కరోనావైరస్ - బిహార్‌: 'ఇది హత్య... నన్ను కాపాడండి'

బిహార్ ఇంకా ఎక్కువగా పరీక్షలు చేయాలని నిపుణులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిహార్ ఇంకా ఎక్కువగా పరీక్షలు చేయాలని నిపుణులు చెబుతున్నారు
    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తీవ్రంగా ఛాతి నొప్పి వస్తోందని జులై 18న గోపాల్ సింగ్ చెప్పినప్పుడు అతడి కుటుంబం చాలా కంగారు పడింది. 65 ఏళ్ల గోపాల్‌కు శ్వాసకోశ సమస్యలున్నాయి. 2013లో ఆయనకు గుండె పోటు కూడా వచ్చింది.

ఆయనకు వెంటనే కరోనావైరస్ పరీక్ష చేశారు. పాజిటివ్ అని వచ్చింది. ఆయనను వెంటనే ఉత్తర బిహార్‌లోని కటిహార్‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి డాక్టర్ ఆయనను ఇంటికి తీసుకుపొమ్మని సూచించారు. దీంతో విశాల్‌కు ఏం చేయాలో అర్థంకాలేదు.

''మా నాన్నకు గతేడాది తీవ్రమైన న్యుమోనియా వచ్చింది. ఆయనకు ఇప్పుడు మరణ ముప్పు చాలా ఎక్కువగా ఉంది'' అని విశాల్ చెప్పినా డాక్టర్ స్పందనలో ఎలాంటి మార్పురాలేదు.

గోపాల్ కోసం ఇంటిలో ఓ ఆక్సీజన్ సిలెండర్‌ను కుటుంబం ఏర్పాటుచేసింది. మరోవైపు వేరే ఆసుపత్రులకు విశాల్ పరుగులు పెట్టారు. ఎక్కడా బెడ్లు ఖాళీగా లేవు.

ఆ తర్వాతి 24 గంటల్లో... గోపాల్ రక్తంలో ఆక్సీజన్ స్థాయి క్రమంగా పడిపోతూ వచ్చింది. మరోవైపు ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ ఖాళీగా ఉందని విశాల్‌కు సమాచారం అందింది.

తల్లిదండ్రులతో విశాల్
ఫొటో క్యాప్షన్, విశాల్ (ఎడమ) తల్లి, తండ్రి గోపాల్ సింగ్

అయితే, ఆ ఆసుపత్రి 90 కి.మీ. దూరంలో ఉంది. అంబులెన్స్‌లో తండ్రిని పెట్టుకొని విశాల్ ఆ ఆసుపత్రికి బయలుదేరారు.

కానీ, ఆసుపత్రి సమీపిస్తున్న సమయంలో సిలెండర్‌లో ఆక్సీజన్ అయిపోయింది. వెంటనే భయంతో విశాల్ ఆసుపత్రికి ఫోన్‌చేసి గేటు దగ్గర ఆక్సీజన్ సిలెండర్ అందుబాటులో ఉంచాలని అభ్యర్థించారు.

వారు గేటు దగ్గరకు చేరుకున్నా అక్కడ ఎవరూ కనపడలేదు. అంతేకాదు లోపలికి వెళ్తే ఐసీయూ బెడ్‌లు ఖాళీలేవని వారికి చెప్పారు. గోపాల్‌ను ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్లమని సూచించారు.

ఆ వార్డు మూడో అంతస్థులో ఉంది. లిఫ్టు పనిచేయడం లేదు. దీంతో గోపాల్‌ను స్ట్రెచర్‌పై పడుకోబెట్టి విశాల్, 60ఏళ్ల వయసున్న అతడి తల్లి మోసుకెళ్లారు. గోపాల్‌ను చూసేందుకు డాక్టర్లు, నర్సులు రాలేదని విశాల్ చెప్పారు.

నలందా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఆక్సీజన్ సిలెండర్‌ను మోసుకెళ్తున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నలందా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఆక్సీజన్ సిలెండర్‌ను మోసుకెళ్తున్న మహిళ

వార్డు బయట అతడికి పది సిలెండర్లు కనిపించాయి. అయితే ఎందులోనూ గ్యాస్ లేదు. రాత్రంతా సిలెండర్లు మార్చి మార్చి విశాల్ ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తెల్లవారగానే గోపాల్‌ను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే బయల్దేరిన గంట సేపటికే ఆయన మరణించారు.

''ఆయన్ను కాపాడేందుకు చేయాల్సిందంతా చేశాం. కానీ ఆసుపత్రులు మమ్మల్ని ఓడించాయి. ఆయన చనిపోలేదు. ఇది హత్య. నన్ను కాపాడండి అని ఆయన చాలాసార్లు అడిగారు. ఆయన చాలా భయపడ్డారు'' అని విశాల్ వివరించారు.

''ఆయన చివరి చూపులను నేనెప్పటికీ మరచిపోలేను''

కోవిడ్-19పై పోరాటంలో పేద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్ ఎదుర్కొంటున్న సవాళ్లకు గోపాల్ మృతి ఓ సాక్ష్యం లాంటిది.

