ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి: మలేసియా మాజీ ప్రధాని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు- Newsreel

మహతిర్ మొహమ్మద్

ఫొటో సోర్స్, Getty Images

ఫ్రాన్స్‌లో కత్తి దాడుల నేపథ్యంలో మలేసియా మాజీ ప్రధాని మహతిర్ మొహమ్మద్ చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో కత్తిపోట్లకు ముగ్గురు ఫ్రెంచ్ పౌరులు మరణించిన కొద్ది గంటల్లోనే ట్విటర్ వేదికగా మహతిర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

కొద్దినెలల కిందట పదవి కోల్పోయిన 95 ఏళ్ల మహతిర్ మొహమ్మద్ వ్యాఖ్యలపై అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

‌నీస్‌లో జరిగిన దాడిని ఉగ్రవాద దాడిగా ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది.

మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''నీస్‌లోని చర్చిలో ఈ రోజు జరిగిన దాడి సహా ఫ్రాన్స్‌లో ఇటీవలి ఉగ్రవాద దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలకు, ఫ్రాన్స్ ప్రజలకు మా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్‌కు భారతో అండగా నిలుస్తుంది'' అంటూ మోదీ ట్వీట్ చేశారు.

ఘటనాస్థలం

ఫొటో సోర్స్, CHRISTIAN ESTROSI

ఫ్రాన్స్‌లో కత్తి దాడి.. ముగ్గురి మృతి

ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో చోటుచేసుకున్న కత్తి దాడిలో ముగ్గురు మృతిచెందారు.

ఈ దాడితో సంబంధం ఉన్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసీ తెలిపారు.

నోట్రడామ్ బేసెలికా సమీపంలో జరిగిన ఈ ఘటన ఉగ్రవాద దాడిలా అనిపిస్తోందన్నారు.

ఒక మహిళ తల నరికేశారని పోలీసులు తెలిపారు. ఈ దాడిని హత్యా కోణంలో ఫ్రాన్స్ విచారణ చేపడుతోంది.

అనుమానితుడు 'అల్లాహూ అక్బర్' అంటూ అని పదేపదే అన్నట్లు నీస్ మేయర్ తెలిపారు.

మృతుల్లో ఒకరు బేసెలికాలో కేర్‌టేకర్ అని పోలీసులు తెలిపారు.

కొద్ది రోజుల కిందట పారిస్‌లోనూ ఒకరి తలను నరికివేశారు.

వరవరరావు

ఫొటో సోర్స్, FACEBOOK/BHASKER KOORAPATI

వరవరరావు బెయిలు పిటిషన్‌పై వీలైనంత వేగంగా నిర్ణయం తీసుకోండి.. బాంబే హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన

ఈ ఏడాది మే నుంచి పెండింగులో ఉన్న విరసం నేత వరవరరావు బెయిలు అప్లికేషన్‌పై వీలైనంత వేగంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం బాంబే హైకోర్టుకు సూచించింది.

వరవరరావును నానావతి ఆసుపత్రి నుంచి ఎందుకు తరలించారని ఎన్ఐఏ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

వరవరరావు విడుదలకు సంబంధించిన పిటిషన్‌ను వీలైనంత వేగం విచారణకు వచ్చేలా చూడాలంటూ బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను సుప్రీంకోర్టు కోరినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ ట్వీట్ చేసింది.

వరవరరావు జీవితం, స్వేచ్ఛకు సంబంధిందించి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలుంటే వాటిని సవాల్ చేస్తూ ఆయన భార్య పిటిషన్ వేయొచ్చని సుప్రీంకోర్టు సూచించింది.

కాగా వరవరరావు భార్య తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు.

కేశూభాయ్ పటేల్

ఫొటో సోర్స్, @DDNewsGujarati

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ మృతి

బీజేపీ సీనియర్ నాయకుడు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ మృతి చెందారు.

శ్వాస తీసుకోవటం కష్టమవటంతో కేశూభాయ్‌ని అహ్మదాబాద్‌లోని స్టెర్లింగ్ ఆస్పత్రిలో చేర్చారని డీడీ న్యూస్ గుజరాతీ తెలిపింది.

అదే ఆస్పత్రిలో ఆయన గురువారం మధ్యాహ్నం కన్నుమూసినట్లు చెప్పింది.

