బాలీవుడ్: నిన్నటి వరకూ ముక్కలుగా ఉన్న సినీ పరిశ్రమ ఇప్పుడు ఒక్కటెలా అయింది?

షారుఖ్, సల్మాన్, ఆమిర్

ఫొటో సోర్స్, BBC

ఫొటో క్యాప్షన్, షారుఖ్, సల్మాన్, ఆమిర్
    • రచయిత, ఇక్బాల్ పర్వేజ్
    • హోదా, బీబీసీ కోసం

రిపబ్లిక్ టీవీకి చెందిన ఆర్ణబ్ గోస్వామి, ప్రదీప్ భండారీ, టైమ్స్ నౌకు చెందిన రాహుల్ రవిశంకర్, నవికా కుమార్‌పై హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియా సహా నాలుగు అసోసియేషన్లు, 34 మంది సినీ ప్రముఖులు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బాలీవుడ్‌పై బాధ్యతారహితంగా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా వీరిని అడ్డుకోవాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు.

పిటిషన్ వేసినవారిలో కరణ్ జోహార్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, విశాల్ భరద్వాజ్, అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి నిర్మాణ సంస్థలు ఉన్నాయి.

వీరితోపాటూ యశ్ రాజ్ ఫిల్మ్స్, వినోద్ చోప్రా ఫిల్మ్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, సినీ-టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ద ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ అన్నీ కలిసి పిటిషన్ వేశాయి.

బాలీవుడ్‌పై, అందులో పనిచేస్తున్న వారిపై అభ్యంతరకరంగా, బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశారని, మీడియా ట్రయల్ చేశారని వీరు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాలీవుడ్

ఫొటో సోర్స్, Prodip Guha/Getty Images

ఏకమైన ఇండస్ట్రీ ప్రముఖులు

ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా రోజుల తర్వాత ఏకమై ఒకే వేదిక మీద నిలబడినట్లు కనిపిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఏకపక్ష ప్రచారానికి వ్యతిరేకంగా వీరంతా కలిసి నిలిచారు.

బాలీవుడ్‌ సుశాంత్ మృతి తర్వాత, అంతకు ముందు గత కొన్నేళ్లుగా రెండు గ్రూపులుగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ గ్రూపుల గొడవ గత మూడున్నర నెలలుగా పతాకస్థాయికి చేరినట్లు టీవీ చానళ్లలో కనిపించింది. గత వారం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి మిస్టరీ విడిపోయేవరకూ అది కొనసాగింది.

ఎయిమ్స్ సహా సీబీఐ కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్యకు గురికాలేదని చెప్పాయి.

ఆర్ణబ్ గోస్వామి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్ణబ్ గోస్వామి

ఎయిమ్స్ రిపోర్ట్ మీద నటి స్వరా భాస్కర్ వ్యంగ్యంగా “ఇప్పుడు సీబీఐ, ఎయిమ్స్ కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి సూసైడ్ అనే నిర్ణయానికి వచ్చాయి. కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేయబోతున్నారా” అని ట్వీట్ చేశారు.

దీనికి సమాధానం ఇచ్చిన కంగన “ఇది నా ఇంటర్వ్యూ, జ్ఞాపకశక్తి బలహీనంగా ఉంటే మళ్లీ చూడు. ఇందులో నేను ఒక్క అబద్ధపు ఆరోపణ చేసినా, నా అవార్డులన్నీ తిరిగిచ్చేస్తాను. ఇది ఒక క్షత్రియ వాగ్దానం. రామ భక్తురాలిని, ప్రాణం పోయినా మాట తప్పను” అన్నారు.

రియా చక్రవర్తి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రియా చక్రవర్తి

రియా మీడియా ట్రయల్

సుశాంత్ మృతికి ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తే కారణమని చెప్పడానికి భారత మీడియాలోని ఒక పెద్ద వర్గం ప్రయత్నించింది. మరోవైపు ఆమెపై మీడియా ట్రయల్ కూడా జరిగింది.

డ్రగ్స్ కేసులో రియా జైలుకు కూడా వెళ్లింది. కానీ, కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చాక ఫర్హాన్ అక్తర్ ఒక ట్వీట్ చేశాడు.

“రియా, ఆమె కుటుంబంపై ఆరోపణలు చేసిన ఆ యాంకర్స్ క్షమాపణ అడుగుతారా, నాకైతే అనిపించడం లేదు. కానీ, ఇప్పుడు వారు గోల్‌ పోస్ట్ షిఫ్ట్ చేయడం కచ్చితంగా చూడాలి. వాళ్లు దానికి ప్రసిద్ధులు” అన్నారు.

నిజానికి, సుశాంత్ మృతి తర్వాత బాలీవుడ్‌లో ఒకరకమైన కలకలం రేగింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరి మృతి గురించి ఈ స్థాయిలో ఎప్పుడూ పరస్పర ఆరోపణలు జరగలేదు. కానీ ఈసారీ దానికి విరుద్ధంగా కనిపించింది.

ఒక విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ రెండుగా చీలిపోయినట్లు కనిపించింది. సుశాంత్ మృతి తర్వాత ముంబయి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత ఈ కేసులో బిహార్ పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు.

తర్వాత ఈ మృతి కేసును సీబీఐకి అప్పగించారు. మీడియాలోని ఒక పెద్ద వర్గం ఒక్క రోజు కూడా ఈ కేసును తమ స్క్రీన్ నుంచి, పేజీల్లోంచి పక్కకు పెట్టలేదు.