ప్రణాళికల్లోనే లోపం

ఇప్పటివరకు బిహార్‌లో 33,000కుపైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం జులైలో వచ్చినవే. అయితే ఇక్కడ నమోదైన మరణాలు తక్కువే(217). ఇటవల కేసులు విపరీతంగా పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్ (884) కంటే ఇక్కడ మృతులు చాలా తక్కువగా ఉన్నాయి.

అయితే, ఈ గణాంకాలు వేగంగా మారతాయని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్య సదుపాయాలు సరిపడాలేవని వివరిస్తున్నారు.

ఇప్పటికీ 40 శాతానికిపైగా ఆరోగ్య సిబ్బంది పదవులు ఖాళీగా ఉన్నాయని బిహార్‌లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సెక్రటరీ డాక్టర్ సునీల్ కుమార్ వివరించారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు అభ్యర్థనలు పెట్టినా ఎలాంటి స్పందనా రాలేదని ఆయన వివరించారు.

బిహార్‌లో వేగంగా పెరుగుతున్న కేసులు

''త్వరలో కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగబోతున్నాయని మనకు తెలుసు. కానీ ఇక్కడ ఎలాంటి భారీ ప్రణాళికలూ లేవు'' అని ఆయన వివరించారు.

''బిహార్‌లోని చాలా జిల్లాల్లో సరిపడా వెంటిలేటర్లు లేవు. కోవిడ్-19 అత్యవసర కేసుల్లో వెంటిలేటర్లే కీలకం.''

''వెంటిలేటర్‌ను ఆపరేట్‌చేసే డాక్టర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఉండాల్సింది'' అని కుమార్ వ్యాఖ్యానించారు.

అయితే తమ విషయంలో ఎలాంటి అలసత్వమూ లేదని ప్రభుత్వం వెల్లడించింది. చాలా వేగంగా అదనపు ఆరోగ్య సదుపాయాలను సమకూరుస్తున్నట్లు పేర్కొంది.

అయితే, బిహార్‌ సవాళ్లు ప్రత్యేకమైనవి. ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య సేవల నెట్‌వర్క్ చాలా బలహీనంగా ఉంటుంది. దశాబ్దాల నుంచి దీన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. చాలా రాష్ట్రాలు ఈ నెట్‌వర్క్‌ను పరీక్షల నిర్వహణ, కేసులను ట్రాక్ చేయడానికి, ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉపయోగించుకున్నాయి.

మరోవైపు ఇక్కడ ప్రధానమైన ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రులు కూడా తక్కువే. రోగులను చేర్చుకోవడంలో ఆలస్యం కావడంతో దిల్లీ, ముంబయి లాంటి నగరాల్లో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. అదే విధంగా బిహార్‌లోనూ జరిగితే మరణాలు విపరీతంగా పెరిగే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో చాలా చోట్ల వరదలు మొదలయ్యాయి. ఇవి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి.

వేగంగా వ్యాప్తి

పెరుగుతున్న కేసులను చూస్తుంటే వైరస్ వేగంగా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నట్లు తెలుస్తోందని డాక్టర్ కుమార్ వివరించారు.

బిహార్ ఇప్పుడు టెస్టుల సంఖ్యను పెంచింది. అయినప్పటికీ టెస్టింగ్ రేటు చాలా తక్కువగా ఉంది. మిలియన్ జనాభాకు బిహార్ 3,500 పరీక్షలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ 28,000 టెస్టులు చేస్తోంది. వనరులు, జనాభాతో బిహార్ పోటీపడే ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా పది లక్షల జనాభాకు 7,000కుపైగానే టెస్టులు చేస్తున్నారు.

ప్రస్తుతం బిహార్ రోజుకు 10,000 పరీక్షలు చేస్తోంది. పది కోట్ల మంది జనాభాతో పోలిస్తే.. ఈ టెస్టులు చాలా తక్కువని డాక్టర్ కుమార్ వివరించారు.

టెస్టుల సంఖ్య

''అంటే చాలా మంది వైరస్ సోకినవారు పరీక్షలు చేయించుకోకుండా.. వైరస్‌ను ఇతరులకు వ్యాపించేలా చేస్తున్నారు''

మే, జూన్ నెలల్లో కేసులు విపరీతంగా పెరిగిన దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి బిహార్ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ఏప్రిల్, మే నెలల్లో అమలుచేసిన లాక్‌డౌన్‌లో ఆరోగ్య సదుపాయాలను సమకూర్చుకుని ఉండాల్సింది.

అయితే, వారు వేగంగా స్పందించలేదు. టెస్టుల సంఖ్యా పెంచలేదు. దీంతో జూన్ వరకు అతి తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో బిహార్ ఒకటిగా ఉంది.

లాక్‌డౌన్ ఎత్తివేయడంతో సొంత రాష్ట్రమైన బిహార్‌కు వచ్చిన వలస కార్మికులతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

నలందా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ప్రాంగణంలో విసిరేసిన పీపీఈ కిట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నలందా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ప్రాంగణంలో విసిరేసిన పీపీఈ కిట్లు

వెనక్కి తిరిగి వచ్చిన వలస కార్మికులకు టెస్టులు చేయడం, క్వారంటైన్‌లో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ డాక్టర్ వివరించారు.

