హైదరాబాద్ ఉస్మానియా' హాస్పిటల్‌లోకి వర్షం నీరు.. కొట్టుకుపోయిన పీపీఈ కిట్లు - ప్రెస్‌రివ్యూ

ఉస్మానియా ఆసుపత్రిలో వర్షం నీరు

ఫొటో సోర్స్, Twitter/DKAruna

ఫొటో క్యాప్షన్, ఉస్మానియా ఆసుపత్రి వార్డుల్లో వర్షం నీరు

హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి భారీ వర్షాలకు వణుకుతోందని 'ఈనాడు' వార్తా కథనం ప్రచురించింది.

''రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆసుపత్రిలో భీతావహ వాతావరణం ఏర్పడింది. ఓవైపు కరోనా బాధితుల తాకిడి.. మరోవైపు మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. జలమయమైన వార్డులతో వైద్యులు, సిబ్బంది, రోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది.

బుధవారం భారీ వర్షానికి పలు వార్డుల్లోకి మురుగు నీరు చేరింది. ఆసుపత్రి దిగువ ప్రాంతంలో ఉండటం, పురాతన భవనం కావడం, సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవడం ఈ పరిస్థితికి కారణమైంది.

ఉస్మానియాలో వర్షం నీరు

ఫొటో సోర్స్, Twitter/UttamKumarReddy

ఫొటో క్యాప్షన్, ఉస్మానియా వార్డుల్లో వర్షం నీరు

ఎగువ నుంచి పోటెత్తిన వర్షపు నీరు డ్రైనేజీ నీటితో కలిసి మోకాల్లోతు వరకు వార్డుల్లోకి చేరింది. రోగులు, వారి సహాయకులతో పాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాత భవనంలోని సూపరింటెండెంట్‌ కార్యాలయం, సెంట్రల్‌ స్టెరిలైజేషన్‌ విభాగం, పురుషుల వార్డుల్లోకి నీరు చేరింది.

కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం తెచ్చిపెట్టిన పీపీఈ కిట్లు ఈ వరదనీటిలో కొట్టుకుపోయాయి. కొందరు ఆ దృశ్యాలను ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అవి వైరల్‌ అయ్యాయి.

ఆసుపత్రిలో ప్రస్తుతం 500 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. మూడు బ్లాకుల్లో కలిపి 400 మంది దాకా రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న పాతభవనంలోనే 200మంది చికిత్స పొందుతున్నార''ని ఆ కథనంలో తెలిపారు.

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

ఏపీలో కొత్త జిల్లాలకు గ్రీన్‌ సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌‌వ్యవస్థీకరణకు సీఎస్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని 'సాక్షి' పత్రిక కథనం తెలిపింది.

''ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో భూ పరిపాలన (సీసీఎల్‌ఏ) కమిషనర్, సాధారణ పరిపాలన (సర్వీసులు) కార్యదర్శి, ప్రణాళిక విభాగం కార్యదర్శి.. సీఎంవో నుంచి ఒక ప్రతినిధిని సభ్యులుగా నియమించింది.

రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి, త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కమిటీకి నిర్దేశించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంద''ని ఆ కథనంలో వివరించారు.

బాధిత మేజిస్ట్రేట్

ఫొటో సోర్స్, www.andhrajyothy.com

చిత్తూరు జిల్లాలో దళిత మేజిస్ట్రేట్‌పై దాడి

ఆంధ్రప్రదేశ్‌లో స్థల వివాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దళిత మేజిస్ట్రేట్‌ రామకృష్ణపై దాడికి దిగారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''తనపై దాడి చేసింది వైసీపీ వర్గీయులేనని... వారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన సోదరుడైన ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి మద్దతు ఉందని మేజిస్ట్రేట్‌ ఆరోపించారు. మంత్రి ఒత్తిడితో తన ఫిర్యాదుపై పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని వాపోయారు. మేజిస్ట్రేట్‌ రామకృష్ణ ఎనిమిదేళ్ల కిందట కడప జిల్లా రాయచోటిలో పనిచేస్తూ... జస్టిస్‌ నాగార్జునరెడ్డితో తలెత్తిన వివాదంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. సొంత ఊరైన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట పట్టణం బైపా్‌సరోడ్డులో నివసిస్తున్నారు.

మంగళవారం తెల్లవారుజామున 5-6గంటల నడుమ తనఇంటి పక్కన శబ్దాలు రావడంతో ఆయన బయటికివచ్చి చూశారు. అక్కడ ఖాళీస్థలంలో ఉంచిన ఇటుకలను గుర్తుతెలియని వ్యక్తులు తరలించుకెళుతుండడం కనిపించింది. అడ్డుకుని ప్రశ్నించిన రామకృష్ణపై వారు ఇటుకలతో దాడిచేశారు. ఆయన 100కు కాల్‌చేయడంతో ఒక హెడ్‌కానిస్టేబుల్‌ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దాడికి పాల్పడినవారు పరారయ్యారు.

'అక్కడ జరిగిన విషయం ఎస్‌ఐకి వివరిస్తున్న సమయంలోనే మంత్రి పెద్దిరెడ్డి నుంచి ఎస్‌ఐకి ఫోన్‌ వచ్చింది. నా ఫిర్యాదును పట్టించుకోవద్దని మంత్రి చెప్పారు. దీంతో ఎస్‌ఐ కేసు నమోదు చేయకుండా వెళ్లిపోయారు'' అని రామకృష్ణ వివరించారు.

అనంతరం తాను ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా పోలీసుల ద్వారా వస్తేనే చికిత్స అందిస్తామని వైద్యులు చెప్పారని, దాంతో తాను మదనపల్లె వెళ్లి ప్రైవేటు ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ వైద్యుడి వద్ద వైద్యం చేయించుకున్నానని వివరించారు. తనపై దాడికి పాల్పడినవారికి మంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరుడైన ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి మద్దతు ఉందని ఆరోపించారు. కాగా మేజిస్ట్రేట్‌ రామకృష్ణ ఆరోపణలను బి.కొత్తకోట ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ ఖండించారు. 'కేసు వద్దు సమస్య పరిష్కారమైతే చాలని ఆయనే వెళ్లిపోయారు. సమస్య ఏమిటో స్పష్టత లేకుండా ఏమని కేసు ఫైల్‌ చేయాలి?'' అని ఎస్‌ఐ ప్రశ్నించారు. ఈ వివాదంతో మంత్రి పెద్దిరెడ్డికి, ఆయన సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఐఏఎస్‌లు

ఫొటో సోర్స్, Ntnews.com

తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీచేసిందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారిని బదిలీ చేసింది.

దిల్లీలో తెలంగాణ భవన్‌ ఓఎస్డీగా ఉన్న ముర్తుజా రిజ్వీకి ఆ బాధ్యతలు అప్పగించింది. శాంతికుమారిని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సాగునీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌అండ్‌ టెక్నాలజీ బాధ్యతలను అదనంగా చూడనున్నారు.

కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గాఉన్న యోగితారాణాను బదిలీచేసి ఆ స్థానంలో వాకాటి కరుణకు బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరికి అదనంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించార''ని అందులో వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)