నేడు దిల్లీకి జగన్.. అమిత్ షాతో భేటీ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/ysrcp
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్లనున్నారని 'సాక్షి' కథనం తెలిపింది.
''దేశ రాజధానిలో జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అధికార సీఎం వైఎస్ జగన్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీకి బయలు దేరనున్నారు. సాయంత్రం దిల్లీలో అమిత్ షా తో భేటీ కానున్నారు.
రాత్రి దిల్లీలో బస చేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు.
గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొంటార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
‘బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు.. 'డి' అంటే దీపికా పదుకోణ్’
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి దీపికా పదుకోణ్ పేరు బయటికి వచ్చినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
‘‘బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. పెద్ద పెద్ద స్టార్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోమవారం టాలెంట్ మేజేజర్ జయా సాహాను విచారించగా ప్రముఖ నటి దీపికా పదుకోణ్ పేరు తెరపైకి వచ్చింది’’ అని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.
జయ వాట్సాప్ చాట్ సమాచారాన్ని బట్టి దీపిక, ఆమె మేనేజర్ కరిష్మా డ్రగ్స్ గురించి ఆమెతో చర్చించినట్టు అధికారులు భావిస్తున్నారని ఆ కథనంలో రాశారు.
‘‘చాటింగ్‌లో ఉన్న కోడ్ భాషలో ‘డీ’ అంటే దీపిక అని, ‘కే’ అంటే కరిష్మా అని అనుమానిస్తున్నారు.
ఎన్‌సీబీ దీపికా మేనేజర్ కరిష్మాకు సమన్లు జారీ చేసింది. జయా సాహా ఇచ్చిన సమాచారాన్ని బట్టి నిర్మాత మధు మంతెనకు కూడా సమన్లు జారీ చేసింది.
డ్రగ్స్ కేసు విచారణలో ఇప్పుడు రియాతో పాటు జయా సాహా కూడా అత్యంత కీలకంగా మారారు.
దీపిక, శ్రద్ధాకపూర్‌లకు ఈ వారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయనున్నట్టు సమాచారం అందింద’’ని కథనంలో తెలిపారు..
వీరితో పాటు రకుల్‌ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబాటాలకు ఈ వారంలో సమన్లు జారీ చేయనున్నట్టు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా చెప్పారని నమస్తే తెలంగాణ చెప్పింది..

ఫొటో సోర్స్, Tsmsidc
గాంధీ ఆస్పత్రిలో త్వరలో నాన్ కోవిడ్ వైద్య సేవలు
నాన్ కోవిడ్ వైద్య సేవలకు గాంధీ ఆస్పత్రి సిద్ధమవుతోందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
‘‘గాంధీ ఆస్పత్రి నాన్ కొవిడ్ వైద్య సేవలకు సన్నద్ధమవుతోంది. మునుపటిలా సాధారణ సేవలను అందించే దిశగా వైద్యాధికారులు దృష్టి సారించారు.
ఒకవైపు కోవిడ్ రోగులకు చికిత్సలు అందిస్తూనే.. మరోవైపు అన్ని వ్యాధులకు చికిత్సలు అందించాలని యోచిస్తున్నారు.
మార్చి 2న గాంధీ ఆస్పత్రిలో మొదటి కరోనా కేసును అడ్మిట్ చేసుకొని చికిత్సలు ప్రారంభించగా, ఆ తర్వాత క్రమక్రమంగా కరోనా ఉద్ధృతి పెరగడంతో ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా ప్రకటించి నోడల్ వైద్యకేంద్రంగా తీర్చిదిద్దారు.
ఆ తరువాత ఫీవర్, కింగ్‌కోఠి, చెస్ట్ ఆస్పత్రి, టిమ్స్.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఎక్కడికక్కడ జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా సేవలు అందిస్తుండడంతో కొంతమేరకు గాంధీ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గింది. సోమవారం నాటికి గాంధీలో 664 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా,
ఆ సంఖ్య 300 మందికి తగ్గగానే సాధారణ వైద్య సేవలను అందించాలని సన్నాహాలు చేస్తున్నట్లు గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు.
కోవిడ్ బాధితులకు ప్రత్యేక బ్లాక్‌లు ఏర్పాటు చేసి వారు మరో మార్గం ద్వారా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేయనున్నారు’’ అని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, AFP
రఫేల్ విమానం నడపనున్న మహిళా పైలెట్
భారత వైమానిక దళంలోని రఫేల్ జెట్లను మహిళా పైలెట్లు నడపనున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది.
‘‘వైమానిక దళంలో ఇటీవలే చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి త్వరలో మహిళా పైలట్ ఒకరు చేరనున్నారు.
మిగ్–21 ఫైటర్ జెట్ల మహిళా పైలట్ ఒకరు అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఎంపికయ్యారని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధికారి ఒకరు తెలిపారు.
రఫేల్ ఫైటర్ జెట్ పైలట్ కోసం చేపట్టిన అత్యంత కఠినమైన పరీక్షల్లో ఎంపికయిన ఈ మహిళా పైలట్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని ఆ అధికారి వెల్లడించారు.
అత్యంత సమర్థమైనవిగా పేరున్న రఫేల్ యుద్ధ విమానాలకు మహిళా పైలట్ ఎంపిక కావడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని పేరు వెల్తడించటానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
2018లో యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళా పైలట్‌గా అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించారు.
అప్పట్లో ఆమె మిగ్–21 బైసన్ విమానాన్ని సొంతంగా నడిపారు. యుద్ధ విమానాల కోసం ప్రయోగాత్మకంగా మహిళలను ఎంపిక చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు.. 2016 జూలైలో ఎంపికైన ముగ్గురు మహిళల బృందంలో ఈమె కూడా ఒకరు.
మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో 10 మంది మహిళా పైలట్లు, సహాయకులుగా మరో 18 మంది ఉన్నార’’ని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
4 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి
సోమవారం స్టాక్ మార్కెట్లు కుదేలవడంతో 4 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైందని ఈనాడు సహా ప్రధాన పత్రికలన్నీ కథనాలు ప్రచురించాయి.
‘‘కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మదుపరికి సోమవారం ఊహించని షాక్ తగిలింది. ఐరోపాలో కరోనా కేసులు విజృంభించడం, మరోదఫా లాక్‌డౌన్ విధించొచ్చన్న భయాలతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
ఈ సెగ మన సూచీలకూ తగిలింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలూ తోడవడంతో దేశీయ మదుపరికి కన్నీరే మిగిలింది. ఈ కన్నీటి విలువ.. రూ.4.23 లక్షల కోట్లు.
కరోనా నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్ విధించొచ్చన్న అంచనాలు మదుపర్లను కలవరపెట్టాయి.
ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు కుదేలయ్యాయి.. దేశీయంగా మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో, సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికి పైగా నష్టపోయాయి.
బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.4.24 లక్షల కోట్లు పతనమై రూ.154.76 లక్షల కోట్లకు చేరింద’’ని ఈనాడు వివరించింది.
ఇవి కూడా చదవండి:
- సముద్రపు దొంగలను పట్టిస్తున్న అరుదైన పక్షి ఇది..
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. వాటి వల్ల రైతులకు లాభమా, నష్టమా?
- 40 ఏళ్ల కిందట చోరీ అయిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా దొరికాయి?
- హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ నిరాకరించిందా? Fact Check
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- భారతదేశంలో అసలు కరోనావైరస్ కేసుల సంఖ్య 10 కోట్లు దాటిపోయిందా?
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








