జామీ లీవర్‌: తండ్రి జానీ లీవర్ అడుగుజాడల్లో కమెడియన్‌గా దూసుకెళుతున్న కూతురు

జామీ లీవర్

ఫొటో సోర్స్, JAMIE LEVER

    • రచయిత, మధుపాల్‌
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

బాలీవుడ్‌లో కమెడియన్‌గా తనదైన ముద్రవేశారు తెలుగు తేజం జానీ లీవర్‌. ఇప్పుడు ఆయన కూతురు జామీ లీవర్‌ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు.

2015లో కామెడీషో నటుడు కపిల్‌ శర్మ తీసిన సినిమా “కిస్‌ కిస్‌కో ప్యార్‌ కరూ’’లో ఆమె మొదట కనిపించారు. తర్వాత 2019లో "హౌస్‌ఫుల్ 4''లో కూడా నటించారు.

గతంలో కూతురు జామీ లీవర్‌తో కలిసి జానీ లీవర్‌ దేశ విదేశాలలో అనేక స్టేజ్‌షోలు చేశారు. అందులో చాలా సక్సెస్ అయ్యాయి కూడా.

“నాన్న ఇంట్లో ఉంటే చాలా సాదాసీదాగా ఉంటారు. బాల్యంలో తాను అనుభవించిన కష్టాల గురించి చెబుతుంటారు. కానీ స్టేజ్‌ మీద నేను ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఊరుకోరు. ఆయన పక్కన ఉంటే నేను భయపడిపోతాను’’ అని జామీ లీవర్‌ బీబీసీతో అన్నారు.

"స్టేజ్‌ మీద ఉన్నప్పుడు ఆయన నాకు తండ్రి కాదు. బాస్‌. బాస్‌ అంటే బాస్‌లాగానే సీరియస్‌గా ఉంటారు. వర్క్‌లో ఎక్కడా తేడా రానీయరు. ఆయన ఎంతో కష్టపడి పైకొచ్చారు. అందుకే నేను కూడా స్టేజ్‌ మీదకు వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు రిహార్సల్స్‌ చేసుకుని వెళతాను. ఎక్కడా తప్పుదొర్లకుండా జాగ్రత్త పడతాను’’ అని జామీ చెప్పారు.

తండ్రి దగ్గర శిక్షణ తీసుకునేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు జామీ. “నేను ప్రాక్టీస్‌ చేసేటప్పుడు ఆయన పరిశీలించేవారు. ఆయన ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌లు కనిపించేవి కావు. అర్ధం చేసుకుని పని చేయమని చెప్పేవారు. ఒక్కోసారి నేను ఏడ్చేదాన్ని. కానీ అలా ఎంతో కష్టపడి నేర్చుకోవడం నాకు ఎంతో మేలు చేసింది’’ అని జామీ బీబీసీతో అన్నారు.

పని విషయంలో తండ్రి ఎంతో సీరియస్ గా ఉంటారని జామీ అన్నారు

ఫొటో సోర్స్, Jamie Lever

ఫొటో క్యాప్షన్, పని విషయంలో తండ్రి ఎంతో సీరియస్ గా ఉంటారని జామీ అన్నారు

క్రియేటివిటీపై ఆసక్తి

ముంబైలో చదువుకున్న జామీ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. తర్వాత లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ యూనివర్సిటీలో మార్కెటింగ్‌ కమ్యూనికేషన్‌ చేశారు. 2012లో లండన్‌లోని ఓ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. కానీ తర్వాత వాటన్నింటిని వదిలేసి నటనలోకి వచ్చారు.

ఇంత చదువుకున్న ఆమె స్టాండప్‌ కామెడీ ఎందుకు చేయాలనుకున్నారు ? దానికీ సమాధానం ఉందంటారు జామీ.

