మహారాష్ట్ర సీఎం ఎవరు.. ‘ఎన్‌సీపీకి గవర్నర్ ఇచ్చిన గడువు రాత్రి 8.30’

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల మధ్య సంప్రదింపులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరవుతారన్న అంశంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. శివసేన పార్టీలో నలుగురు నేతలకు సీఎం అయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆ నలుగురిలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా ఉన్నారు.
ఆదిత్య ఠాక్రే (ఉద్ధవ్ కుమారుడు)ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు శివసేన నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లు ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్ద ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ముంబయిలో కొన్ని చోట్ల మాత్రం ఉద్ధవ్ సీఎం కావాలంటూ కొత్తగా పోస్టర్లు, హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి.
ఇప్పటివరకూ ఠాక్రే కుటుంబం నుంచి ఎవరూ ప్రభుత్వంలో పదవులు చేపట్టలేదు. అయితే, ప్రభుత్వంలో లేకపోయినా, ఉద్ధవ్ అనుకున్నది చేయించగలరు. అందుకే ఠాక్రే బ్రాండ్ రాజకీయాలను వర్ణించేందుకు విశ్లేషకులు రిమోట్ కంట్రోల్ అన్న పదం వాడుతుంటారు.
ఉద్ధవ్‌ను అప్పట్లో విశ్లేషకులు మెతక మనిషి అని అనుకునేవారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన బహిరంగంగా పాల్గొనడం మొదలుపెట్టాక, చిన్నాన్న కుమారుడు రాజ్ ఠాక్రేతో పోలికను ఎదుర్కోవాల్సి వచ్చేది.
అయితే, 2006లో రాజ్ ఠాక్రే శివసేన వదిలివెళ్లాల్సి వచ్చాక, ఉద్ధవ్ అనుకున్నంత మెతక కాదని స్పష్టమైంది.
అంతకుముందు పార్టీలో కీలకనేతగా ఉన్న నారాయణ్ రాణేను కూడా ఉద్ధవ్ శివసేన నుంచి సాగనంపారు.
పార్టీపై ఉద్ధవ్‌కు గట్టి పట్టుంది. సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసే విషయంలో ఆయనకు అది ఎంతో అవసరం.
మెతక వైఖరి, ఓర్పు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడంలో ఉద్ధవ్‌కు కలిసివస్తాయని సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ సూర్యవంశీ అన్నారు.
ఉద్ధవ్‌కు పాలనాపరమైన అనుభవం అసలే లేదు. అయితే, సీఎం పదవి చేపట్టేందుకు ఇది అడ్డు కాదని, ఇందుకు చాలా ఉదాహరణలున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దేవేందర్ ఫడ్నవీస్ కూడా సీఎం కాకముందు పెద్ద పదవులేమీ చేపట్టలేదు. నాగ్‌పూర్ మేయర్‌గా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది.
ప్రధాని పదవి చేపట్టేముందు రాజీవ్ గాంధీ పరిస్థితి కూడా ఇలాంటిదే.

ఫొటో సోర్స్, facebook
మహారాష్ర సీఎం పదవి రేసులో వినిపిస్తున్న మరో పేరు ఆదిత్య ఠాక్రే.
ఆదిత్య ఎన్నికల బరిలో దిగడం ఇదే మొదటిసారి. ఆయన ఫొటో, దాని కింద 'నా ఎమ్మెల్యే.. నా ముఖ్యమంత్రి' అన్న క్యాప్షన్‌తో ఉన్న పోస్టర్లు నవంబర్ మొదటి వారంలో ముంబయిలో చాలా చోట్ల కనిపించాయి.
బీజేపీతో కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ఆదిత్య ఠాక్రేకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన కోరుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే, ఆ ప్రచారమంతా ఒత్తిడిని పెంచే ఓ రాజకీయ వ్యూహం కావొచ్చని సుధీర్ సూర్యవంశీ అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగడం, కూటమిలో ఆ పార్టీ 'పెద్దన్న' పాత్ర పోషించడం శివసేనకు అంతగా రుచించలేదని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పాత మిత్రుడితో బంధం తెంచుకుంటేనే, ఆ పార్టీ విశ్వసనీయతను కాపాడుకుంటూ మరింత విస్తరించగలుగుతుదందని అభిప్రాయాలు వినిపించాయి.
