ఫిర్యాదు చేశాయి.

పలుమార్లు సోదాలు, కీలక ఆధారాలు సేకరణ ట్రాన్స్ ట్రాయ్ పేరుతో బ్యాంకులను మోసం చేసి, తీసుకున్న రుణాలు చెల్లించకుండా ఎగవేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో నమోదైన కేసులో రాయపాటి సాంబశివరావు సహా ఇతర నిందితుల వివరాలను సీబీఐ సేకరించింది.

ట్రాన్స్ ట్రాయ్ ప్రధాన కార్యాలయం సహా గుంటూరు, హైదరాబాద్‌లోని రాయపాటి కార్యాలయాలు, ఇళ్లలో కూడా తనిఖీలు చేసింది. పలు ఆధారాలు లభించినట్టు సీబీఐ అధికారికంగా వెల్లడించింది.

సీబీఐ

ఫొటో సోర్స్, Getty Images

రాయపాటి కుటుంబం సందేహాలు

అయితే, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవోగా పనిచేసిన శ్రీధర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని రాయపాటి కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఈ క్రమంలో రాయపాటి కుటుంబం ఆయనపై సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది. శ్రీధర్ ఫేక్ పాస్‌పోర్టుతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వారు సీబీఐకి సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రాయపాటి నివాసం, కార్యాలయంతోపాటూ, శ్రీధర్ ఇళ్లల్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నాయి. కొన్ని డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్కులు, పన్ను ఎగవేతకు సంబంధించిన నోటీసులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సీబీఐ మాత్రం వీటి గురించి అధికారికంగా ధృవీకరించలేదు.

సీబీఐతో పాటు బ్యాంకు అధికారులు కూడా..

హైదరాబాద్, గుంటూరులో తాజాగా ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో సీబీఐ అధికారులతోపాటూ బ్యాంకు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

కెనరా బ్యాంకు అధికారులు కూడా సీబీఐ బృందం వెంట ఉన్నారు. సీబీఐ సేకరించిన పత్రాలు, ఆధారాలను బ్యాంకు అధికారులు కూడా పరిశీలించినట్టు చెబుతున్నారు.

ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండడంతో వివరాలు వెల్లడించలేమని హైదరాబాద్ సీబీఐ అధికారులు బీబీసీకి తెలిపారు. ఈ కేసుపై స్పందించేందుకు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ట్రాన్స్ ట్రాయ్ ప్రతినిధులు కూడా నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)