జామీ లీవర్

ఫొటో సోర్స్, JAMIE LEVER

"చిన్నప్పటి నుంచి నాకు స్నేహితులు, ఉపాధ్యాయులు, బంధువులను అనుకరించడం ఇష్టం. నా తల్లిదండ్రులు నా అభిరుచిని గమనించారు. అయితే ముందు చదువులు పూర్తి చేయాలని కోరుకున్నారు’’ అని వెల్లడించారు జామీ .

"నేను లండన్‌లో ఉన్నప్పుడు సంతోషంగా లేను. నేను కోరుకున్న పని చేయాలని బాగా అనిపించేది. కొత్తదనంతో ఏదైనా చేయాలని అనుకునేదాన్ని. అందుకే లండన్‌ వదిలి ముంబై వచ్చాను’’ అని చెప్పారామె.

సృజనాత్మక రంగంపై ఆసక్తితోనే లండన్ జాబ్ వదిలి ముంబై వచ్చానంటారు జామీ

ఫొటో సోర్స్, Jamie Lever

ఫొటో క్యాప్షన్, సృజనాత్మక రంగంపై ఆసక్తితోనే లండన్ జాబ్ వదిలి ముంబై వచ్చానంటారు జామీ

తనకంటూ గుర్తింపు

జామీ కూడా జానీ లీవర్‌లాగానే స్వయంకృషితో కెరీర్‌ను ప్రారంభించారు. తన తండ్రి పేరును ఎక్కడా వాడలేదు. ముందు స్టేజ్‌ షోలు ఇచ్చారు. టీవీ షోలో కనిపించారు. యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఆ పై సినిమాల్లో పని చేయడం మొదలు పెట్టారు.

“నన్ను ఎవరూ సిఫారసు చేయలేదు. నేను ఎవరి సహాయం కోరలేదు. నా మార్గాన్ని నేనే నిర్మించుకున్నాను’’ అని వివరించారు జామీ.

జామీ లీవర్

ఫొటో సోర్స్, JAMIE LEVER

నటీనటులను అనుకరించే అనేక మగ కళకారులు కనిపిస్తారు. కానీ మహిళల్లో అలా రాణించిన వారు చాలా కొద్దిమందే ఉన్నారు. వారిలో జామీ ఒకరు. ఏ నటుడి నటన ఎలా ఉంటుందో ఆమె పర్‌ఫెక్ట్‌గా అనుకరించి చూపిస్తారు.

" ఆర్టిస్టులను అనుకరించాలంటే చాలా ప్రాక్టీస్‌ కావాలి. నేను వారి వీడియోలు రెండు, మూడు వారాలపాటు చూస్తాను. ఎక్కడ అవార్డు ఫంక్షన్‌ జరిగినా వెళ్లి నటీనటులను గమనిస్తాను. అవతలి వ్యక్తిని ఆవాహన చేసుకోవాలని, అప్పుడే వారిలాగా చేయగలుగుతామని నాన్న చెబుతూ ఉంటారు’’ అన్నారు జామీ.

జామీ లీవర్

ఫొటో సోర్స్, JAMIE LEVER

రాత్రికి ఫోన్‌ రాకుండా జాగ్రత్తలు

జామీ అనేక స్టేజ్‌షోలు, అవార్డ్‌ ఫంక్షన్లలో పాల్గొని ఆర్టిస్టులను అనుకరిస్తూ షోలు చేసేవారు.“ నేను ఏ నటుడిని అనుకరించినా రాత్రి అతని నుంచి కాల్ రాకుండా జాగ్రత్త పడేదాన్ని. ఎవరినీ బాధించకుండా నా షోలు నడిపిస్తాను’’ అని జామీ చెప్పారు. “వ్యక్తిగత జీవితం గురించి నేను ఎక్కువగా మాట్లాడను’’ అంటారామె.

“ఎవరినీ కాపీ చేయవద్దని, అవమానించ వద్దని నాన్న చెబుతుంటారు. సొంతంగా పని చేసే వారిని భారతీయ ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని ఆయన అంటారు. అందుకే నేను మరింత బాధ్యతతో నా పని చేస్తుంటాను’’ అని జామీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)