మరోవైపు క్వారంటైన్ కేంద్రాల నుంచి ప్రజలు పారిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ లోపాలే దీనికి కారణమని వార్తలు వచ్చాయి. కొన్నిచోట్ల అయితే స్క్రీనింగ్ ప్రక్రియే జరగలేదు.

''ఇలాంటి లోపాలన్నీ ఇప్పుడు రాష్ట్రంపై కుంపటిలా తయారయ్యాయి. నిర్లక్ష్యం వల్లే ప్రజలు చనిపోతున్నారు'' అని డాక్టర్ వివరించారు.

''చాలా బాధనిపిస్తోంది''

ఎప్పటికప్పుడు పరీక్షలు, నాణ్యమైన వైద్యం ఇక్కడ ప్రధాన సవాల్‌గా మారుతున్నాయి.

జులై 9న భాగల్‌పుర్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లేటప్పటికి రజనీశ్ భారతికి విపరీతమైన జ్వరం, దగ్గు ఉంది.

వెయిటింగ్ లిస్ట్‌లో చాలా మంది ఉండటంతో పది రోజుల తర్వాత రావాలని అతడికి సిబ్బంది సూచించారు.

అతడి పరిస్థితి రోజురోజుకీ మరింత దిగజారింది. అతడికి వైరస్ సోకిందని తెలియగానే ఆసుపత్రిలో చేర్పించుకున్నారు.

చేరిన రోజు మాత్రమే డాక్టర్ వచ్చారని, ఆ తర్వాత వారం రోజులైనా ఎవరూ కనిపించలేదని ఆయన వివరించారు.

చాలా మంది రోగులకు బయటే ఆక్సీజన్ సిలెండర్‌తో ఇలా కూర్చోబెడుతున్నారు
ఫొటో క్యాప్షన్, చాలా మంది రోగులకు బయటే ఆక్సీజన్ సిలెండర్‌తో ఇలా కూర్చోబెడుతున్నారు

''వార్డు బాయ్ వచ్చి మందులను లోపలకు విసిరేసి వెళ్లిపోయేవాడు. ఐదు రోజులకు ఒకసారి అతడు వచ్చేవాడు. అంతే..''

''నాకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన తర్వాత ఆక్సీజన్ కూడా ఇక్కడ దొరకదేమోనని భయపడేవాణ్ని''

''ఏదైనా అత్యవసర సమయంలో కాల్ చేసేందుకు ఒక ఫోన్ ఏర్పాటుచేశారు. అయితే అది 24x7 పనిచేయదు. అయితే ఎవరైనా వైద్యులు తెలుసుంటే.. కొంచెం త్వరగా వైద్యం అందేది. ముఖ్యంగా డబ్బులు ఉన్నవారు, పలుకుబడి ఉన్నవారు త్వరగా పనులు చేయించుకునేవారు''

''మన కోసం ఎవరైనా వీఐపీలు ఫోన్‌చేస్తే.. వెంటనే పట్టించుకుంటారు''

ఇలాంటివి బిహార్‌లో సాధారణమేనని పట్నాలో పనిచేస్తున్న ఓ సీనియర్ జర్నలిస్టు వివరించారు.

''బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో ప్రముఖులతో ఫోన్ చేయిస్తే పనులు జరుగుతున్నాయి. ఒక్కోసారి పేదలు అయితే ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి వస్తుంది.''

''అయితే కేసులు బాగా పెరిగిన తర్వాత.. ప్రముఖులతో సంబంధాలు కూడా పెద్దగా పని చేయకపోవచ్చు.''

సిబ్బంది కొరత వల్ల కుటుంబ సభ్యులే పీపీఈ కిట్లు లేకుండా పనిచేస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిబ్బంది కొరత వల్ల కుటుంబ సభ్యులే పీపీఈ కిట్లు లేకుండా పనిచేస్తున్నారు

ఇప్పటికే తమపై ఒత్తిడి విపరీతంగా పెరిగిందని గయ జిల్లాలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ డాక్టర్ తెలిపారు.

''ఇక్కడ సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉంది. నేను ఒక్కడినే 50 నుంచి 80 పేషెంట్లను చూడాల్సి వస్తోంది. ఇక్కడ ఒకేఒక నర్సు ఉన్నారు''

తక్కువ జీతాలతోపాటు ఎలాంటి రక్షణ సదుపాయాలు ఇవ్వకపోవడంతో సరిపడా సహాయక సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది కూడా లేరని ఆయన వివరించారు.

''మేం చెప్పే మాట వారు వినరు. వారిని ఏమీ అనలేం. నెలకు 5,000రూ. జీతం ఇచ్చి జీవితం పణంగా పెట్టమంటే ఎలా''

''డాక్టర్లు అందరమూ చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ నాకు చాలా ఆందోళనగా ఉంది. రోజూ తమ ఆప్తులను కోల్పోయిన వారిని చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)