ఆరుసార్లు గుజరాత్ ఎమ్మెల్యేగే గెలిచిన కేశూభాయ్ పటేల్ వయసు 92 సంవత్సరాలు.

ఆయన 1928లో జునాగఢ్ జిల్లాలోని విసావాదర్ పట్టణంలో పుట్టారు. 1945లో ఆర్ఎస్ఎస్‌ ప్రచారక్‌గా చేరారు. 1960ల్లో జన్‌సంఘ్ వ్యవస్థాపక సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.

1995లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆయన ఏడు నెలల తర్వాత శంకర్‌సింఘ్ వాఘేలా తీరుగుబాటు చేయటంతో రాజీనామా చేశారు.

1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిచిన తర్వాత కేశూభామ్ రెండోసారి సీఎం అయ్యారు. అయితే.. 2001లో ఆయన మళ్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

అప్పుడు నరేంద్రమోదీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.

కేశూభాయ్ 2012లో బీజేపీ నుంచి బయటకు వచ్చి గుజరాత్ పరివర్తన్ పార్టీ పేరుతో సొంత పార్టీ స్థాపించారు. కానీ ఆయన పార్టీ 2012 ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయింది.

అనంతరం మహాగుజరాత్ పార్టీని కలుపుకుని తన పార్టీని విస్తరించారు. అయితే.. 2014 ఫిబ్రవరిలో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

కోవిడ్ వ్యాక్సిన్ 'డిసెంబర్ కల్లా రెడీ'... ముందుగా వ్యాక్సిన్ పొందేవారి 'జాబితా సిద్ధం'

కోవిడ్ వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Reuters

ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ డిసెంబర్ కల్లా సిద్ధం కావచ్చునని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చెప్పింది.

బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయటానికి ఆస్ట్రాజెనెకా అనే ఫార్మా సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకుంది.

కరోనావైరస్‌ను ఎదుర్కోవటానికి తయారు చేస్తున్న ChAdOx1 Ncov-19 వ్యాక్సిన్ డిసెంబర్ కల్లా సిద్ధమయ్యే అవకాశం ఉందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ బుధవారం పేర్కొంది.

ఈ వ్యాక్సిన్‌కు భారతదేశంలో కోవిషీల్డ్ (Kovishield) అని పేరు పెట్టారు.

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ భారతదేశంలో ఈ వ్యాక్సిన్‌ తుది దశ ట్రయల్స్ నిర్వహిస్తోంది.

తాము ఉత్పత్తి చేయనున్న ఈ వ్యాక్సిన్ 10 కోట్ల డోసుల్లో తొలి బ్యాచ్‌ను 2021 రెండు లేదా మూడో త్రైమాసికం కల్లా అందించగలమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ ఆదార్ పూనావాలా ఎన్‌డీటీవీ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Reuters

''డిసెంబర్ కల్లా మా వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తవ్వాల్సి ఉంది. జనవరి కల్లా భారతదేశంలో వ్యాక్సిన్‌ను మేం అందుబాటులోకి తీసుకురావచ్చు'' అని ఆయన చెప్పారు.

అయితే.. బ్రిటన్‌లో పూర్తికావస్తున్న క్లినికల్ ట్రయల్స్ ఫలితాల మీద ఇది ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

కరోనావైరస్ విషయంలో రాబోయే మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంతరి హర్ష్ వర్ధన్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. పండుగల సీజన్ కారణంగా కోవిడ్ ముప్పు పెరిగే అవకాశం ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు తెలిపింది.

కోవిడ్‌ను ఎదుర్కోవటానికి తయారు చేస్తున్న తొమ్మిది వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ అడ్వాన్స్ దశలో ఉన్నాయని కూడా ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. వీటిలో మూడు భారతదేశంలో తయారవుతున్నట్లు చెప్పారు.

అలాగే.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక మొదట ఎవరికి అందించాలనే జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం తయారు చేసినట్లు మంత్రి తెలిపారు.

కోవిడ్ వ్యాక్సిన్‌ను ముందుగా ఇచ్చే వారి ఈ జాబితాలో డాక్టర్లు, వైద్య సహాయ సిబ్బంది, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)