కరోనావైరస్: షిర్డీలో సాయిబాబా ఆలయం మూసివేత... బెజవాడ కనకదుర్గమ్మ, సింహాచలం ఆలయాల్లోనూ ముందు జాగ్రత్త చర్యలు

కరోనావైరస్

ఫొటో సోర్స్, https://www.sai.org.in/

ఫొటో క్యాప్షన్, షిర్డీలో సాయిబాబా ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించిన షిర్డీ సంస్థాన్

దేశంలో కరోనావైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఆలయాలు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ఒకే చోట పదుల సంఖ్యలో జనం గుమిగూడవద్దన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.

దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తుల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు షిర్డీ సాయిబాబా సంస్థాన్ వెల్లడించింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభించేది భక్తులకు త్వరలోనే సమాచారం అందిస్తామని ప్రకటించింది. కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థాన్ ప్రకటించింది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, www.siddhivinayak.org

ఫొటో క్యాప్షన్, ముంబై సిద్ధి వినాయక ఆలయం మూసివేత

సిద్ధి వినాయక ఆలయం..

ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని కూడా సోమవారం సాయంత్రం నుంచే మూసివేశారు. భక్తుల రాకపోకల్ని నిలిపివేశారు. మళ్లీ ఎప్పటి నుంచి దర్శనాలను ప్రారంభిచేది త్వరలోనే సమాచారం ఇస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

మహారాష్ట్రలో వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దర్శనానికి వచ్చే భక్తుల శ్రేయస్సు దృష్ట్యా ఆలయ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భక్తుల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేయడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్వహాకులు వెల్లడించారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, www.facebook.com/TirumalaTirupatiDevasthan

ఫొటో క్యాప్షన్, తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రాకపోకలు

ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా భక్తుల రాకపోకలు గతంతో పోల్చితే తగ్గాయి. సెలవు రోజుల్లో 60వేలకు పైగా భక్తులు దర్శనం చేసుకుంటున్నప్పటికీ మామూలు రోజుల్లో మాత్రం 45వేలకు అటూ ఇటూగా ఉంటున్నారు.

తిరుమల అధికార వెబ్ సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం మార్చి 16వ తేదీ ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 44,140 మాత్రమే. ఇదే మార్చి 15న దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,747. ప్రస్తుతానికి భక్తుల రాకపోకలపై ఎలాంటి ప్రత్యేక ఆంక్షలు లేకపోయినప్పటి... వీలైనంత వరకు తిరుమల రావాలనుకునే వాళ్లు తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడమే మంచిదని టీటీడీ సూచిస్తోంది.

ద‌ర్శ‌నాల‌కు ముందుగా రిజ‌ర్వ్ చేసుకున్న వాళ్ల‌కు వాయిదా వేసుకుని తేదీలు స‌ర్దుబాటుకి అవ‌కాశం ఇస్తున్నట్టు తెలిపింది. రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు చేసుకుంటే న‌గ‌దు వాప‌స్ ఇచ్చేందుకు టీటీడీ నిర్ణ‌యించింది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
కరోనావైరస్

ఫొటో సోర్స్, bhadrachalarama.org/

ఫొటో క్యాప్షన్, భద్రాచలంలో నిరాడంబరంగా శ్రీరామ నవమి వేడుకలు

భక్తులు లేకుండానే భద్రాద్రి రాముని కల్యాణం

కరోనావైరస్ ప్రభావం భద్రాద్రిపై కూడా పడింది. ఏటా వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణాన్ని ఈ సారి భక్తులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీరామ నవమి వేడుకల్ని ఆలయ ప్రాంగణంలోనే నిర్వహిస్తామని అన్నారు.

కరోనావైరస్
ఫొటో క్యాప్షన్, విజయవాడ కనక దుర్గ ఆలయంలో ముందు జాగ్రత్తలు

దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో ముందు జాగ్రత్త చర్యలు

విజయవాడ కనకదుర్గ ఆలయానికి కూడా భక్తుల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరోవైపు అధికారులు కూడా భక్తుల రాకపోకలపై తాత్కాలికంగా ఆక్షలు విధించారు.

విదేశాల నుంచి, దూర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు కొద్ది రోజుల పాటు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపారు.

పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్ల పైబడి వృద్ధులు మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని కోరారు.

ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామని, భక్తులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు.

కరోనావైరస్
ఫొటో క్యాప్షన్, సింహాచలం దేవస్థానంలో ముఖానికి మాస్కులు కట్టుకొని విధులకు హాజరైన అర్చకులు

మాస్కులతో నిత్యపూజలు

ఉత్తరాంధ్రలో ప్రముఖ దేవాలయం సింహాచలంలోనూ దర్శనానికొచ్చే భక్తులపై ఆంక్షలు విధించారు ఆలయ అధికారులు . కరోనావైరస్ ముప్పును దృష్టిలో పెట్టుకొని వృద్ధులు, 12 ఏళ్ల లోపు పిల్లలు దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని ఆలయ ఈవో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.

ముందు జాగ్రత్తలో భాగంగా అర్చకులు, దేవస్థానం సిబ్బంది మాస్కులతోనే విధులకు హాజరవుతున్నారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉండై క్యూలైన్లు, నిత్య అన్నదాన సత్రం, ప్రసాదం క్యూలైన్లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉండేట్టు చూస్తున్నామని, భక్తులకు శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచామని ఈవో తెలిపారు.

దేవస్థానం నిర్వహించే ప్రధాన ఉత్సవాలు, పూజాది కార్యక్రమాలు భక్తులు లైవ్ టెలీకాస్ట్‌ ద్వారా వీక్షించడం మంచిదని సూచించారు.

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)