సుశాంత్ కేసులో ఎంతోమందిని విచారించారు

మృతి దర్యాప్తు ఆత్మహత్య దిశగా ఉన్నంతవరకూ కంగన, దానికి నెపోటిజం యాంగిల్ జోడిస్తూ వచ్చారు. బాలీవుడ్‌ పెద్దలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని కలకలం రేపారు.

దీంతో ఈ కేసులో చాలా మందిని విచారించారు. తర్వాత హత్య యాంగిల్లో కూడా దర్యాప్తు జరిగింది. అది చివరికి డ్రగ్స్ కేసుల వరకూ వెళ్లింది.

బాలీవుడ్

ఫొటో సోర్స్, Getty Images

బాలీవుడ్ పొలిటికల్ కనెక్షన్

కొన్నేళ్ల క్రితం, మోదీ ప్రభుత్వం ముందు వరకూ బాలీవుడ్‌లో చాలా మంది నటులు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలుగా సభల్లో ఉన్నారు. కానీ ఎప్పుడూ వారిలో రాజకీయ అంశాల గురించి ఇలా పరస్పర ఆరోపణలు చేసుకోలేదు.

కానీ ఇటీవల ఏళ్లలో ఇండస్ట్రీలోని రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఎక్కువగా కనిపిస్తోంది.

ఇండస్ట్రీలోని కొంతమంది దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు.

ఫిల్మ్, టీవీ నటుడు సుశాంత్ సింగ్ దీనిపై మాట్లాడుతూ "నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నది నిజమైన చర్చలా అనిపించడం లేదు, ఇది సృష్టించిన చర్చ, దీనిని పోలరైజేషన్ చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించారు. మొత్తం ప్రపంచంలో ఇలాగే జరుగుతోంది" అన్నారు.

మరోవైపు మహాభారతంలో భీష్ముడు, శక్తిమాన్ లాంటి పాత్రలు పోషించిన ముకేష్ ఖన్నా చిత్ర పరిశ్రమ ఎప్పుడూ చీలిపోలేదంటున్నారు.

“మా ఇండస్ట్రీలో ఎప్పుడూ విడిపోలేదు. మేం ఒక కుటుంబంలా ఉన్నాం. ఇండస్ట్రీ విడిపోయినట్లు నాకు అనిపించడం లేదు. సుశాంత్ కేసులో డ్రగ్స్ అంశం బయటపడింది. నేను డ్రగ్స్ ఇండస్ట్రీలో ఉన్నాయి, వాటిని అంతం చేయాలి అంటున్నాను. ఇండస్ట్రీలో డ్రగ్స్ లేవని ఎవరూ రాసి ఇవ్వలేరు” అన్నారు.

కంగన రనౌత్

ఫొటో సోర్స్, Prodip Guha/Getty Images

ఫొటో క్యాప్షన్, కంగన రనౌత్

మూడో గ్రూప్ కూడా ఉంది

డ్రగ్స్ అంశంపై జయా బచ్చన్ పార్లమెంటులో మాట్లాడినపుడు కంగనా రనౌత్ ఆమెను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు.

ఈ విషయంలో ఒక వైపు కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ రవి కిషన్ లాంటి వారు ఒక వైపు నిలిస్తే. జయా బచ్చన్, అనురాగ్ కశ్యప్ లాంటి వారు మరోవైపు కనిపించారు.

అనురాగ్ మొదటి నుంచీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఆయన్నుసమర్థిస్తూ ఎవరూ ఎలాంటి ప్రకటనలూ చేయలేదు.

మరోవైపు కంగనా రనౌత్‌కు వై కేటగిరీ భద్రత అందించారు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వానికి ఆమె వ్యతిరేకంగా మాట్లాడ్డంతో బీజేపీకి ఒక ముఖం దొరికినట్లు అనిపించింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

కానీ, బాలీవుడ్‌లో మూడో గ్రూపు కూడా కనిపిస్తుంది. అది ఎవరితోనూ కలిసి గానీ, దూరంగా కానీ ఉన్నట్టు కనిపించరు

ఈ గ్రూపులో కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, సాజిద్ నడియాడ్ వాలా, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి ప్రముఖులు ఉన్నారు.

ఈ గ్రూపును బాలీవుడ్ క్రీమ్ అంటారు. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయిలో ఉండే ఇది ఎలాంటి రాజకీయాల్లో చిక్కుకోకుండా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.

ఏ ప్రభుత్వం మారినా, వీరంతా ఆ ప్రభుత్వాలతో కొనసాగడానికి కారణం అదే.

సల్మాన్ ఖాన్ ఒక్కోసారి నరేంద్ర మోదీతో గాలిపటాలు ఎగరేస్తూ కనిపిస్తారు, మరోవైపు ఉద్ధవ్ ఠాక్రేతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాజ్ ఠాక్రేతో సల్మాన్ స్నేహం కూడా పాతదే.

కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల్లో ఉన్న అమితాబ్ బచ్చన్ గుజరాత్ టూరిజానికి ప్రచారం చేస్తున్నారు.

కరణ్ జోహార్, పీఎం మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెబితే, సినీరంగంలో కరణ్ జోహార్ భాగస్వామ్యం గురించి ఆయన కూడా ప్రశంసిస్తుంటారు.

కానీ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత వీరందరిపై ఏ స్థాయిలో బురద చల్లారంటే, ఇప్పుడు వీరు కూడా ఒక గ్రౌండ్ పట్టుకున్నారు.

ఇప్పుడు, బాలీవుడ్‌ను మరోసారి ఒకే గాటన కట్టేందుకు ప్రయత్నిస్తున్నారనడానికి ఆధారంగా 34 మంది దిగ్గజాలు ఒక్కటై కోర్టుకెక్కడం మన కళ్లెదుటే కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)