మరోవైపు ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేలని శివసేనకు ఎన్సీపీ సంకేతాలు పంపిందని సుధీర్ సూర్యవంశీ అంటున్నారు.
ఉద్ధవ్‌లాగే ఆదిత్యకు పాలనాపరమైన అనుభవం లేదు.
యువకుడు కావడం, అందరితో కలిసిపోయే స్వభావం ఆదిత్యకు ఉపకరిస్తాయని శివసేనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు అంటున్నారు.
ఆదిత్య ఠాక్రే పార్టీలో క్రియాశీలంగా మారినప్పటి నుంచి వాలెంటైన్స్ డే వంటి వేడుకలకు శివసేన నుంచి వ్యతిరేకత తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, శివసేనపై బహిరంగ దాడికి దిగడం బీజేపీకి అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. మళ్లీ ఆ రెండు పార్టీలు కలిసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
ఠాక్రే కుటుంబ సభ్యులు కాకుండా, ముఖ్యమంత్రి పదవి రేసులో శివసేన నాయకులు ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయ్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఏక్‌నాథ్ శివసేన శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయనకు కూడా పార్టీపై మంచి పట్టుంది.
ఇదివరకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
ఠాణే ప్రాంతంలో శివసేనను బలోపేతం చేసేందుకు ఏక్‌నాథ్ చాలా కృషి చేశారు. మునుపటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినందువల్ల, ఆయనకు ఇతర పార్టీల్లోని నేతలతోనూ మంచి సంబంధాలున్నాయి.
సుభాష్ దేశాయ్ చాలా కాలంగా ఠాక్రే కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఉన్నారు. ఆయనకు కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘గడువు రాత్రి 8.30’
ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని ఆదివారం ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని గంటలకు రెండో అతిపెద్ద పార్టీ అయిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే తాము ఉన్నట్లు గవర్నర్‌కు తెలిపినట్లు ఆదిత్య ఠాక్రే సోమవారం మీడియాకు చెప్పారు. తాము రెండు రోజుల సమయం కావాలని గవర్నర్‌ను కోరామని, అందుకు ఆయన నిరాకరించారని అన్నారు.
మరోవైపు మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్‌సీపీని కూడా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. ఆ పార్టీ నాయకులు అజిత్ పవార్, చగన్ భుజ్‌బల్ గవర్నర్‌ను కలిశారు.
మిత్ర పక్షాలను సంప్రదించి తమ పార్టీ నిర్ణయం చెబుతామని గవర్నర్‌కు తెలియజేసినట్లు ఎన్‌సీపీ నాయకుడు జయంత్ పాటిల్ మీడియాకు చెప్పారు. మంగళవారం రాత్రి 8.30 వరకూ గవర్నర్ గడువు ఇచ్చినట్లు తెలిపారు.
ఇప్పుడు బీజేపీ వేచి చూసే ధోరణిలో ఉంది.
ఇవి కూడా చదవండి
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- రాత్రంతా మేలుకునే ఉండాలని డాక్టర్లు చెబుతున్నారెందుకు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- వాతావరణ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాం - 11 వేల మంది శాస్త్రవేత్తల హెచ్చరిక
- సముద్ర తీరంలో మంచు బంతులు.. ఎలా వచ్చాయంటే..
- మాస్టొడాన్: ట్విటర్‌ను వదిలి చాలా మంది ఈ యాప్‌కు ఎందుకు మారిపోతున్నారు...
- రాత్రంతా మేలుకునే ఉండాలని డాక్టర్లు చెబుతున్నారెందుకు
- ప్రొఫెసర్ బ్యాగులో దొరికిన మాజీ విద్యార్థిని చేతులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








